పాలమూరు ప్రాజెక్టులపై సీఎం సమీక్ష
జూరాల-పాకాల, పాలమూరు పథకాల వేగం పెంచాలని ఆదేశం
గద్వాల: జిల్లాలోని భారీనీటి పారుదల ప్రాజెక్టు, జూరాల రిజర్వాయర్ ఆధారంగా మూడు జిల్లాలో సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టదలచిన పథకాల వేగాన్ని పెంచాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. జూరాల-పాకాల ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టాలని నిర్ణయించిందని, ఈ బడ్జెట్లోనే రెండు ప్రాజెక్టులకు నిధులను కేటాయించనున్నామని ఇందుకోసం వెంటనే సర్వే పనులను చేపట్టాలన్నారు. దీంతో జూరాల ప్రాజెక్టు ద్వారా దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే రెండు భారీ సాగునీటి ప్రాజెక్టులకు త్వరలోనే శ్రీకారం చుట్టే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే ప్రాజెక్టుల కేంద్రంగా ఉన్న జూరాల ప్రాజెక్టు మరో రెండు సాగునీటి ప్రాజెక్టులతో పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో సాగు, తాగునీటికి అందించే ప్రాజెక్టుగా మారబోతుంది.
తెలంగాణకు వరదాయిగా జూరాల...
పశ్చిమ కనుమల్లో ప్రారంభమై మహారాష్ట్ర, కర్ణాటకల మీదుగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే కృష్ణానదిపై పాలమూరు జిల్లాలో నిర్మితమైన జూరాల ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికే వరదాయినిగా మారబోతుంది. జూరాల ప్రాజెక్టు ఆధారంగా ఆరు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సుమారు 25లక్షల ఎకరాలకు సాగునీటినందించే ప్రాజెక్టులు రాబోతున్నాయి. దీనికితోడు పాలమూరు జిల్లాలో ముఖ్యమైన పట్టణాలకు తాగునీటినందించే పథకాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
వీటికితోడు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా విద్యుత్‌ను అందిస్తూనే, థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణానికి జూరాల రిజర్వాయర్ కీలకం కాబోతుంది. అలాగే జూరాల ప్రాజెక్టు పరిధిలో లక్ష ఎకరాల ఆయకట్టు, భీమా ఎత్తిపోతల పథకం ద్వార ప్రాజెక్టు పరిధిలో 2లక్షల ఎకరాాల ఆయకట్టు నీళ్లు అందుతాయి. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 2లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించనున్నారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పరిధిలో 30 వేల ఎకరాల ఆయకట్టు, పాలమూరు ఎత్తిపోతల పథకం పరిధిలో మూడు జిల్లాలు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండలలో 10లక్షల ఎకరాల ఆయకట్టు నీళ్లు అందించాలన్నది లక్ష్యం.