మహీంద్రా చేతికి టర్కీ కంపెనీలో మెజారిటీ వాటా
డీల్ విలువ రూ.129 కోట్లు
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ టర్కీకి చెందిన వ్యవసాయ పరికరాలు తయారుచేసే హిసర్లర్ కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది.హిసర్లర్ మర్కిన సనయి వె టికరెట్ అనోనియమ్ ఇర్కెటి(హిసర్లర్) కంపెనీలో 75.1 శాతం వాటాను రూ.129 కోట్లకు కొనుగోలు చేశామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ఈ డీల్ ఈ ఏడాది ఏప్రిల్‌కల్లా పూర్తవగలదని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా చెప్పారు. ఈ డీల్ కారణంగా టర్కీ, యూరప్ దేశాల్లో సాగు సంబంధిత సామగ్రి వ్యాపారంలో వృద్ధి సాధించడానికి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. తమ ప్రపంచీకరణ యాత్రలో ఈ డీల్ ఒక మైలురాయని వివరించారు. తమ వ్యవసాయ వ్యాపారం ప్రతీ ఏడాది వృద్ధి చెందుతోందని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఫార్మ్ ఎక్విప్మెంట్ అండ్ టూవీలర్) రాజేశ్ జెజురికర్ తెలిపారు. తమ మొత్తం రాబడిలో 37 శాతం అంతర్జాతీయ వ్యాపారం నుంచే వస్తోందని వివరించారు. ఈ కంపెనీ గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల ట్రాక్టర్లను విక్రయించింది.