సాక్షి, ముంబై: కల్వా-ఠాణేలను అనుసంధానం చేసేలా కల్వా క్రీక్‌పై సీ లింక్ వంతెన నిర్మించేందుకు ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) సిద్ధమవుతోంది. సుమారు 2.2 కిలోమీటర్ల పొడవుండే ఈ వంతెన నిర్మాణానికి సుమారు రూ.181 కోట్ల వ్యయం అంచనాతో టీఎంసీ అధికారులు ఓ ప్రతిపాదన రూపొందించారు. దీనిని సర్వసాధారణ సభలో ఆమోదించాల్సి ఉంది. ‘కల్వా-ఠాణేలను కలిపే ందుకు ప్రస్తుతం చరిత్రాత్మక పాత వంతెన ఉంది. దీనిపై దాదాపు ప్రతిరోజూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఈ వంతెన మరమ్మతులు చేపట్టేందుకు కూడా ఆస్కారం లేకుండా పోయింది.
ఈ స్థానంలో కొత్త వంతెనను నిర్మించాలని టీఎంసీ నిర్ణయించింద’ని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అనేక సంవత్సరాల క్రితం టీఎంసీ ఆవిర్భవించక ముందు కల్వా గ్రామాన్ని ఠాణేను అనుసంధానం చేస్తూ 1863వ సంవత్సరంలో బ్రిటిష్ ఈ చరిత్రాత్మక వంతెనను నిర్మించింది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న దీనిని హెరిటేజ్ (చారిత్రాత్మక వంతెన)గా ప్రకటించారు. అయితే దీనికి మరమ్మతులు చేపట్టేందుకు కూడా అవకాశంలేకుండా పోయింది. ఇటీవలి కాలంలో ఈ వంతెనపై నుంచి ముంబ్రా, కల్యాణ్, నవీముంబై, పన్వేల్ మీదుగా వెళ్లే వాహనాల సంఖ్య పెరిగింది. దీనికి సమాంతరంగా 1995లో మరో వంతెనను నిర్మించారు.
అయితే ఆ వంతెనపై కూడా తీవ్ర భారం పడుతోంది. ఈ నేపథ్యంలో దీనికి సమాంతరంగా మరో వంతెన నిర్మాణాన్ని సాకేత్ వైపు నుంచి చేపట్టాలని టీఎంసీ నిర్ణయం తీసుకుంది. దీనిపై నిపుణుల కమిటీ ప్రతిపాదన కూడా రూపొందించింది. దీన్ని తొందర్లోనే సర్వసాధారణ సభలో ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు. ఆమోదం లభించిన అనంతరం ప్రత్యక్షంగా పనులు ప్రారంభకానున్నాయి.
కల్వా క్రీక్‌పై సీ లింక్ వంతెన
Published Sat, Feb 15 2014 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM
Advertisement
Advertisement