Thane municipal corporation
-
ఉద్ధవ్‌కు మరో ఎదురుదెబ్బ.. షిండే వర్గంలోకి 66 మంది శివసేన కార్పొరేటర్లు!
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముగిసినప్పటికీ ఉద్దవ్ ఠాక్రేను చిక్కులు వీడటం లేదు. పార్టీ సీనియర్ నాయకుడు ఏక్నాథ్ షిండే తిరుగుబాటు నుంచి మొదలైన తలనొప్పులు ఇంకా ఉద్ధవ్‌ను వెంటాడుతూనే ఉన్నాయి. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి బయటకొచ్చిన ఏక్నాథ్ షిండే.. బీజేపీతో చేతులు కలిపి కొత్త సర్కార్‌ను ఏర్పాటు చేయడం జీర్ణించుకోలేకపోతున్న ఠాక్రేకు మళ్లీ కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. కీలకమైన బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల ముందు శివసేనకు((ఉద్దవ్ వర్గం) మరో షాక్ తగిలింది. థానే మున్సిపల్ కార్పొరేషన్‌లోని శివసేనకు చెందిన 66 మంది కార్పొరేటర్లు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరారు. ఇప్పటికే 66 మంది రెబెల్ కార్పొరేటర్లు మహారాష్ట్ర కొత్త సీఎం ఏక్ నాథ్ షిండేను బుధవారం రాత్రి ఆయన నివాసంలో కలిసినట్లు తెలుస్తోంది. అయితే 67 మంది శివసేన కార్పొరేటర్లలో 66 మంది పార్టీ ఫిరాయించడంతో ఉద్ధవ్ ఠాక్రే టీఎంసీపై అధికారాన్ని కోల్పోయారు. ఇక మహారాష్ట్రలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత థానే మున్సిపల్ కార్పొరేషన్ అత్యంత ముఖ్యమైన పౌర సంస్థ. చదవండి: ఉద్దవ్ థాక్రేకు కొత్త తలనొప్పి ఇప్పటికే అధికారం కోల్పోయి తలపట్టుకుంటున్న ఉద్దవ్‌కు మరికొందరు సభ్యులు పార్టీకి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివసేనకు ఉన్న18 మంది ఎంపీల్లో 12 మంది త్వరలో షిండే నేతృత్వంలోని వర్గంలో చేరతారని శివసేన రెబల్ ఎమ్మెల్యే గులాబ్రావ్ పాటిల్ ప్రకటించడం కలకలం రేపుతోంది. కాగా మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోషియారీ విశ్వాస పరీక్షకు ఆదేశించడంతో ఉద్ధవ్ ఠాక్రే ముందుగానే సీఎంగ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తదుపరి శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే సీఎంగా, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. -
ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు దారులకు బంపర్ ఆఫర్
థాణే: విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు థాణే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) ఒక వినూత్న ప్రణాళికతో ముందుకు వచ్చింది. నగరంలో విద్యుత్ వాహనాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సరిపడా చార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాల కోసం చార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకునే వ్యక్తులు, సంస్థలు, హౌజింగ్ సొసైటీలకు ఆస్తి పన్నుల్లో రాయితీ కల్పించాలని థాణే మున్సిపల్ కార్పొరేషన్ ఒక ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ ముసాయిదాను మంజూరీ కోసం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ముసాయిదా ప్రకారం ఎవరైనా సొంతం కోసం చార్జింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే ఆస్తి పన్నుల్లో రెండు శాతం, ఇతరుల కోసం ఏర్పాటు చేస్తే అయిదు శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఈ రాయితీలు 2025 వరకు మాత్రమే అమలులో ఉంటాయని అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2030 వరకు విద్యుత్ వాహనాల వాడకాన్ని గణనీయంగా పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ విధానంతో థాణేలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించారు. అయితే వాహనాలకు సరిపడా చార్జింగ్ సెంటర్లు లేవని గుర్తించిన మున్సిపల్ కమిషనర్ సంజయ్ జైస్వాల్ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. థాణే మున్సిపల్ కార్పొరేషన్ తరఫున వంద చార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. స్మార్ట్ సిటీగా ఎంపికై రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ థాణే నగరంలో ఇంతవరకు ఒక్క చార్జింగ్ సెంటర్ కూడా ఏర్పాటు కాకపోవడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
హలో సార్.. వచ్చి డెత్ సర్టిఫికెట్ తీసుకెళ్లండి
చిన్నపాటి నిర్లక్క్ష్యం ఒక్కోసారి పెద్ద అనర్థాలకే దారి తీస్తుంది. కరోనా టైంలో ప్రజా సంక్షేమం గురించి బాగానే ఆరాలు తీసిన అధికారులు.. చిన్న తప్పిదంతో బతికున్న ఓ వ్యక్తిని రికార్డులో చంపేశారు. అంతేకాదు కాల్ చేసి మరీ మరణ ధృవీకరణ పత్రం తీసుకెళ్లమని ఆయనకే ఫోన్ చేసి చెప్పారు. ఊహించని ఆ అనుభవంతో ఖంగుతిన్న ఆయన.. మీడియా ముందుకు వచ్చాడు. ముంబై: థానే మాన్‌పడాలో టీచర్‌గా పనిచేస్తున్నాడు చంద్రశేఖర్ దేశాయ్(54). కిందటి ఏడాది ఆగష్టులో ఆయన కరోనా వైరస్ బారినపడి కోలుకున్నాడు. ఇంట్లో ఉండే ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఐసోలేషన్ టైంలో తన ఆరోగ్యం గురించి మున్సిపాలిటీ అధికారులు రోజూ ఆరాతీస్తుంటే మురిసిపోయాడాయన. కట్ చేస్తే.. ఈమధ్యే ఆయనకు మరో కాల్ వచ్చింది. ఈసారి ఆయన కూడా ఊహించని ప్రశ్న ఎదురైంది. థానే మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి ఓ మహిళా ఆఫీసర్ ఆయన నెంబర్‌కు కాల్ చేసి.. చంద్రశేఖర్ దేశాయ్ పేరు మీద డెత్ సర్టిఫికెట్ సిద్ధమైందని, వచ్చి తీసుకెళ్లాలని కోరింది. అయితే తాను బతికే ఉన్నానని చెప్పడంతో ఆమె కంగారుపడిపోయింది. ఆ ఇంట్లో ఇంకెవరైనా కొవిడ్‌తో చనిపోయారా? అని ఆమె ఆరా తీసిందట. ‘లేదు’ అని చెప్పడంతో ఆ కాల్ కట్ అయిపోయిందని చంద్రశేఖర్ మీడియా ముందు వాపోయాడు. ఇక ఈ ఘటన తర్వాత సరాసరి థానే మున్సిపాలిటీ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లాడాయన. అక్కడి అధికారులకు ఘటనపై ఫిర్యాదు చేశాడు. మున్సిపాలిటీ వాళ్లు పంపకుండా ఐసీఎంఆర్‌కు తన పేరు ఎలా వెళ్లిందని, దీనికి సమాధానం కావాలని కోరుతున్నాడాయన. ఇక ఈ ఘటనపై టీఎంసీ అధికారులు స్పందించారు. పొరపాటు జరిగిందని చెబుతూ.. దానిని సవరించే ప్రయత్నం చేస్తారని వెల్లడించారు. చదవండి: చిన్నగొడవ.. డాక్టర్ దంపతుల ఆత్మహత్య -
పరీక్షలకే పరీక్ష!
ముంబై/వాషింగ్టన్: ఆమె పేరు వందన షా. ముంబైలో ప్రముఖ న్యాయవాది. సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉండడంతో ముందస్తుగా కోవిడ్ పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెని క్వారంటైన్ చేశారు. మూడు రోజుల తర్వాత ప్రభుత్వం పరీక్షలు చేస్తే ఆమెకి నెగిటివ్ అని తేలింది. ఈ మధ్యలో ఆమె అనుభవించిన వేదన వర్ణనాతీతం. ముంబ్రాలో నివసించే సమీర్ ఖాన్ అనే వ్యక్తి వేరే అనారోగ్యంతో ఆస్పత్రికి వెళితే ఎందుకైనా మంచిదని కరోనా పరీక్ష చేస్తే పాజిటివ్ అని తేలింది. అదే రోజు థానె మునిసిపల్ కార్పొరేషన్ పరీక్షలో (టీఎంసీ) నెగిటివ్ వచ్చింది. ఈ సమస్య కేవలం వీరిద్దరిదే కాదు. ఎన్నో రాష్ట్రాల్లో ప్రైవేటు ల్యాబ్స్‌లో ఇదే పరిస్థితి. నోయిడాలో ప్రైవేటు ల్యాబొరేటరీల్లో కూడా ఇలా ఫాల్స్ పాజిటివ్ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. మూడు రోజుల క్రితం ఇలా 19 మంది కోవిడ్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జాయిన్ అయ్యారు. అక్కడ పరీక్షలు చేస్తే వారికి నెగిటివ్ వచ్చింది. దీంతో వారినందరినీ శనివారమే ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. అమెరికాలో ఫాల్స్ నెగిటివ్ సమస్య దక్షిణకొరియా, రష్యా వంటి దేశాల్లో ఫాల్స్ పాజిటివ్ ఫలితాలు వస్తే, అగ్రరాజ్యం అమెరికాలో దానికి విరుద్ధంగా ఫాల్స్ నెగిటివ్ వస్తున్నాయి. వాస్తవానికి ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకి ఉంటుంది కానీ, పరీక్షల్లో బయటపడదు. నెగిటివ్ వచ్చింది కదాని హాయిగా తిరిగేయడం వల్ల ఆ వ్యక్తి నుంచి మరికొందరికి సంక్రమించే ప్రమాదం ఉంటుంది. అమెరికాలో ఇలా 15% మందికి ఫాల్స్ నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. సమస్యలివీ.. ► కోవిడ్–19 ఫాల్స్ పాజిటివ్ రావడం వల్ల ప్రభుత్వాలపై భారం పడుతోంది. వారిని క్వారంటైన్ చేయడం, వారు ఎవరెవరినీ కలిశారో వెతికి పట్టుకోవడం, మళ్లీ వారికి పరీక్షలు ఇదంతా ప్రభుత్వాలపై ఆర్థిక భారం మోపుతోంది. ► మహారాష్ట్ర ప్రైవేటు ల్యాబ్స్‌లో ఫాల్స్ పాజిటివ్ వస్తూ ఉండడంతో రోగుల సంఖ్య ఎక్కువై పో యి ఆస్పత్రులు నిండిపోతున్నాయి. నిజమైన రోగులకు చికిత్స ఆలస్యం కూడా అవుతోంది. ► కరోనాపై చాలా భయాందోళనలు నెలకొన్నా యి. ఫాల్స్ పాజిటివ్ రావడం వల్ల సున్నిత మనస్కులు మానసికంగా కుంగిపోతున్నారు. కొందరైతే ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేస్తున్నారు. ► ఫాల్స్ నెగిటివ్ సమాజానికి అత్యంత ప్రమాదకరం. ప్రపంచదేశాల్లో సగటున 29% వరకు ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. వారిలో వైరస్ ఉంటుంది కానీ లేదని నిర్ధారణ కావడంతో క్వారంటైన్ చేయరు. దీంతో వాళ్ల ద్వారా చాలా మందికి సంక్రమిస్తోంది. అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా కేసులు పెరిగిపోవడానికి ఫాల్స్ నెగిటివ్ కూడా కారణమే. ► ఏ లక్షణాలు లేకపోయినా పరీక్షలు చేయడంపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు వస్తాయని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. తప్పుడు ఫలితం ఏదైనా ప్రభుత్వంపైనా, ప్రజలపైనా భారాన్ని మోపుతోంది. అందుకే అవసరమైతేనే పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కారణాలివీ.. ► కరోనా అనుమానితుడి నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు అత్యంత జాగ్రత్తగా పంపించాలి. అలా పంపే క్రమంలో ఆ బాటిల్ విరిగినా, ఇతర శాంపిల్స్‌తో కలిసిపోయినా, కలుషితమైనా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ► కరోనా కిట్స్‌లో లోపాలు కూడా తప్పుడు ఫలితాలకు కారణమవుతున్నాయి. రాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్స్ ఫలితాల్లో తేడా 15–20% ఉంటోంది. ఇది చాలా ఎక్కువని వైద్య నిపుణుల భావన. ► మానవ తప్పిదం కూడా మరో కారణమే. పరీక్షలు చేసినప్పుడు ల్యాబ్ టెక్నీషియన్లు అప్రమత్తంగా లేకపోయినా, వారిలో నైపుణ్యం కొరవడినా ఫలితాలు తప్పుగా వెలువడే అవకాశాలున్నాయి. ► శాంపిల్స్ తీసుకునే సమయం కూడా ఒక్కోసారి ఫలితాల్ని గందరగోళంలో పడేస్తుంది. వైరస్ మన శరీరంలో ప్రవేశించిన వెంటనే పరీక్షలు చేస్తే 50శాతం మందికి నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి పరీక్ష చేస్తే పాజిటివ్ వస్తుంది. శస్త్రచికిత్స కోసమో, మరేదైనా బాధతోనో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లేవారికి విధిగా కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. వారికి పాజిటివ్ వస్తూ ఉండడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు పంపేస్తున్నారు. ఇక్కడ పరీక్షలు చేస్తే నెగిటివ్ వస్తోంది. దీంతో అసలైన రోగులకు చికిత్స ఆలస్యమవుతోంది. వ్యాధిలేని వారు కూడా ఆస్పత్రిలో చేరడం వారికి కూడా ప్రమాదమే –విజయ్ సింఘాల్, థానే మున్సిపల్ కమిషనర్ -
కోవిడ్-19 టెస్టింగ్‌లు : థైరోకేర్పై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 పరీక్షలకు గతంలో థైరోకేర్‌ను అనుమతించిన ఐసీఎంఆర్ ఆ ల్యాబ్ ఆరు శాంపిల్స్ విషయంలో సరైన ఫలితాలను ఇవ్వకపోవడంతో టెస్టింగ్ చేపట్టకుండా థైరోకేర్పై థానే మున్సిపల్ కార్పొరేషన్ నిషేధం విధించింది. థైరోకేర్ పరిశీలించిన ఆరు కేసుల్లో పాజిటివ్ ఫలితం రాగా థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వం సమకూర్చిన కిట్ల ద్వారా పరీక్షించగా రోగులకు నెగెటివ్ పలితం వచ్చింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం నుంచి శాంపిల్స్‌ను థైరోకేర్ సేకరించడాన్ని నిలుపదల చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి : కొత్త జంటకు షాక్: వధువుకు కరోనా -
నీటి కోసం రైలు ఎక్కాల్సిందే
సాక్షి, ముంబై: కిలోమీటర్ల దూరం వెళ్లి తాగేందుకు నెత్తిన బిందెలు మోసుకుంటూ వెళ్లే మహిళలు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా కన్పిస్తుంటారు. అయితే ఇలాంటి సన్నివేశాలు దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో దర్శనమిస్తున్నాయి. ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దివా ప్రాంతంలోని అనేక మంది మహిళలు ఉదయం తాగు నీటి కోసం ఏకంగా రైళ్లలో ప్రయాణించాల్సి వస్తోంది. బిందెడు నీటి కోసం ప్రతి రోజు లోకల్ రైళ్లో ఉదయం వెళ్లడం ఇక్కడ సర్వసాధరణమైన విషయం అయిపోయింది. కేవలం నీటి కోసం ఇక్కడి మహిళలు ప్రతి నెల లోకల్ రైలు పాస్ తీసుకుంటున్నారంటే ఇక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్నది అర్థమవుతోంది. ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దివా ప్రాంతంలో నీటి సరఫరా సరిగా లేదు. ఇక్కడ చాలా చౌకగా ఇళ్లు లభిస్తుండడంతో అనేక మంది మద్యతరగతి, పేద ప్రజలు దివాలో ఇళ్లను కొనుగోలు చేశారు. అయితే ఈ ఇళ్లలో తాగేందుకు నీరు రాక నరకయాతన అనుభవిస్తున్నారు. దివాలోని అనేక ప్రాంతాల్లోని మహిళలు ప్రతిరోజు కళ్యాణ్ నుంచి ముంబై సీఎస్టీ వెళ్లే లోకల్ రైల్లో ముంబ్రాకి వెళుతున్నారు. ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో దివా రైల్వేస్టేషన్లో బిందె లు పట్టుకున్న మహిళలు కనిపిస్తున్నారు. కొత్తగా నిర్మించిన దివాలోనే... దివా గ్రామంలో మాత్రం నీటి సరఫరా బాగానే ఉంది. అయితే గత ఏడెనిమిది ఏళ్ల క్రితం కొత్తగా ఏర్పాటైన దివా ప్రాంతంలోని చాల్స్, బిల్డింగ్‌లలోనే ఈ నీటి ఇక్కట్లు ఉన్నాయి. ప్రారంభంలో చాల్స్‌లోని కొన్ని ఇళ్లకు నీటి కుళాయిల ద్వారా నీటి సరఫరా జరిగేదని కొందరు స్థానికులు చెప్పారు. అయితే భవనాలన్నీ నిర్మాణ దశలో ఉన్నాయని, దీంతో తొందర్లోనే 24 గంటల నీటి సరఫరా ఉంటుందని చెప్పి దాదాపు అన్ని గదులు, ఫ్లాట్లను బిల్డర్లు విక్రయించారు. ఆ తర్వాత కొంతకాలం వీరే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేశారు. ఇలా మెల్లమెల్లగా నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో తాగు నీటి సమస్య తీవ్రంగా ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో బోరింగులున్నా తాగేనీటి కోసం ముంబ్రా వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తూర్పు ముంబ్రాలోని శని మందిరం సమీపంలో ఉన్న నీటి కుళాయి నుంచి నీరు నింపుకుంటున్నారు. దీంతో ఇక్కడ కూడా రద్దీ కన్పిస్తోంది. ఒక్క బిందేడు నీటి కోసం రెండు గంటల సమయం శ్రమించాల్సి వస్తోందని ఇక్కడి మహిళలు తమ గోడును వెల్లబోస్తున్నారు. -
ఈ-గవర్నెన్స్‌పై టీఎంసీ దృష్టి
ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) సేవలను ఈ-గవర్నెన్స్ ద్వారా అందించనుంది. ఇందుకోసం ఇప్పటికి టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే ఈ-గవర్నెన్స్ ద్వారా అద్భుతంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ మాదిరిగానే ప్రజలకు ఈజీగా సేవలు అందించాలని నిర్ణయించిన టీఎంసీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రణాళిక పూర్తి స్థాయిలో అమలు కోసం కనీసం రెండేళ్ల సమయం తీసుకోవచ్చని కార్పొరేషన్ వర్గాలు తెలిపాయి. కార్పొరేషన్లో అకౌంట్, ఎమర్జెన్సీ వ్యవస్థ, నీటి, ఆస్తి విభాగం, చెత్త విభాగం, హాకర్స్ వ్యవస్థాపన, ఆరోగ్య, జనన-మరణ, అగ్నిమాపక ఇలా అనేక విభాగాలను ఈ-గవర్నన్స్‌తో అనుసంధానం చేస్తామన్నాయి. ఫిర్యాదు కోసం స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్......!! టీఎంసీ తరపున స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ అందుబాటులోకి రానుంది. ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రజలు నేరుగా తమ ఫిర్యాదులు చేయవచ్చు. ఫోటోను అప్లోడ్ చేసుకోవచ్చు. తమ పరిసరాల్లో గుంతలు, డ్రైనేజీ లైన్లు, ఎక్కడైనా అక్రమంగా కట్టడాలు జరిగితే వాటి ఫొటోలను తీసి అప్లికేషన్లో అప్లోడ్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. సకాలంలో ఫిర్యాదుపై అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారుల దృష్టికి వెళుతుంది. ఈ అప్లికేషన్ వల్ల ప్రజలు కార్పొరేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. రెండు నెలల్లో దీనిని ప్రారంభిస్తామని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. -
ఆస్తిపన్నుపై 2% సర్‌చార్జి
ఠాణే: శిథిలావస్థలో ఉన్న భవనాల్లోని వారికి అద్దె ఇళ్లు నిర్మించేందుకు గాను ఆస్తి పన్నుపై రెండు శాతం సర్‌చార్జి విధించాలని ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2014-15)కు గాను 2,166 కోట్ల వార్షిక బడ్జెట్‌ను మున్సిపల్ కమిషనర్ అసీమ్ గుప్తా మంగళవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి చార్జీలపై ఎటువంటి పెంపును తాము ప్రతిపాదించడం లేదన్నారు. అయితే నీటి వినియోగం, విద్యుత్ బిల్లు, ఏప్రిల్ 1, 2014 నాటికి పాలనాపరమైన వ్యయానికి అనుగుణంగా చార్జీలు ఉంటాయని చెప్పారు. అంటే అంశాల వారీగా ఖర్చులు పెరిగితే నీటి చార్జీలు కూడా పెరగవచ్చని ఆయన పరోక్షంగా వెల్లడించారు. పాలనాపరమైన ఖర్చుల కోసం ఫ్లాట్ యజమానులు తమ వార్షిక పన్ను ఆధారంగా ఒక శాతం చార్జీని అదనంగా చెల్లించాల్సి ఉంటుందని కమిషనర్ చెప్పారు. ప్రజారోగ్యం, వ్యర్థాల నిర్వహణ (రూ.459 కోట్లు), రోడ్లు, వంతెనలు, సబ్‌వేలు (రూ.249 కోట్లు), ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి మౌలిక సదుపాయాల కల్పనకు (రూ.240 కోట్లు), విద్య (రూ.163 కోట్లు), రవాణా (రూ.149 కోట్లు), మురుగు నీటి పారుదల (రూ.124 కోట్లు), సామాజిక భద్రత (రూ.92 కోట్లు), వార్డుల్లో అభివృద్ధి పనులకు (రూ.92 కోట్లు) కేటాయిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. అభివృద్ధి చార్జీల రూపంలో రూ. 355 కోట్లు వసూలు చేస్తామని, ఎల్బీటీ ద్వారా రూ. 650 కోట్లు, ఆస్తి పన్ను రూపంలో రూ.302 కోట్లు, నీటి పన్ను ద్వారా రూ. 105 కోట్లు, అగ్ని మాపక చార్జీల రూపంలో రూ. 44 కోట్లు, ప్రజా పనుల విభాగం ద్వారా రూ. 16 కోట్లు ఆదాయం పొందుతామని చెప్పారు. సమగ్ర శ్మశాన వాటికల అభివృద్ధి పథకానికి ప్రతి ఏడాది రూ. 9 కోట్లు కేటాయిస్తామని అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రతి కార్పొరేటర్‌కు ఒక ట్యాబ్లెట్‌ను అందచేస్తామని కమిషనర్ ప్రకటించారు. సంప్రదింపులు, సమాచారం, సమావేశాలకు సంబంధించిన నోటీసులు అన్నీ ఈ ట్యాబ్లెట్ల ద్వారానే కార్పొరేటర్లకు అందచేస్తామని పేర్కొన్నారు. తమ నాలుగో తరగతి ఉద్యోగులకు ప్రాథమిక విద్యను నేర్పాలని కూడా టీఎంసీ నిర్ణయించింది. మూడు నెలల పాటు వారికి ఈ శిక్షణ ఉంటుందని, నాలుగో నెలలో వారు కనీసం సంతకం చేయాలని ఆయన పేర్కొన్నారు. వారు సంతకం చేయడంలో విఫలమైతే వారి వేతనంలో నుంచి వంద రూపాయలు కత్తిరిస్తామని హెచ్చరించారు. -
కల్వా క్రీక్‌పై సీ లింక్ వంతెన
సాక్షి, ముంబై: కల్వా-ఠాణేలను అనుసంధానం చేసేలా కల్వా క్రీక్‌పై సీ లింక్ వంతెన నిర్మించేందుకు ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) సిద్ధమవుతోంది. సుమారు 2.2 కిలోమీటర్ల పొడవుండే ఈ వంతెన నిర్మాణానికి సుమారు రూ.181 కోట్ల వ్యయం అంచనాతో టీఎంసీ అధికారులు ఓ ప్రతిపాదన రూపొందించారు. దీనిని సర్వసాధారణ సభలో ఆమోదించాల్సి ఉంది. ‘కల్వా-ఠాణేలను కలిపే ందుకు ప్రస్తుతం చరిత్రాత్మక పాత వంతెన ఉంది. దీనిపై దాదాపు ప్రతిరోజూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఈ వంతెన మరమ్మతులు చేపట్టేందుకు కూడా ఆస్కారం లేకుండా పోయింది. ఈ స్థానంలో కొత్త వంతెనను నిర్మించాలని టీఎంసీ నిర్ణయించింద’ని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అనేక సంవత్సరాల క్రితం టీఎంసీ ఆవిర్భవించక ముందు కల్వా గ్రామాన్ని ఠాణేను అనుసంధానం చేస్తూ 1863వ సంవత్సరంలో బ్రిటిష్ ఈ చరిత్రాత్మక వంతెనను నిర్మించింది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న దీనిని హెరిటేజ్ (చారిత్రాత్మక వంతెన)గా ప్రకటించారు. అయితే దీనికి మరమ్మతులు చేపట్టేందుకు కూడా అవకాశంలేకుండా పోయింది. ఇటీవలి కాలంలో ఈ వంతెనపై నుంచి ముంబ్రా, కల్యాణ్, నవీముంబై, పన్వేల్ మీదుగా వెళ్లే వాహనాల సంఖ్య పెరిగింది. దీనికి సమాంతరంగా 1995లో మరో వంతెనను నిర్మించారు. అయితే ఆ వంతెనపై కూడా తీవ్ర భారం పడుతోంది. ఈ నేపథ్యంలో దీనికి సమాంతరంగా మరో వంతెన నిర్మాణాన్ని సాకేత్ వైపు నుంచి చేపట్టాలని టీఎంసీ నిర్ణయం తీసుకుంది. దీనిపై నిపుణుల కమిటీ ప్రతిపాదన కూడా రూపొందించింది. దీన్ని తొందర్లోనే సర్వసాధారణ సభలో ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు. ఆమోదం లభించిన అనంతరం ప్రత్యక్షంగా పనులు ప్రారంభకానున్నాయి. -
అక్రమ కట్టడాలపై టీఎంసీ దృష్టి
సాక్షి, ముంబై: ముంబ్రాలో 2008 సంవత్సరం తర్వాత నిర్మించిన అన్ని అక్రమ భవనాలను కూల్చడానికి ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) సిద్ధమవుతోంది. ఈ చర్యల కోసం టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దింపనుంది. 2008 తర్వాత నిర్మించిన భవనాలు, కట్టడాలను పరిశీలించి ప్రమాదకరమైనవిగా ఈ టాస్క్‌ఫోర్స్ గుర్తిస్తుందని, ఆ తర్వాత అధికారులు సదరు భవన వివరాలు సేకరిస్తారని కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఈ టాస్క్‌ఫోర్స్ పనులు పూర్తి చేస్తుందన్నారు. ఈ ఫోర్స్‌లో సీనియర్ అధికారి, అసిస్టెంట్ అధికారి, ఇంజనీర్, సిబ్బంది ఉన్నారని చెప్పారు. ఈ బృందం ప్రభాగ్ సమితి నం.56 నుంచి 65 వరకు సర్వే నిర్వహిస్తుందని వివరించారు. రెండు నెలల క్రితం ముంబ్రాలో జరిగిన భవన ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో నాణ్యత లేని, అక్రమ కట్టడాలపై టీఎంసీ అధికారులు దృష్టి సారించారు. కార్పొరేషన్ పరిధిలో సుమారు 71 శాతం అక్రమ భవనాలు ఉన్నాయని గుర్తించింది. వాటిలో అత్యధిక అక్రమ కట్టడాలు ముంబ్రాలోనే ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. సదరు భవనాలు ప్రమాదకరంగా ఉన్నా ప్రజలు అందులోనే నివసిస్తున్నారని, ఇటువంటి కట్టడాలను ప్రత్యేక బృందం ద్వారా కూల్చివేయాలని నిర్ణయానికి టీఎంసీ అధికారులు వచ్చినట్టు తెలుస్తోంది.