ఠాణే: శిథిలావస్థలో ఉన్న భవనాల్లోని వారికి అద్దె ఇళ్లు నిర్మించేందుకు గాను ఆస్తి పన్నుపై రెండు శాతం సర్‌చార్జి విధించాలని ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2014-15)కు గాను 2,166 కోట్ల వార్షిక బడ్జెట్‌ను మున్సిపల్ కమిషనర్ అసీమ్ గుప్తా మంగళవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి చార్జీలపై ఎటువంటి పెంపును తాము ప్రతిపాదించడం లేదన్నారు.
అయితే నీటి వినియోగం, విద్యుత్ బిల్లు, ఏప్రిల్ 1, 2014 నాటికి పాలనాపరమైన వ్యయానికి అనుగుణంగా చార్జీలు ఉంటాయని చెప్పారు. అంటే అంశాల వారీగా ఖర్చులు పెరిగితే నీటి చార్జీలు కూడా పెరగవచ్చని ఆయన పరోక్షంగా వెల్లడించారు. పాలనాపరమైన ఖర్చుల కోసం ఫ్లాట్ యజమానులు తమ వార్షిక పన్ను ఆధారంగా ఒక శాతం చార్జీని అదనంగా చెల్లించాల్సి ఉంటుందని కమిషనర్ చెప్పారు. ప్రజారోగ్యం, వ్యర్థాల నిర్వహణ (రూ.459 కోట్లు), రోడ్లు, వంతెనలు, సబ్‌వేలు (రూ.249 కోట్లు), ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి మౌలిక సదుపాయాల కల్పనకు (రూ.240 కోట్లు), విద్య (రూ.163 కోట్లు), రవాణా (రూ.149 కోట్లు), మురుగు నీటి పారుదల (రూ.124 కోట్లు), సామాజిక భద్రత (రూ.92 కోట్లు), వార్డుల్లో అభివృద్ధి పనులకు (రూ.92 కోట్లు) కేటాయిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
అభివృద్ధి చార్జీల రూపంలో రూ. 355 కోట్లు వసూలు చేస్తామని, ఎల్‌బీటీ ద్వారా రూ. 650 కోట్లు, ఆస్తి పన్ను రూపంలో రూ.302 కోట్లు, నీటి పన్ను ద్వారా రూ. 105 కోట్లు, అగ్ని మాపక చార్జీల రూపంలో రూ. 44 కోట్లు, ప్రజా పనుల విభాగం ద్వారా రూ. 16 కోట్లు ఆదాయం పొందుతామని చెప్పారు. సమగ్ర శ్మశాన వాటికల అభివృద్ధి పథకానికి ప్రతి ఏడాది రూ. 9 కోట్లు కేటాయిస్తామని అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రతి కార్పొరేటర్‌కు ఒక ట్యాబ్లెట్‌ను అందచేస్తామని కమిషనర్ ప్రకటించారు. సంప్రదింపులు, సమాచారం, సమావేశాలకు సంబంధించిన నోటీసులు అన్నీ ఈ ట్యాబ్లెట్ల ద్వారానే కార్పొరేటర్లకు అందచేస్తామని పేర్కొన్నారు.
తమ నాలుగో తరగతి ఉద్యోగులకు ప్రాథమిక విద్యను నేర్పాలని కూడా టీఎంసీ నిర్ణయించింది. మూడు నెలల పాటు వారికి ఈ శిక్షణ ఉంటుందని, నాలుగో నెలలో వారు కనీసం సంతకం చేయాలని ఆయన పేర్కొన్నారు. వారు సంతకం చేయడంలో విఫలమైతే వారి వేతనంలో నుంచి వంద రూపాయలు కత్తిరిస్తామని హెచ్చరించారు.
ఆస్తిపన్నుపై 2% సర్‌చార్జి
Published Tue, Feb 18 2014 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM
Advertisement
Advertisement