థాణే: విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు థాణే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) ఒక వినూత్న ప్రణాళికతో ముందుకు వచ్చింది. నగరంలో విద్యుత్ వాహనాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సరిపడా చార్జింగ్ స్టేషన్‌లు లేకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాల కోసం చార్జింగ్ సెంటర్‌లు ఏర్పాటు చేసుకునే వ్యక్తులు, సంస్థలు, హౌజింగ్ సొసైటీలకు ఆస్తి పన్నుల్లో రాయితీ కల్పించాలని థాణే మున్సిపల్ కార్పొరేషన్ ఒక ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ ముసాయిదాను మంజూరీ కోసం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ముసాయిదా ప్రకారం ఎవరైనా సొంతం కోసం చార్జింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే ఆస్తి పన్నుల్లో రెండు శాతం, ఇతరుల కోసం ఏర్పాటు చేస్తే అయిదు శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఈ రాయితీలు 2025 వరకు మాత్రమే అమలులో ఉంటాయని అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 2030 వరకు విద్యుత్ వాహనాల వాడకాన్ని గణనీయంగా పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ విధానంతో థాణేలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించారు. అయితే వాహనాలకు సరిపడా చార్జింగ్ సెంటర్లు లేవని గుర్తించిన మున్సిపల్ కమిషనర్ సంజయ్ జైస్వాల్ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. థాణే మున్సిపల్ కార్పొరేషన్ తరఫున వంద చార్జింగ్ సెంటర్‌లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. స్మార్ట్ సిటీగా ఎంపికై రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ థాణే నగరంలో ఇంతవరకు ఒక్క చార్జింగ్ సెంటర్ కూడా ఏర్పాటు కాకపోవడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment