henrik ibsen
-
సత్యం: పరిపూర్ణ నాటకకర్త
ఉల్లిగడ్డ పొరల్ని ఒక్కొక్కటిగా విప్పుకుంటూపోతే, చిట్టచివరికి తనకుగా ఏమీ మిగలని ‘సెల్ఫ్’ గురించి ఇప్సెన్ కాక మరెవరు రాయగలరు! నాటక రచయిత హెన్రిక్ ఇప్సెన్ జయంతి మార్చ్ 20న... నాటకకర్తగా హెన్రిక్ ఇప్సెన్ స్థానం ఇలా ఉండొచ్చు. ఆధునికపూర్వ నాటకాలను పరిగణనలోకి తీసుకుంటే గనక, ఆయన షేక్స్పియర్ తర్వాత షేక్స్పియర్ అంతటివాడు. ఆధునిక రంగస్థల రచయితల్లోమాత్రం ఇప్సెన్ అంతటివాడు ఇప్సెనే!ఉల్లిగడ్డ పొరల్ని ఒక్కొక్కటిగా విప్పుకుంటూపోతే, చిట్టచివరికి తనకుగా ఏమీ మిగలని ‘సెల్ఫ్’ గురించి ఇప్సెన్(1828-1906) కాక మరెవరు రాయగలరు! తొలిరోజుల్లో ‘రోజువారీ బలవంతపు అబార్షన్’లాగా నాటకాలు రాసినప్పటికీ, మనో విశ్లేషణనూ, నైతిక తీవ్రతనూ, సామాజిక ప్రాధాన్యాలనూ నాటకంలో ప్రవేశపెట్టడం ద్వారా ‘రంగస్థల ఫ్రాయిడ్’ అనిపించుకున్నాడు. అలాగే, తొలిదశలో తన నాటకాల్లో నార్వే ‘జాతి నిర్మాణం’కోసం పాటుపడాలన్న ధోరణి కనబరిచినప్పటికీ, అంతకుమించిన మానవీయ అంశను పట్టుకోవడం ద్వారా తన పాత్రలకు ‘అంతర్జాతీయ’ క్యారెక్టర్ ఇవ్వగలిగాడు. ద ప్రిటెండర్స్, బ్రాండ్, పీర్ జైంట్, ఎంపరర్ అండ్ గెలీలియన్, పిల్లర్స్ ఆఫ్ సొసైటీ, ఘోస్ట్స్, ద వైల్డ్ డక్, ద లేడీ ఫ్రమ్ ద సీ, హెడ్డా గాబ్లర్ ఆయన నాటకాల్లో కొన్ని! నిర్ణయాలు తీసుకోలేని స్వభావం, నిర్ణయాల పరిణామాలు గ్రహించలేనితనం, గుడ్డిగా ముందువాళ్లను అనుకరించేగుణం, విజయపు బరువును మోయలేని బలహీనత, ఎలాగో బతుకుతూ ఇంకెలాగో బతకాలనుకునే నిరంతర సంఘర్షణ, సామర్థ్యానికీ, కాంక్షకూ మధ్య వైరుధ్యం, వెలుగుకు భయపడేతత్వం, బూర్జువా కుటుంబాల్లోని నిత్య అభద్రత, కపటం... ఇలా జీవితపు బహుముఖీనత ఆయన నాటకాల్లో దర్శనమిస్తుంది. జీవితంలోని కామెడీ, ట్రాజెడీ కలగలిసిపోయిన వైచిత్రి కూడా కనబడుతుంది. భద్రతనూ, ఉద్వేగాన్నీ ఏకకాలంలో ఆశించేజీవుల్నీ, ఇదివుంటే అదీ, అదివుంటే ఇదీ కోరుకునే వివాహ సంబంధాల్నీ కూడా ఆయన స్కాన్ చేశాడు. ప్రత్యేకంగా స్త్రీవాదం రాయకపోయినా తన రచనలద్వారా ఫెమినిస్టులకు ఊతం కాగలిగాడు. పెళ్లంటే చట్టబద్ద వ్యభిచారమని అభివర్ణించాడు. వివాహం చుట్టూవుండే బేరసారాల్ని నిరసించాడు. పెళ్లి తర్వాత కనబడే సంతోషం అబద్ధమైనా అయివుండాలీ, లేదా సమాజపు ఒత్తిడి అయినా అయివుండాలీ, అని నర్మగర్భంగా ప్రకటించాడు. వ్యక్తివాదంలో ఇప్సెన్కు నమ్మకం. నీకు నువ్వు నిర్వర్తించుకోవాల్సిన విధి అన్నింటికంటే ముఖ్యమైందనేవాడు. ఎన్ని అవరోధాలున్నా ఒక మనిషి తన ఇఛ్చానుసారం బతికే వీలుండాలనీ, వాటిని ఎదుర్కోగలిగే ధైర్యం కూడా కావాలనీ రాశాడు. ‘ఎ డాల్స్ హౌజ్’లో నోరా అంటుంది: ‘‘ఎవరు సరో నేనూ తేల్చుకుంటాను, ఈ సమాజమో, నేనో’’. అయితే, ఏ హక్కుల కోసమైనా శాసనాలు, సంస్థాగత పరిష్కారాల మీద ఆయనకు విశ్వాసం లేదు. ఎవరికివారిగా మార్పు చెందాలనేది ఆయన అభిమతం. గుర్తింపూ, డబ్బూ అన్నీ లభించి కూడా జీవితంలో ఏ సంతోషమూ, తృప్తీ లేని ఆధునిక జీవుల శూన్యాన్ని ఆయన తన చివరినాటకం ‘వెన్ వి డెడ్ అవేకెన్’లో 1899లోనే రాశాడు. చివరకు ఏదో ఒకరోజు చనిపోయాకగానీ, మనం ఇన్నాళ్లూ బతకలేదన్న వాస్తవాన్ని గుర్తించడం గురించి అప్పుడే ప్రేక్షకుల్ని మేల్కొలిపాడు. అందుకే ఆయన్ని సమాజం కన్నా ముందున్న రచయితగా విమర్శకులు విశ్లేషిస్తారు; రంగస్థలానికి పరిపూర్ణతను తెచ్చినవాడిగా కూడా! ఉల్లిగడ్డ పొరల్ని ఒక్కొక్కటిగా విప్పుకుంటూపోతే, చిట్టచివరికి తనకుగా ఏమీ మిగలని ‘సెల్ఫ్’ గురించి ఇప్సెన్ కాక మరెవరు రాయగలరు! -
చిన్న బుద్ధుల ‘పెద్ద మనుషుల’ పై సినిమా చురకత్త
మేక వన్నె పులుల కథ ఈ ‘పెద్ద మనుషులు’. అలాంటి వాళ్ల తోలు తీసి డోలు వాయించిన సినిమా ఇది. నీటుగా... ఘాటుగా వ్యంగ్య సాంఘికం ఎలా తీయొచ్చో ఓ గైడ్‌లా ఉపకరిస్తుంది ఇది. సమాజానికి మరమ్మత్తులు అవసరమంటూ కేవీ రెడ్డి తేల్చి చెప్పిన పచ్చి నిజాల దృశ్య సంపుటం ఇది. 60 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఈ సినిమా విడుదలైంది ‘పాతాళ భైరవి’... అందరి జాతకాలూ మార్చేసిన సినిమా! పేరుకి పేరు... డబ్బుకి డబ్బు. జానపదం అంటే ఇలా ఉండాలన్నారంతా. ‘విజయా’ సంస్థ అధినేతలు నాగిరెడ్డి-చక్రపాణిలకూ అదే ఫీలింగ్. కేవీ రెడ్డితో మళ్లీ వెంటనే భారీ ఎత్తున జానపదం చేద్దామనుకున్నారు. కానీ కేవీ రెడ్డి మనసులో వేరే ఆలోచన ఉంది. అప్పటికే రెండు చారిత్రకాలు (భక్త పోతన, యోగి వేమన), రెండు జానపదాలు (గుణసుందరి కథ, పాతాళ భైరవి) తీశారు. అందుకే ఈసారి సాంఘికం చేయాలని ఫిక్స్ అయిపోయారు. దాంతో చక్రపాణికి కోపం వచ్చింది. ‘అయితే మేం వేరే దర్శకునితో జానపదం చేసుకుంటామ’ని చెప్పేశారు. అలా కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ‘చంద్రహారం’ ప్లాన్ చేశారు. దాంతో కేవీ రెడ్డి ‘వాహినీ’ సంస్థలో సాంఘికం చేయడానికి సిద్ధమయ్యారు. ఎలాగో వాహినీలో ఒకరి తర్వాత ఒకరు సినిమా చేద్దామని బీఎన్ రెడ్డికి, కేవీ రెడ్డికి ఓ అండర్స్టాండింగ్ ఉంది. అది ఈ విధంగా కలిసొచ్చింది. కేవీ రెడ్డి ఆంగ్ల సాహిత్యాభిమాని. హాలీవుడ్ సినిమాలు కూడా బాగా చూస్తారు. ప్రసిద్ధ నార్వేజియన్ నాటక రచయిత హెన్రిక్ ఇబ్సన్ రాసిన ‘పిల్లర్స్ ఆఫ్ సొసైటీ’ నాటకం కేవీ రెడ్డిని బాగా ఆకర్షించింది. ఈ నాటకం ప్రేరణతో సినిమా చేయాలనుకున్నారు. రచయిత పింగళి నాగేంద్రరావుకి కబురంపారు కేవీ రెడ్డి. కానీ ఆయన రాలేని పరిస్థితి. విజయా వారితో కాంట్రాక్ట్‌లో ఉన్నారాయన. కేవీ రెడ్డికి అర్జంట్‌గా ఓ రచయిత కావాలి. వాకబు చేయడం మొదలయింది. సరిగ్గా అదే సమయంలో ‘పాతాళ భైరవి’ విజయోత్సవం బెజవాడలో పెట్టారు. యూనిట్ అంతా వెళ్లింది. వీళ్లను ఎంటర్టైన్ చేయడం కోసం దుర్గా కళామందిరంలో ఓ నాటకం వేయించారు. దాని పేరే ‘నాటకం’. సగం నాటకం చూసేసరికే కేవీ రెడ్డి మైండ్‌లో ఫ్లాష్ వెలిగింది. ‘ఈ రైటర్ నాకు కావాలి’ అని ఆదేశించారు. కేవీ రెడ్డి ముందు డీవీ నరసరాజు ప్రత్యక్షమయ్యారు. మనిషిని, మాటతీరుని చూసి ఆయనలో ఎంత విషయముందో కేవీ రెడ్డికి అర్థమైపోయింది. రైటర్‌గా డీవీ నరసరాజును తీసుకున్నారు. నెలకు 300 రూపాయల జీతం. అదనంగా సినిమాకు 2000 రూపాయలు. డీల్ ఓకే. పని మొదలైంది. చక్రపాణితో వైరుధ్యం వల్ల వాహినీ స్టూడియోలో ఆఫీసు పెట్టలేని పరిస్థితి. బయట ఓ పాతబంగ్లా అద్దెకు తీసుకున్నారు కానీ, మరమ్మత్తులకు చాలా టైమ్ పట్టేట్టు ఉంది. అందుకే కేవీ రెడ్డి ఇంట్లోనే స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టారు. నటుడు డీవీ సుబ్బారావు కొడుకు, చిత్ర సహకార దర్శకుడైన డి.బి.జి. తిలక్ కూడా ఈ స్క్రిప్టు పనిలో పాలు పంచుకున్నారు. ‘పిల్లర్స్ ఆఫ్ సొసైటీ’ నాటకాన్ని యధాతథంగా అనుసరించలేదు కానీ, రెండు పాత్రల్ని మాత్రం దాన్నుంచి తీసుకున్నారు. బెర్నిక్ పాత్ర ప్రేరణతో మునిసిపల్ ఛైర్మన్ ధర్మారావు, జోహన్ పాత్ర ప్రేరణతో రామదాసు పాత్రను సృష్టించారు. ధర్మారావు పాత్ర నాగయ్యలాంటివాడు చేస్తే బావుంటుందన్నారు నరసరాజు. కానీ నాగయ్యపై కేవీ రెడ్డికి కినుక ఉంది. ఎందుకంటే నాగయ్య తన ‘త్యాగయ్య’ సినిమాను పూర్తి చేయడం కోసం ‘యోగి వేమన’కు కాల్షీట్లు ఆలస్యంగా ఇచ్చారు. అందుకే నాగయ్యకు నో ప్లేస్. ఎస్వీ రంగారావు ప్రస్తావన కూడా వచ్చింది. ఫైనల్‌గా జంధ్యాల గౌరీనాథశాస్త్రికి చాన్సు ఇచ్చారు. ఈ గౌరీనాథశాస్త్రి కూడా నటునిగా గట్టి పిండమే. కేవీ రెడ్డి తీసిన ‘భక్త పోతన’లో శ్రీనాధుడు పాత్ర చేశాడు. ఇక సినిమాలో తిక్క శంకరం పాత్ర చాలా సీరియస్ రోల్. కమెడియన్ రేలంగిని తీసుకోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. హీరోగా రామచంద్ర కాశ్యపను తీసుకున్నారు. ఆయన నరసరాజుకి కాలేజీలో జూనియర్. సంగీతం సమకూర్చే బాధ్యతను ఓగిరాల రామచంద్రరావు, అద్దేపల్లి రామారావుకు అప్పగించారు. మొత్తం 9 పాటలు. ఊటుకూరి సత్యనారాయణ, న్యాపతి రాఘవరావు 6 పాటలు రాశారు. మిగిలిన మూడూ అదరగొట్టేలా పూర్తి చెణుకులతో ఉండాలి. అందుకు సమర్థుడు కొసరాజు. అప్పుడెప్పుడో ‘రైతుబిడ్డ’లో పాటలు రాశారాయన. ఇప్పుడేమో ఊళ్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. కొసరాజు జాడ కనుక్కోమని పురమాయించారు కేవీ రెడ్డి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తాడన్నట్టుగా... సరిగ్గా కొసరాజు ఏదో పనిమీద మద్రాసు వచ్చి ఉడ్‌ల్యాండ్ హోటల్లో దిగారు. ఈ విషయం వీళ్లకు తెలిసింది. కానీ కొసరాజు ఇప్పుడేం పాటలు రాస్తామంటూ నిర్వేదం ప్రదర్శించారు. తీరా కథ విన్నాక ఆయనలో ఉత్సాహం ఉరకలెత్తింది. వారంలో మూడు పాటలూ రాసేశారు. వాహినీ స్టూడియోలో షూటింగ్ ప్లాన్ చేస్తే అక్కడ కూడా నాగిరెడ్డి బృందం నుంచి ఏవో ఇబ్బందులు. కేవీ రెడ్డికి తిక్కరేగి రేవతి స్టూడియోలో సెట్ వేసి షూటింగ్ మొదలు పెట్టేశారు. తర్వాత మళ్లీ అందరూ కలిసిపోవడంతో, షూటింగ్ వాహినీకి షిఫ్ట్ చేశారు. 1954 మార్చి 11న విడుదలైన ‘పెద్ద మనుషులు’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినిమాకు పనిచేసిన ప్రతి శాఖకీ పేరొచ్చింది. నరసరాజు రచయితగా ఫస్ట్ సినిమాతోనే ఫస్ట్ క్లాస్ అనిపించుకున్నారు. ఛాయాగ్రహణమూ అంతే. బీఎన్ రెడ్డి సోదరుడు బీఎన్ కొండారెడ్డి దీనికి కెమెరామేన్. ‘మల్లీశ్వరి’ ఆయనకు మొదటి సినిమా. ఇది రెండోది. కొసరాజు రాసిన మూడు పాటలూ ‘నందామయ గురుడ నందామయ’, ‘శివశివమూర్తివి గణనాథ’, ‘పట్నమెళ్ల గలనా?’ జనంలో మార్మోగిపోయాయి. ఈ దెబ్బతో కొసరాజు వ్యవసాయం మానేసి మద్రాసులో సాహితీ వ్యవసాయం చేయాల్సి వచ్చింది. అంత పేరొచ్చిందాయనకు. కేవీరెడ్డి తీత అయితే ఏ క్లాస్ అన్నారు. కేవీ రెడ్డి సాంఘికం ఇంత గొప్పగా తీస్తారని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు! ఆర్టిస్టుల నుంచి యాక్టింగ్ రాబట్టడంలో కేవీ మార్క్ చూడాలంటే ఈ సినిమా తప్పనిసరిగా చూడాల్సిందే. రేలంగికైతే విపరీతమైన పేరొచ్చేసింది. ఆయన బయట కనబడితే అందరూ ‘తిక్క శంకరం’ అని పిలవడమే. ముదిగొండ లింగమూర్తికీ అంతే. హీరో కన్నా ఎక్కువ పేరొచ్చింది. నిజానికి అప్పట్లో లింగమూర్తి చేసేవన్నీ విలన్ పాత్రలే. ఈ సినిమాతో ఆయన ఇమేజ్ మొత్తం మారిపోయింది. మామూలుగా ఏ సినిమాలోనైనా ఒకడే విలన్. గ్రూప్ విలనిజమనేది ఈ సినిమాతోనే మొదలైంది. ఇందులో నలుగురు విలన్లు. అందులో కొంత కామెడీ కలగలిపారు. ఇదేదో కొత్తగా అనిపించింది ప్రేక్షకులకు. మామూలుగా పెద్దమనిషంటే జెంటిల్‌మేన్ కింద లెక్క. ఈ సినిమా దెబ్బతో అది కాస్తా నెగిటివ్ అయిపోయింది. ‘మీరు పెద్ద మనిషండీ’ అని ఎవరైనా అంటే కంగారుపడే పరిస్థితి. సమాజంలో పైకి పెద్ద మనుషుల్లా చెలామణీ అవుతూ తెరవెనుక చీకటి రాజకీయాలు చేసేవాళ్లను కచ్చితంగా చురుక్కుమనిపిస్తుంది. అది ఏ తరంవారు అయినా సరే. అందుకేనేమో ఈ ‘పెద్ద మనుషులు’ ఇప్పటికీ చరిత్రలో నిలబడిపోయారు. - పులగం చిన్నారాయణ