ముంబై: అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తుండగా ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన నాయకుడు సచిన్ భోంస్లేపై దాడి జరిగింది. ఈ ఘటన పూణెలోని పింప్రి-చించ్‌వాడ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. భోంస్లే తెలిపిన వివరాల ప్రకారం..‘ఉప ఎన్నికల కోసం చించ్‌వాడ్ ప్రాంతంలో ఎన్సీపీ కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నాం.
అంతలో బీజేపీ కార్యకర్తలు నేరుగా వచ్చి మమ్మల్ని కొట్టారు. వారితో నాకు వ్యక్తిగత వాదనలు లేవు. గతంలో బీజేపీ అభ్యర్థి నాపై పోటి చేశారు. వీళ్లు ఆయన కార్యకర్తలే’ అని చెప్పారు. ఈ క్రమంలో భోంస్లే సహా ఎన్సీపీ కార్యకర్తలపై వారు దాడి చేసినట్లు తెలిపారు. దాడిలో భోంస్లే చేతికి గాయం కాగా, ఎన్సీపీ కార్యకర్త గోరఖ్ పాశంకర్ కాలు విరిగిందని చెప్పారు. ప్రస్తుతం వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బీజేపి సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కస్బా పేట్ ఎమ్మెల్యే ముక్తా తిలక్ గత ఏడాది డిసెంబర్ 22న మరణించగా, చించ్‌వాడ్ ఎమ్మెల్యే లక్ష్మణ్ జగ్తాప్ దీర్ఘకాలిక అనారోగ్యంతో జనవరి 3న కన్నుమూశారు. ఇదిలా ఉండగా ఈ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఎన్‌సీపి అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్‌సీపి నేత అజిత్ పవార్, శివసేన నాయకుడు ఆదిత్య థాక్రే సహా అన్ని పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కస్బా పేట, చించ్వాడ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 27న ఉప ఎన్నికలు జరగనుండగా, ఫలితాలు మార్చి 2న వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment