ఇసుకే బంగారమాయెనా...!
యథేచ్ఛగా నదుల్లో అక్రమ తవ్వకాలు
రూ.కోట్లలో వ్యాపారం
ఇంకిపోయిన భూగర్భజలాలు
దెబ్బతింటున్న వంతెనలు, గ్రోయిన్లు
ఇటీవల కురిసిన వర్షాలకు నదుల్లో భారీగా ఇసుక చేరింది. నదులన్నీ ఎండిపోయి ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయి. మరో పక్క రెవెన్యూ శాఖాధికారులు సమ్మెలో ఉన్నారు. ఇకనేం అక్రమార్కులకు భలే కలిసొచ్చింది. ఎక్కడపడితే అక్కడ ఇసుక ర్యాంపులు ఏర్పాటై తవ్వుకున్న వారికి తవ్వుకున్నంత ఇసుక....అన్నట్టుగా దందా సాగిపోతోంది. జిల్లాలో అనుమతి పొందిన ఇసుక ర్యాంప్‌లు ఎక్కడా లేకపోయినా ఎక్కడపడితే అక్కడ పుష్కలంగా దొరుకుతుంది. ఇటు నదీ వనరులకు, అటు ప్రభుత్వ ఖజానాకు తూట్లు పడుతోంది. ఇసుకాసురులకు సిరులు కురిపిస్తోంది.
ప్రస్తుతం అటు విశా ఖ నగరంలోనూ, జిల్లాలో నూ నిర్మాణాలు జోరుగా సాగుతుండడంతో ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా బంగారంలా ఇసుక ఖరీదు రోజురోజుకి పెరిగిపోయింది.ఈ పరిస్థితి ఇసుక మాఫియాకు తెరతీసింది. ఈ మాఫియాకు కొందరు సర్పంచ్ల మద్దతు తోడైంది. దీంతో వ్యాపారం లారీలు ఆరు ట్రాక్టర్లుగా సాగిపోతోంది. గ్రామానికి కట్టుబాటు కింద ఎంతో కొంత ముట్టచెప్పి తమ దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. గతంలో 3వేల రూపాయలు లోపు ఉండే లారీ ఇసుక ఇప్పుడు ఏకంగా 10వేల రూపాయలకు పైబడి అమ్ముతున్నారు...కోట్లు గడిస్తున్నారు.
అధికారుల తీరు షరా ‘మామూలే’
శారద, బొడ్డేరు,పెద్దేరు, తాచేరు, తాండవ, వరహా నదులలోనే కాకుండా కొండగెడ్డల్లో కూడా అక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. చోడవరం, దేవరాపల్లి, బుచ్చెయ్యపేట, మాడుగుల, చీడికాడ మండలాల పరిధిలో ఇసుక తవ్వకాలకు అడ్డులేకుండా పోయింది. తారువ, బోయిల కింతాడ, గవరవరం, విజయరామరాజుపేట, కుముందానిపేట, వడ్డాది, గౌరీపట్నం, గోవాడ, అంబేరుపురం, గజపతినగరం, జుత్తాడ, ముద్దుర్తి, వీరనాయణం, వీరవిల్లి అగ్రహారం,అంకుపాలెం గ్రామాల సమీపంలో నదుల్లో భారీగా ఇసుక తవ్వేస్తున్నారు.
చోడవరం మండలం వెంకన్నపాలెంతోపాటు పలుచోట్ల ఎక్కడపడితే అక్కడ స్టాక్ పాయింట్లు ఉన్నాయి. చోడవరం పోలీసు స్టేషన్‌ముందు నుంచే రోజూ వంద వరకు ఇసుకలోడుతో లారీలు వెళుతుంటాయి. అలాగే అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు రోజూ ఈ జంక్షన్ మీదుగానే రాకపోకలు సాగిస్తున్నా ఈ ఇసుక దందా వారికి పట్టడం లేదు. దీనివల్ల రాత్రిపగలు తేడాలేకుండా ఈ అక్రమ వ్యాపారం సాగుతోంది.
వంతెనలు, గ్రోయిన్లకు ముప్పు
నదుల్లో జరిగే అక్రమ తవ్వకాల వల్ల వంతెన్లు, గ్రోయిన్ల దెబ్బతింటున్నాయి. మరోపక్క భూగర్భ జలాలు ఇంకిపోయి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ, మంచినీటి బోర్ల నుంచి నీరు రాని పరిస్థితి నెలకింది. బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేసేవారికి ఆ నీరు రాకుండా పోయే దయనీయ పరిస్థితి ఏర్పడింది. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణం ఇసుక తవ్వకాలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.