సత్యం: పరిపూర్ణ నాటకకర్త
ఉల్లిగడ్డ పొరల్ని ఒక్కొక్కటిగా విప్పుకుంటూపోతే, చిట్టచివరికి తనకుగా ఏమీ మిగలని ‘సెల్ఫ్’ గురించి ఇప్సెన్ కాక మరెవరు రాయగలరు!
నాటక రచయిత హెన్రిక్ ఇప్సెన్ జయంతి మార్చ్ 20న...
నాటకకర్తగా హెన్రిక్ ఇప్సెన్ స్థానం ఇలా ఉండొచ్చు. ఆధునికపూర్వ నాటకాలను పరిగణనలోకి తీసుకుంటే గనక, ఆయన షేక్‌స్పియర్ తర్వాత షేక్‌స్పియర్ అంతటివాడు. ఆధునిక రంగస్థల రచయితల్లోమాత్రం ఇప్సెన్ అంతటివాడు ఇప్సెనే!ఉల్లిగడ్డ పొరల్ని ఒక్కొక్కటిగా విప్పుకుంటూపోతే, చిట్టచివరికి తనకుగా ఏమీ మిగలని ‘సెల్ఫ్’ గురించి ఇప్సెన్(1828-1906) కాక మరెవరు రాయగలరు!
తొలిరోజుల్లో ‘రోజువారీ బలవంతపు అబార్షన్’లాగా నాటకాలు రాసినప్పటికీ, మనో విశ్లేషణనూ, నైతిక తీవ్రతనూ, సామాజిక ప్రాధాన్యాలనూ నాటకంలో ప్రవేశపెట్టడం ద్వారా ‘రంగస్థల ఫ్రాయిడ్’ అనిపించుకున్నాడు. అలాగే, తొలిదశలో తన నాటకాల్లో నార్వే ‘జాతి నిర్మాణం’కోసం పాటుపడాలన్న ధోరణి కనబరిచినప్పటికీ, అంతకుమించిన మానవీయ అంశను పట్టుకోవడం ద్వారా తన పాత్రలకు ‘అంతర్జాతీయ’ క్యారెక్టర్ ఇవ్వగలిగాడు. ద ప్రిటెండర్స్, బ్రాండ్, పీర్ జైంట్, ఎంపరర్ అండ్ గెలీలియన్, పిల్లర్స్ ఆఫ్ సొసైటీ, ఘోస్ట్స్, ద వైల్డ్ డక్, ద లేడీ ఫ్రమ్ ద సీ, హెడ్డా గాబ్లర్ ఆయన నాటకాల్లో కొన్ని!
నిర్ణయాలు తీసుకోలేని స్వభావం, నిర్ణయాల పరిణామాలు గ్రహించలేనితనం, గుడ్డిగా ముందువాళ్లను అనుకరించేగుణం, విజయపు బరువును మోయలేని బలహీనత, ఎలాగో బతుకుతూ ఇంకెలాగో బతకాలనుకునే నిరంతర సంఘర్షణ, సామర్థ్యానికీ, కాంక్షకూ మధ్య వైరుధ్యం, వెలుగుకు భయపడేతత్వం, బూర్జువా కుటుంబాల్లోని నిత్య అభద్రత, కపటం... ఇలా జీవితపు బహుముఖీనత ఆయన నాటకాల్లో దర్శనమిస్తుంది. జీవితంలోని కామెడీ, ట్రాజెడీ కలగలిసిపోయిన వైచిత్రి కూడా కనబడుతుంది.
భద్రతనూ, ఉద్వేగాన్నీ ఏకకాలంలో ఆశించేజీవుల్నీ, ఇదివుంటే అదీ, అదివుంటే ఇదీ కోరుకునే వివాహ సంబంధాల్నీ కూడా ఆయన స్కాన్ చేశాడు. ప్రత్యేకంగా స్త్రీవాదం రాయకపోయినా తన రచనలద్వారా ఫెమినిస్టులకు ఊతం కాగలిగాడు. పెళ్లంటే చట్టబద్ద వ్యభిచారమని అభివర్ణించాడు. వివాహం చుట్టూవుండే బేరసారాల్ని నిరసించాడు. పెళ్లి తర్వాత కనబడే సంతోషం అబద్ధమైనా అయివుండాలీ, లేదా సమాజపు ఒత్తిడి అయినా అయివుండాలీ, అని నర్మగర్భంగా ప్రకటించాడు.
వ్యక్తివాదంలో ఇప్సెన్‌కు నమ్మకం. నీకు నువ్వు నిర్వర్తించుకోవాల్సిన విధి అన్నింటికంటే ముఖ్యమైందనేవాడు. ఎన్ని అవరోధాలున్నా ఒక మనిషి తన ఇఛ్చానుసారం బతికే వీలుండాలనీ, వాటిని ఎదుర్కోగలిగే ధైర్యం కూడా కావాలనీ రాశాడు. ‘ఎ డాల్స్ హౌజ్’లో నోరా అంటుంది: ‘‘ఎవరు సరో నేనూ తేల్చుకుంటాను, ఈ సమాజమో, నేనో’’.
అయితే, ఏ హక్కుల కోసమైనా శాసనాలు, సంస్థాగత పరిష్కారాల మీద ఆయనకు విశ్వాసం లేదు. ఎవరికివారిగా మార్పు చెందాలనేది ఆయన అభిమతం. గుర్తింపూ, డబ్బూ అన్నీ లభించి కూడా జీవితంలో ఏ సంతోషమూ, తృప్తీ లేని ఆధునిక జీవుల శూన్యాన్ని ఆయన తన చివరినాటకం ‘వెన్ వి డెడ్ అవేకెన్’లో 1899లోనే రాశాడు. చివరకు ఏదో ఒకరోజు చనిపోయాకగానీ, మనం ఇన్నాళ్లూ బతకలేదన్న వాస్తవాన్ని గుర్తించడం గురించి అప్పుడే ప్రేక్షకుల్ని మేల్కొలిపాడు. అందుకే ఆయన్ని సమాజం కన్నా ముందున్న రచయితగా విమర్శకులు విశ్లేషిస్తారు; రంగస్థలానికి పరిపూర్ణతను తెచ్చినవాడిగా కూడా!
ఉల్లిగడ్డ పొరల్ని ఒక్కొక్కటిగా విప్పుకుంటూపోతే, చిట్టచివరికి తనకుగా ఏమీ మిగలని
‘సెల్ఫ్’ గురించి ఇప్సెన్ కాక మరెవరు రాయగలరు!