నాట్కో, హెటిరోల నుంచి దేశీయ మార్కెట్లోకి హెపటైటిస్-సి జెనరిక్ ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెపటైటిస్-సి వ్యాధి చికిత్సకు వినియోగించే సొవాల్డి జెనరిక్ వెర్షను దేశీయ మార్కెట్లో విక్రయించడానికి నాట్కో ఫార్మా, హెటిరో ల్యాబ్స్లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ (డీజీసీ) అనుమతి మంజూరు చేసింది. అమెరికాకు చెందిన గిలీడ్ సెన్సైస్ హెపటైటిస్ -సి చికిత్సకు వినియోగించే ట్యాబ్లెట్లను సొవాల్డి బ్రాండ్ నేమ్‌తో విక్రయిస్తోంది. ఇప్పుడు వీటి జెనరిక్ వెర్షన్‌ను నాట్కో ‘సోఫాస్బువిర్’ పేరుతో త్వరలోనే దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది.
28 ట్యాబ్లెట్ల ధరను రూ. 19,900గా కంపెనీ నిర్ణయించింది. ఈ మధ్యనే ఈ ఔషధాన్ని నేపాల్ విక్రయించడానికి నాట్కో ఫార్మాకి అనుమతులు లభించిన సంగతి తెలిసిందే. ఇదే జెనరిక్ ఔషధాన్ని ‘సొఫోవిర్’ పేరుతో ఇండియా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు హెటిరో ల్యాబ్స్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ జెనరిక్ ఔషధాన్ని 91 దేశాల్లో తయారు చేసి విక్రయించుకోవడానికి హెటిరో ల్యాబ్స్, నాట్కో ఫార్మాలు హక్కులు పొందాయి. ఈ వార్తల నేపథ్యంలో నాట్కో ఫార్మా గురువారం సుమారు 15 శాతం పెరిగి రూ. 2,057 వద్ద ముగిసింది.