ఆల్‌టైమ్ టాప్ ‘బాహుబలి 2’
ముంబై: భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించిన ‘బాహుబలి 2’ మరో ఘనత సాధించింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గుండెకాయగా పరిగణించబడే బాలీవుడ్‌లోనూ టాప్‌గా నిలిచింది. హిందీలో అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించింది. ‘దంగల్’ పేరిట ఉన్న రికార్డును రెండు వారాల్లోనే తుడిచిపెట్టేసింది.
రూ. 375 కోట్ల నెట్ వసూళ్లతో ఇప్పటివరకు దంగల్ అగ్రస్థానంలో ఉంది. బాహుబలి 2 హిందీ సినిమా రూ. 390.25 కోట్ల నెట్ కలెక్షన్లతో ఆల్‌టైమ్ టాప్‌గా నిలిచింది. మొదటి వారంలో రూ. 247 కోట్లు, రెండో వారంలో రూ. 143.25 కోట్లు రాబట్టిందని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. అమెరికాలో రూ. 100 కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి భారతీయ సినిమాగా నిలిచింది. తమిళనాడులోనూ రూ. 100 కోట్ల మైలురాయికి చేరువగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 250 కోట్లుపైగా కలెక్ట్ చేసింది. కేరళలో రూ. 50 కోట్లుపైగా బిజినెస్ చేసింది. మరోవైపు భారతదేశంలోనే రూ. 1000 కోట్లు వసూలు చేసి సరికొత్త చరిత్ర లిఖించింది.