Helpline desk
-
హలో సార్.. వచ్చి డెత్ సర్టిఫికెట్ తీసుకెళ్లండి
చిన్నపాటి నిర్లక్క్ష్యం ఒక్కోసారి పెద్ద అనర్థాలకే దారి తీస్తుంది. కరోనా టైంలో ప్రజా సంక్షేమం గురించి బాగానే ఆరాలు తీసిన అధికారులు.. చిన్న తప్పిదంతో బతికున్న ఓ వ్యక్తిని రికార్డులో చంపేశారు. అంతేకాదు కాల్ చేసి మరీ మరణ ధృవీకరణ పత్రం తీసుకెళ్లమని ఆయనకే ఫోన్ చేసి చెప్పారు. ఊహించని ఆ అనుభవంతో ఖంగుతిన్న ఆయన.. మీడియా ముందుకు వచ్చాడు. ముంబై: థానే మాన్‌పడాలో టీచర్‌గా పనిచేస్తున్నాడు చంద్రశేఖర్ దేశాయ్(54). కిందటి ఏడాది ఆగష్టులో ఆయన కరోనా వైరస్ బారినపడి కోలుకున్నాడు. ఇంట్లో ఉండే ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఐసోలేషన్ టైంలో తన ఆరోగ్యం గురించి మున్సిపాలిటీ అధికారులు రోజూ ఆరాతీస్తుంటే మురిసిపోయాడాయన. కట్ చేస్తే.. ఈమధ్యే ఆయనకు మరో కాల్ వచ్చింది. ఈసారి ఆయన కూడా ఊహించని ప్రశ్న ఎదురైంది. థానే మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి ఓ మహిళా ఆఫీసర్ ఆయన నెంబర్‌కు కాల్ చేసి.. చంద్రశేఖర్ దేశాయ్ పేరు మీద డెత్ సర్టిఫికెట్ సిద్ధమైందని, వచ్చి తీసుకెళ్లాలని కోరింది. అయితే తాను బతికే ఉన్నానని చెప్పడంతో ఆమె కంగారుపడిపోయింది. ఆ ఇంట్లో ఇంకెవరైనా కొవిడ్‌తో చనిపోయారా? అని ఆమె ఆరా తీసిందట. ‘లేదు’ అని చెప్పడంతో ఆ కాల్ కట్ అయిపోయిందని చంద్రశేఖర్ మీడియా ముందు వాపోయాడు. ఇక ఈ ఘటన తర్వాత సరాసరి థానే మున్సిపాలిటీ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లాడాయన. అక్కడి అధికారులకు ఘటనపై ఫిర్యాదు చేశాడు. మున్సిపాలిటీ వాళ్లు పంపకుండా ఐసీఎంఆర్‌కు తన పేరు ఎలా వెళ్లిందని, దీనికి సమాధానం కావాలని కోరుతున్నాడాయన. ఇక ఈ ఘటనపై టీఎంసీ అధికారులు స్పందించారు. పొరపాటు జరిగిందని చెబుతూ.. దానిని సవరించే ప్రయత్నం చేస్తారని వెల్లడించారు. చదవండి: చిన్నగొడవ.. డాక్టర్ దంపతుల ఆత్మహత్య -
డీలర్లు ఉచిత రేషన్ ఇవ్వకపోతే ఇలా చేయండి?
హైదరాబాద్: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ లు విధించాయి. ఈ లాక్ డౌన్ వల్ల పని దొరక్క పేద ప్రజలు ఆకలితో అలమటించి పోతుంటే వీరిని దృష్టిలో పెట్టుకొని మే, జూన్ నెలల్లో పేదలకు ఉచితంగా రేషన్ అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ప్రతి ఒక్కరికీ 5 కిలోల ఆహార ధాన్యాలు పేదలకు ఉచితంగా లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలోని 80 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం చేకూరనుంది. అయితే, కొందరు రేషన్ డీలర్లు ఉచిత ఆహార ధాన్యాలను పేదలకు అందకుండా అడ్డుకుంటున్నారు. ఒకవేల మీ గ్రామంలో గనుక రేషన్ కార్డు ఉన్న రేషన్ డీలర్లు మీ కోటా ఆహార ధాన్యాలను అందించడానికి నిరాకరిస్తే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. దీనికోసం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్(ఎన్ఎఫ్ఎస్ఏ)లో దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను అందించారు. మీరు డీలర్లకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలనుకుంటే ఫోన్ చేసి తెలుపవచ్చు. అలాగే మెయిల్ చేసే సదుపాయం కూడా ఉంది. ఎన్ఎఫ్ఎస్ఏ వెబ్సైట్(https://nfsa.gov.in)కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే, ఇతర సహాయం కోసం వారిని సంప్రదించవచ్చు. పోర్టల్ ఓపెన్ చేశాక కుడి భాగంలో ఆన్లైన్ కంప్లయింట్ కింద ఉన్న హెల్ప్‌లైన్ టెలీఫోన్ నంబర్స్ క్లిక్ మీద చేసి మీ రాష్ట్రానికీ చెందిన నంబర్లు తెలుసుకోవచ్చు. హెల్ప్‌లైన్ నంబర్లు: ఆంధ్రప్రదేశ్ : 7093001872, 04023494822, 04023494808, 18004252977, 1967. తెలంగాణ : 04023310462, 180042500333, 1967. చదవండి: ఆన్లైన్లో బాల్ ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? -
ఆటోడ్రైవర్ల ఆట కట్టు
సాక్షి, ముంబై: రైల్వేస్టేషన్ల వద్దప్రయాణికులను ఎక్కించుకునేందుకు నిరాకరిస్తున్న ట్యాక్సీడ్రైవర్లపై చర్యలు తీసుకునే దిశగా ట్రాఫిక్ శాఖ అడుగులు వేసింది. ఇటువంటి వారిపై ఫిర్యాదు చేయడానికి ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో హెల్ప్‌లైన్ డెస్క్‌ను ప్రారంభించింది. గతంలో ఎవరైనా ట్యాక్సీడ్రైవర్లు ప్రయాణికులను ఎక్కించుకునేందుకు నిరాకరిస్తే వారిపై సమీపంలోని ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చేది. ఇక ముందు అలా కాకుండా నేరుగా రైల్వేస్టేషన్ సమీపంలో ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్ డెస్క్‌లను ప్రయాణికులు ఆశ్రయించాల్సి ఉంటుంది. ఈ హెల్ప్‌లైన్ డెస్క్‌లను ఏర్పాటు చేయడానికి రెండు కారణాలున్నాయని ట్రాఫిక్ విభాగం అధికారి ఒకరు వెల్లడించారు. ప్రయాణికులను తరలించేందుకు నిరాకరించిన వారిపై చర్యలు తీసుకోవడమేకాకుండా మహిళల భద్రతను కూడా దష్టిలో ఉంచుకొని దీనిని ఏర్పాటు చేసినట్లు తెలి పారు. ఈ విషయమై ట్రాఫిక్ విభాగం సంయుక్త కమిషనర్ డాక్టర్.బి.కె.ఉపాధ్యాయ మాట్లాడుతూ.. ఆరు ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో హెల్ప్‌లైన్ డెస్క్‌లను ఏర్పాటు చేశామన్నారు. దాదర్, లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ), ముంబై సెంట్రల్, బోరి వలి, ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), బాంద్రా టెర్మినస్‌లో వీటిని ఏర్పాటు చేశామన్నారు. ఇందు లో సిబ్బంది షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తారు. పదిరోజుల క్రితమే వీటిని ప్రారంభించామన్నారు. రైల్వేస్టేషన్ల ఆవరణలోని ప్రీపెయిడ్ బూత్‌లు, అదేవిధంగా ఆటో, ట్యాక్సీ స్టాండ్ల సమీపంలోనే హెల్ప్‌లైన్ డెస్క్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఈ డెస్క్‌లు ఏర్పాటైనందువల్ల ఆటో డ్రైవర్లు కూడా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడానికి నిరాకరించబోరని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా మహిళలకు కూడా భద్రత కల్పించినట్లు అవుతుందని ఆ యన తెలిపారు. రాత్రివేళ్లలో ఆటోలు, ట్యాక్సీలలో రాకపోకలు సాగించే ప్రయాణికులతోపాటు ఆటో, ట్యాక్సీడ్రైవర్ల వివరాలను కూడాసేకరించాలని డెస్క్ సిబ్బందిని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఇటీవల సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన తెలుగమ్మాయి ఎస్తేర్ అనూహ్య హత్యకు గురికావడంతో మహిళల భద్ర త అంశం చర్చకు వచ్చిందని, అందుకే ఈ డెస్క్‌ను ప్రారంభించామని ఉపాధ్యాయ తెలిపారు. సీఎస్టీ, ముంబై సెంట్రల్ల స్టేషన్ల వద్ద ఏర్పాటుచేసిన హెల్ప్‌డెస్క్‌ల వద్ద ఇద్దరు ట్రాఫిక్ సిబ్బందిని ఉంచుతారు. దాదర్, బాంద్రా టెర్మినస్, బోరివలిలలో ఒక్కొక్కరు విధులు నిర్వహిస్తున్నారు. ఎల్టీటీ వద్ద ఒక అధికారితోపాటు ఏడుగురు ట్రాఫిక్ సిబ్బందిని నియమించినట్లు ఉపాధ్యాయ తెలిపారు.