ప్రజల మనిషి
ఖమ్మం అర్బన్ : ఖమ్మం శివారు ధంసలాపురం అగ్రహారం కాలనీ పరిధిలోని పాఠశాలలో 1.20 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం గల ఓవర్హెడ్ ట్యాంకు ఉంది. ధంసలాపురం పంచాయతీగా ఉన్నప్పుడే ఇక్కడ 750 నల్లాలు ఉండేవి. నగరపాలక సంస్థలో ఈ పంచాయతీ విలీనమైనా గత ఏడాది వరకు ఇక్కడి ప్రజలు ఆ ట్యాంకు ద్వారా నీరు అందేది. ట్యాంకుకు నీటి సరఫరా చేసేందుకు ఐదు బోర్లు, ఒక బావిని ప్రభుత్వం ఏర్పాటి చేసింది.
అయితే కొంత కాలంగా రెండు బోర్లు, బావిలో నీరు అడుగంటి పోయాయి. దీంతో ట్యాంకుకు నీటి సరఫరా అంతంత మాత్రంగా అందేవి. దీంతో నీరు సరిపోక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగునీటి కోసం అలమటించారు. తమ అవస్థలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయినా వారి సమస్యకు పరిష్కారం లభించలేదు. ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయాడు రైతు ఆళ్ల వెంటకరెడ్డి. కాలనీకి ఆనుకున్న తన వ్యవసాయ బావి నుంచి నీళ్లు ఇచ్చేందుకు ముందుకొచ్చాడు.
కాలనీలోని సుమారు ఐదు వేల మంది జనాభా కలిగిన సుమారు 1400 కుటుంబాలకు ‘జల’ ఔదార్యం చేసేందుకు పూనుకున్నారు. వెంకటరెడ్డి నిర్ణయాన్ని నగరపాలక సంస్థ అప్పటి కమిషనర్ శ్రీనివాస్ అభినందించారు. ఆయన బావి నుంచి ఓవర్హెడ్ ట్యాంకుకు నీటి సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు. బావికి పైప్లైన్లు ఏర్పాటు చేసి ఓవర్హెడ్ ట్యాంకుకు ఎక్కిస్తున్నారు.
భూమి బీడుగా మార్చుకుని...
వెంకటరెడ్డి తనకున్న రెండెకరాల భూమిలో ఈ బావి ఆధారంగానే వ్యవసాయం చేసుకునే వాడు. ఈ ఏడాది గ్రామానికి నీటి సరఫరా చేయాల్సి రావడంతో పంట నష్టపోయినా పర్వాలేదనుకున్నాడు. ప్రజలు మాత్రం నీటి కోసం ఇబ్బందులు పడొద్దనుకుని నాట్లు వేయకుండా భూమిని బీడుగానే వదిలేశాడు. బావిలో పూడిక తీసి నిరాటకంగా నీటిని సరఫరా చేసేందుకు తాను సిద్ధమేనని కార్కొరేషన్ అధికారులతో ఇప్పటికే చెప్పేశాడు.