నీటి కోసం రైలు ఎక్కాల్సిందే | water problems in mumbai | Sakshi
Sakshi News home page

నీటి కోసం రైలు ఎక్కాల్సిందే

Published Tue, May 20 2014 10:21 PM | Last Updated on Thu, Oct 4 2018 5:34 PM

water problems in mumbai

 సాక్షి, ముంబై: కిలోమీటర్ల దూరం వెళ్లి తాగేందుకు నెత్తిన బిందెలు మోసుకుంటూ వెళ్లే మహిళలు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా కన్పిస్తుంటారు.  అయితే ఇలాంటి సన్నివేశాలు దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో దర్శనమిస్తున్నాయి. ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దివా ప్రాంతంలోని అనేక మంది మహిళలు ఉదయం తాగు నీటి కోసం ఏకంగా రైళ్లలో ప్రయాణించాల్సి వస్తోంది. బిందెడు నీటి కోసం ప్రతి రోజు లోకల్ రైళ్లో ఉదయం వెళ్లడం ఇక్కడ సర్వసాధరణమైన విషయం అయిపోయింది.

కేవలం నీటి కోసం ఇక్కడి మహిళలు ప్రతి నెల లోకల్ రైలు పాస్ తీసుకుంటున్నారంటే ఇక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్నది అర్థమవుతోంది.  ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దివా ప్రాంతంలో నీటి సరఫరా సరిగా లేదు. ఇక్కడ చాలా చౌకగా ఇళ్లు లభిస్తుండడంతో అనేక మంది మద్యతరగతి, పేద ప్రజలు దివాలో ఇళ్లను కొనుగోలు చేశారు. అయితే ఈ ఇళ్లలో తాగేందుకు నీరు రాక నరకయాతన అనుభవిస్తున్నారు. దివాలోని అనేక ప్రాంతాల్లోని మహిళలు ప్రతిరోజు కళ్యాణ్ నుంచి ముంబై సీఎస్‌టీ వెళ్లే లోకల్ రైల్లో ముంబ్రాకి వెళుతున్నారు. ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో దివా రైల్వేస్టేషన్‌లో బిందె లు పట్టుకున్న మహిళలు కనిపిస్తున్నారు.
 
కొత్తగా నిర్మించిన దివాలోనే...
దివా గ్రామంలో మాత్రం నీటి సరఫరా బాగానే ఉంది. అయితే గత ఏడెనిమిది ఏళ్ల క్రితం కొత్తగా ఏర్పాటైన దివా ప్రాంతంలోని చాల్స్, బిల్డింగ్‌లలోనే ఈ నీటి ఇక్కట్లు ఉన్నాయి. ప్రారంభంలో చాల్స్‌లోని కొన్ని ఇళ్లకు నీటి కుళాయిల ద్వారా నీటి సరఫరా జరిగేదని కొందరు స్థానికులు చెప్పారు. అయితే భవనాలన్నీ నిర్మాణ దశలో ఉన్నాయని, దీంతో తొందర్లోనే 24 గంటల నీటి సరఫరా ఉంటుందని చెప్పి దాదాపు అన్ని గదులు, ఫ్లాట్లను బిల్డర్లు విక్రయించారు.
 
ఆ తర్వాత కొంతకాలం వీరే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేశారు. ఇలా మెల్లమెల్లగా నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో తాగు నీటి సమస్య తీవ్రంగా ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో బోరింగులున్నా తాగేనీటి కోసం ముంబ్రా వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తూర్పు ముంబ్రాలోని శని మందిరం సమీపంలో ఉన్న నీటి కుళాయి నుంచి నీరు నింపుకుంటున్నారు. దీంతో ఇక్కడ కూడా రద్దీ కన్పిస్తోంది. ఒక్క బిందేడు నీటి కోసం రెండు గంటల సమయం శ్రమించాల్సి వస్తోందని ఇక్కడి మహిళలు తమ గోడును వెల్లబోస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement