మెషీన్స్‌కూ..మదర్‌టంగ్ కావాలోయ్!
స్కూలు నుంచి కాలేజీ దాకా సెకండ్ లాంగ్వేజ్‌గా ఉండే మాతృభాషను మొక్కుబడిగా చదివేవారే ఎక్కువ. ఆ.. మనకు తెలిసిందే కదా? దీనికి ఎందుకు ఎక్కువ సమయం కేటాయించాలని లైట్ తీసుకుంటుంటారు. కానీ మాతృభాషతో కూడా సాఫ్ట్వేర్ ఇంజినీర్స్లా ఐటీ కంపెనీల్లో పనిచేయవచ్చు. వాళ్లలా డాలర్లు సంపాదించవచ్చని చెబుతోంది రాధి దాట్ల. హిందీ మాత్రమే చదువుకుని అమెరికా వెళ్లిన రాధికి ఒక్క ఉద్యోగం కూడా దొరకలేదు. అయినా నిరాశపడకుండా తనకు తగిన ఉద్యోగాన్ని వెతికి పట్టుకుంది. ఇప్పుడామె ఏకంగా ఏఐ యంత్రాలకే హిందీ నేర్పిస్తోంది. అంతర్జాతీయ హిందీ టీచర్‌గా రాణిస్తోన్న రాధి గురించి ఆమె మాటల్లోనే.....
అమ్మా వాళ్లు తెలుగు వాళ్లే. ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో పుట్టాను. నాన్న ఎయిర్ ఫోర్స్‌లో ఉత్తరభారత దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేయడంతో... కేంద్రీయ విద్యాలయాల్లో చదివాను. అలా నా చదువంతా హిందీలోనే సాగింది. రాయ్‌పూర్ నుంచి విశాఖపట్నం వచ్చినప్పటికీ, యూపీ, పంజాబ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు వైజాగ్‌లో ఉండడంతో నా మొదటి భాష హిందీగా మారింది. హిందీ తరువాత తెలుగు, ఇంగ్లీష్ నేర్చుకున్నాను. కానీ హిందీ వచ్చినంతగా ఇంగ్లిష్, తెలుగు రాదు.
కెరీర్‌గా అనుకోలేదు...
డిగ్రీ వరకు హిందీని ఒక లాంగ్వేజ్‌గా మాత్రమే చూశాను. అయితే హిందీనే కెరీర్‌గా మారుతుందని అప్పుడు అనుకోలేదు. ఆ తరువాత మాస్టర్స్ చేసేటప్పుడు లింగ్విస్టిక్స్ చదివే అవకాశం రావడంతో హైదరాబాద్ యూనివర్శిటీలో హిందీకి అప్లైచేశాను. హిందీ కోర్సు చేసేటప్పుడు హిందీ మీద మక్కువ ఏర్పడింది. దీనికితోడు మా ప్రొఫెసర్ ‘‘నీకు తెలిసిన సబ్జెక్టుని కెరీర్‌గా ఎంచుకో’’ అని సలహా ఇచ్చారు. అప్పుడు నేను హిందీనే కెరీర్‌గా మలుచుకోవాలనుకున్నాను. ఆ తర్వాత పీహెచ్డీ చేస్తోన్న సమయంలో పిట్స్ బర్గ్, క్యాలిఫోర్నియా యూనివర్శిటీ విద్యార్థులు, బయాలజీ, ఎకనమిక్స్ తోపాటు హిందీ నేర్చుకునేవారు. అప్పుడు వారికి హిందీ చెప్పేదాన్ని.
అమెరికాలో.. హిందీ ఉద్యోగం
2003లో పెళ్లి అయ్యింది. నా భర్త ఉద్యోగ రీత్యా రెండేళ్ల తరువాత అమెరికా వెళ్లాము. అక్కడ ఉద్యోగం చేద్దామని ఉద్యోగాల కోసం వెతికాను. కానీ ఎక్కడా దొరకలేదు. చాలా మంది అమెరికా వచ్చాక... ఉద్యోగం కోసం కంప్యూటర్ సైన్స్, కోడింగ్, ప్రోగ్రామింగ్‌లు నేర్చుకుంటుంటారు. నేను మాత్రం హిందీ టీచర్‌గా పనిచేసేందుకే ప్రయత్నించాను. అనేక వ్యయప్రయాసల తర్వాత అమెరికాలో బాగా పాపులర్ అయిన ‘బెర్లిట్జ్’ లాంగ్వేజ్ కార్పోరేషన్లో తొలి ఉద్యోగం దొరికింది. అక్కడ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి హిందీ నేర్పించాలి. అలా డిఫెన్స్ వారికి హిందీ నేర్పించాను.
ఐదు నెలల బిడ్డను వదిలి...
డిఫెన్స్ వాళ్లకు పాఠాలు చెబుతూనే 2008లో జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీకి అప్లై చేసాను. కొన్నాళ్ల తరువాత ఇంటర్వ్యూ కాల్ వచ్చి, హిందీ టీచర్‌గా సెలక్ట్ అయ్యాను. అప్పుడు నాకు ఐదు నెలల బాబు. వాడిని వదిలి వెళ్లాలంటే చాలా కష్టంగా అనిపించింది. ఆయన మేరీలాండ్ యూనివర్శిటీలో రీసెర్చర్‌గా చేసేవారు. ఆయన ఇంటికి వచ్చాక నేను క్లాసులు చెప్పడానికి వెళ్లేదాన్ని. సాయంత్రం ఆరు నుంచి తొమ్మిదిన్నర వరకు క్లాసులు చెప్పేదాన్ని.
ఇంట్లో కూర్చుని...
యూనివర్శిటీలో తరగతులు చెబుతూ ఫారిన్ సర్వీసెస్‌కు అప్లై చేశాను. వివిధ దేశాల్లో నివసిస్తోన్న అమెరికన్లకు హిందీ నేర్పించడానికి ఆఫర్ వచ్చింది. దీంతో అమెరికా ఫారిన్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ ద్వారా హిందీ బోధించేదాన్ని. కోవిడ్ సమయంలో ఎడ్యుకేషన్ అంతా ఆన్లైన్ అయ్యింది. ఇదే సమయంలో మేరీలాండ్ యూనివర్శిటీ ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి ఆఫర్ ఇవ్వడంతో 2021 నుంచి ఆన్లైన్ క్లాసులు చెబుతున్నాను. ఆ తర్వాత ఐటీ కంపెనీ ఆర్కిల్లో భాషా విభాగంలో పనిచేశాను. అక్కడ హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, మరాఠీ, నేపాలీ భాషలను నేర్పించేవారు. ఆ తరువాత అమేజాన్‌లో సీనియర్ లింగ్విస్ట్గా, యాపిల్ కంపెనీలో హిందీ ప్రాజెక్టులో పనిచేశాను.
ఇప్పుడంతా డేటా అన లిస్టు, మెషిన్ లెర్నింగ్ గురించే మాట్లాడుతున్నారు. మెషిన్ లెర్నింగ్ ఒక్క ఇంగ్లిష్‌లోనే లేదు. ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి వస్తోంది. మెషిన్‌కి అన్ని భాషలు తెలియవు. అందువల్ల ప్రతి భాషను మెషిన్‌కు నేర్పించాల్సిందే. అప్పుడు మాత్రమే కోడింగ్ చేయగలరు. కోడింగ్ ద్వారానే అన్నిరకాల యాప్‌లు క్రియేట్ చేస్తారు. ఒక యాప్ తయారవడానికి కచ్చితంగా భాషా నిపుణులు అవసరం.
అందుకే సైన్స్, మ్యాథ్స్లకున్న ప్రాముఖ్యత భాషకూ ఉంది. ఇది మనం గ్రహించాలి. ప్రపంచంలో ఇండియా పెద్ద మార్కెట్. చాలా కంపెనీలు మన దేశం వైపు చూస్తున్నాయి. అందువల్ల భవిష్యత్ తరాలకు హిందీతోనే ఎక్కువసంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇంగ్లీష్‌తోపాటు, హిందీ కూడా అవసరమే. ఇంగ్లీష్‌తో పాటు హిందీ కూడా చక్కగా నేర్చుకోండి ఓపికగా వెతికితే మంచి అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి.’’ అని నేటి యువతరానికి రాధి చెబుతోంది.
(చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే..ఎవరు తీసుకొచ్చారు?)