కాలుష్యాన్ని దూరంచేసే 'హెల్ప్ ఛాట్'
ప్రస్తుత వాతావరణంలో ఏర్పాడుతున్నపొల్యూషన్ నిరోధించేందుకు ప్రభుత్వం ప్రజలతో కలిసి తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పుడు కొత్తగా మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన 'హెల్ప్ ఛాట్' యాప్ భారతీయ పౌరులకు వాయు కాలుష్యం నాణ్యత, స్థాయిలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. పొల్యూషన్ నుంచి విముక్తిని పొందేందుకు హెల్ప్ ఛాట్ ఉపయోగ పడుతుంది. తమ పరిసరాల్లోని వాతావరణంలో గాలి నాణ్యతను పరిశీలించే సామర్థ్యాన్నిఈ యాప్ కలిగి ఉంది.
వినియోగదారులు ఒకవేళ విషపూరితమైన శ్వాసను పీలుస్తుంటే... ఈ యాప్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివిధ మార్గాల్లో సూచిస్తుంటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ద్వారా 0 (జీరో) నుంచి 500 దాకా వాయు నాణ్యతను గుర్తిస్తుంది. అంటే కాలుష్యం పూర్తిగా లేనప్పుడు జీరో నుంచి అత్యంత కాలుష్య పూరిత మైన గాలి ఉన్నపుడు 500 వరకూ నాణ్యతను ఈ యాప్ తెలుపుతుంది. అంతేకాదు గాలి నాణ్యతను బట్టి వినియోగదారుల స్మార్ట్ ఫోన్ కు ముందు జాగ్రత్త హెచ్చరికను కూడా పంపుతుంది.
నగరాల్లో పొల్యూషన్ ఉన్న ప్రాంతాలను, నష్టాన్ని కలిగించే ప్రాంతాలను ఈ యాప్ సూచిస్తుంది. ఊపిరితిత్తులకు నష్టం కలిగించే, అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే కొన్ని కెమికల్స్ ను కూడా ఇందులోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) సూచిక గుర్తిస్తుంది. స్థానిక వాతావరణ పరిస్థితులను ట్రాక్ చేసి, సరైన సమయంలో వినియోగదారులకు అందిస్తుంది. ఎయిర్ పొల్యూషన్ తో బాధపడుతున్నప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు సహాయపడే ఈ అనువర్తనాన్నిఅభివృద్ధిపరచాలని అనుకున్నామని, మేమిచ్చే ముందు జాగ్రత్త హెచ్చరికలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నామని హెల్స్ ఛాట్ రూపకర్త, సీఈవో అంకుర్ సింగ్లా చెప్తున్నారు.
గాలిలోని కార్బన్ మోనాక్సైడ్, వోలాటైల్ వంటివి పీల్చుకోవడం వల్ల గొంతు, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులు రావడమే కాక గుండె నొప్పి, లివర్, బ్రెయిన్ డ్యామేజ్ కూడ జరిగే ప్రమాదం ఉంది. క్యాన్సర్ కు కూడా ఈ కెమికల్స్ కారణమౌతాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ హెల్ప్ ఛాట్ ముఖ్యంగా పొల్యూషన్ అధికంగా ఉండే ఢిల్లీ వంటి నగరాల్లో ఉపయోగపడుతుంది. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య సమస్య తీర్చడానికి, మా ప్రయత్నంలో హెల్స్ ఛాట్ ఒక భాగమని అంకుర్ చెప్తున్నారు. త్వరలో దేశంలోని అన్ని నగరాలకు సంబంధించిన పొల్యూషన్ రికార్డును సేకరించి హెల్స్ ఛాట్ ను అభివృద్ధి పరుస్తామని అంటున్నారు. ఈ హెల్ప్ ఛాట్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.