చిన్నపాటి నిర్లక్క్ష్యం ఒక్కోసారి పెద్ద అనర్థాలకే దారి తీస్తుంది. కరోనా టైంలో ప్రజా సంక్షేమం గురించి బాగానే ఆరాలు తీసిన అధికారులు.. చిన్న తప్పిదంతో బతికున్న ఓ వ్యక్తిని రికార్డులో చంపేశారు. అంతేకాదు కాల్ చేసి మరీ మరణ ధృవీకరణ పత్రం తీసుకెళ్లమని ఆయనకే ఫోన్ చేసి చెప్పారు. ఊహించని ఆ అనుభవంతో ఖంగుతిన్న ఆయన.. మీడియా ముందుకు వచ్చాడు.
ముంబై: థానే మాన్‌పడాలో టీచర్‌గా పనిచేస్తున్నాడు చంద్రశేఖర్ దేశాయ్(54). కిందటి ఏడాది ఆగష్టులో ఆయన కరోనా వైరస్ బారినపడి కోలుకున్నాడు. ఇంట్లో ఉండే ఆయన ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. ఐసోలేషన్ టైంలో తన ఆరోగ్యం గురించి మున్సిపాలిటీ అధికారులు రోజూ ఆరాతీస్తుంటే మురిసిపోయాడాయన. కట్ చేస్తే..
ఈమధ్యే ఆయనకు మరో కాల్ వచ్చింది. ఈసారి ఆయన కూడా ఊహించని ప్రశ్న ఎదురైంది. థానే మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి ఓ మహిళా ఆఫీసర్ ఆయన నెంబర్‌కు కాల్ చేసి.. చంద్రశేఖర్ దేశాయ్ పేరు మీద డెత్ సర్టిఫికెట్ సిద్ధమైందని, వచ్చి తీసుకెళ్లాలని కోరింది. అయితే తాను బతికే ఉన్నానని చెప్పడంతో ఆమె కంగారుపడిపోయింది. ఆ ఇంట్లో ఇంకెవరైనా కొవిడ్‌తో చనిపోయారా? అని ఆమె ఆరా తీసిందట. ‘లేదు’ అని చెప్పడంతో ఆ కాల్ కట్ అయిపోయిందని చంద్రశేఖర్ మీడియా ముందు వాపోయాడు.
ఇక ఈ ఘటన తర్వాత సరాసరి థానే మున్సిపాలిటీ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లాడాయన. అక్కడి అధికారులకు ఘటనపై ఫిర్యాదు చేశాడు. మున్సిపాలిటీ వాళ్లు పంపకుండా ఐసీఎంఆర్‌కు తన పేరు ఎలా వెళ్లిందని, దీనికి సమాధానం కావాలని కోరుతున్నాడాయన. ఇక ఈ ఘటనపై టీఎంసీ అధికారులు స్పందించారు. పొరపాటు జరిగిందని చెబుతూ.. దానిని సవరించే ప్రయత్నం చేస్తారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment