![Fresh Setback To Uddha Thackeray As 66 Thane Corporators Join Shinde Camp - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/7/mh1.jpg.webp?itok=M-JW5F1r)
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముగిసినప్పటికీ ఉద్దవ్ ఠాక్రేను చిక్కులు వీడటం లేదు. పార్టీ సీనియర్ నాయకుడు ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు నుంచి మొదలైన తలనొప్పులు ఇంకా ఉద్ధవ్‌ను వెంటాడుతూనే ఉన్నాయి. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి బయటకొచ్చిన ఏక్‌నాథ్ షిండే.. బీజేపీతో చేతులు కలిపి కొత్త సర్కార్‌ను ఏర్పాటు చేయడం జీర్ణించుకోలేకపోతున్న ఠాక్రేకు మళ్లీ కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి.
కీలకమైన బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల ముందు శివసేనకు((ఉద్దవ్ వర్గం) మరో షాక్ తగిలింది. థానే మున్సిపల్ కార్పొరేషన్‌లోని శివసేనకు చెందిన 66 మంది కార్పొరేటర్లు ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరారు. ఇప్పటికే 66 మంది రెబెల్ కార్పొరేటర్లు మహారాష్ట్ర కొత్త సీఎం ఏక్ నాథ్ షిండేను బుధవారం రాత్రి ఆయన నివాసంలో కలిసినట్లు తెలుస్తోంది. అయితే 67 మంది శివసేన కార్పొరేటర్లలో 66 మంది పార్టీ ఫిరాయించడంతో ఉద్ధవ్ ఠాక్రే టీఎంసీపై అధికారాన్ని కోల్పోయారు. ఇక మహారాష్ట్రలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత థానే మున్సిపల్ కార్పొరేషన్ అత్యంత ముఖ్యమైన పౌర సంస్థ.
చదవండి: ఉద్దవ్ థాక్రేకు కొత్త తలనొప్పి
ఇప్పటికే అధికారం కోల్పోయి తలపట్టుకుంటున్న ఉద్దవ్‌కు మరికొందరు సభ్యులు పార్టీకి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివసేనకు ఉన్న18 మంది ఎంపీల్లో 12 మంది త్వరలో షిండే నేతృత్వంలోని వర్గంలో చేరతారని శివసేన రెబల్ ఎమ్మెల్యే గులాబ్రావ్ పాటిల్ ప్రకటించడం కలకలం రేపుతోంది. కాగా మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోషియారీ విశ్వాస పరీక్షకు ఆదేశించడంతో ఉద్ధవ్ ఠాక్రే ముందుగానే సీఎంగ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తదుపరి శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే సీఎంగా, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment