హిస్టరెక్టమీ ఎప్పుడు అవసరమంటే!
సృష్టికి ప్రతి స్పష్టి చేయడానికి ప్రకృతికీ కొన్ని పనిముట్లు కావాలి. అందులో ముఖ్యమైనది గర్భసంచి (యుటెరస్). పుట్టబోయే బిడ్డను కాబోయే అమ్మ ఓ సంచిలో పెట్టుకొని కాపాడుతుంది. ఆ సంచి పేరే గర్భసంచి. చాలా మంది మహిళలు చివరి కాన్పు తర్వాత యుటిరస్‌ను ఓ పనికిరాని అవయవంగా పరిగణిస్తారు.
దాని అవసరం ఇక లేదని అపోహ పడతారు. కొన్ని నొప్పులు, రక్తస్రావాలు, తెలుపు కావడం (వైట్ డిశ్చార్జీ) వంటి వాటికి కారణాలనీ, అందుకే దాన్ని తొలగించుకోవడమే మంచిదనే భావన వారిలో ఉంటుంది. తమంతట తామే తొలగించమని కోరేవారూ ఉంటారు. కానీ... బిడ్డలు పుట్టే అవసరం తీరిపోయాక కూడా ‘గర్భసంచి అవసరమే’ అని గుర్తించాలి.
హిస్టరెక్టమీ అంటే...
ఆపరేషన్ ద్వారా గర్భసంచిని తొలగించే ప్రక్రియనే వైద్యపరిభాషలో హిస్టరెక్టమీ అంటారు.
గర్భసంచిని తొలగించడం ఎందుకు...?
అందుకు చాలా కారణాలు ఉండవచ్చు. వాటిని రెండు విభాగాలుగా విభజించవచ్చు. అవి... లైఫ్ సేవింగ్ (నాన్ ఎలక్టివ్)
►మహిళ ప్రాణాలను కాపాడటానికి గర్భసంచి తొలగింపు తప్ప మరో మార్గం లేనప్పుడు... ఉదాహరణకు గర్భసంచి, ఫెలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్‌లో క్యాన్సర్లు వచ్చినప్పుడు ఆ గడ్డను తొలగించడానికి గర్భసంచిని తొలగించడం తప్ప మరో మార్గం ఉండదు. అలాగే కాన్పు సమయంలో గర్భసంచి పగిలిపోయినప్పుడు (రప్చర్), గర్భసంచికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, నియంత్రణకు ఏమాత్రం వీలుకానంతగా రక్తస్రావం (అన్‌కంట్రోల్డ్ బ్లీడింగ్), కాన్పు తర్వాత వచ్చే అధిక రక్తస్రావం (అన్‌కంట్రోల్డ్ పోస్ట్ పార్టమ్ హేమరేజ్) అవుతుంటే గర్భసంచిని తొలగిస్తారు.
జీవన నాణ్యత కోసం (ఎలక్టివ్ సర్జరీ)...
► జీవన నాణ్యతను మెరుగుపరచేందుకు రోగి తన విచక్షణతో తొలగించుకోవడం. తీవ్రమైన రక్తస్రావం, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్, దీర్ఘకాలికంగా పొత్తికడుపు నొప్పి, డిస్ఫంక్షనల్ యుటిరైన్ బ్లీడింగ్ వంటి సమస్యలకు గర్భసంచి తీసేయడం ఒక పరిష్కారం.
ఇప్పుడు హిస్టరెక్టమీయే పరిష్కారం కాదు...
►ఫైబ్రాయిడ్స్: సాధారణంగా గర్భసంచి తొలగింపునకు ఒక ప్రధాన కారణంగా చూపేవి ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు. ఇవి క్యాన్సర్ గడ్డలు కావు. ముఫ్ఫైఅయిదేళ్లు నిండిన చాలామంది మహిళల్లో ఇవి కనిపిస్తుంటాయి. వాటి సైజ్ చిన్నదిగా ఉండి, వాటి వల్ల ఎలాంటి లక్షణాలూ కనిపించకపోతే వాటికి చికిత్స కూడా అవసరం లేదు. అయితే వాటి సైజ్ బాగా ఎక్కువగా ఉన్నా, వాటి కారణంగా తీవ్రమైన రక్తస్రావం అవుతున్నా, నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నా వాటికి చికిత్స అవసరం. కొన్ని సందర్భాల్లో ఈ గడ్డలు ఉన్నప్పుడు పూర్తిగా గర్భసంచిని తొలగించకుండా కేవలం గడ్డ వరకు తొలగించడం కూడా ఒక చికిత్స ప్రక్రియ. దీన్నే మయోమెక్టమీ అంటారు.
ఇక చాలాకాలంగా రక్తస్రావం అవుతున్న మహిళల్లో పూర్తిగా గర్భసంచి తొలగించడానికి బదులుగా దానిలోని లోపలిపొర ఎండోమెట్రియం వరకు తొలగించవచ్చు. దీన్నే ఎండోమెట్రియల్ అబ్లేషన్ అని అంటారు.
►ఎండోమెట్రియాసిస్: ఎండోమెట్రియమ్ అనే పొర గర్భసంచి లోపల ఉంటుంది. అయితే ఏదైనా కారణాల వల్ల ఆ కణాలు కేవలం గర్భసంచి లోపలి భాగానికే పరిమితం కాకుండా గర్భసంచి బయట... అంటే.. ఓవరీస్ వద్ద, ఫెలోపియన్ ట్యూబ్స్ వద్ద, మూత్రం విసర్జనకు తోడ్పడే బ్లాడర్ వద్ద, కడుపులో కనిపించవచ్చు. ఫలితంగా తీవ్రమైన నొప్పి రావచ్చు. కొందరిలో నొప్పి లేకపోయినా అది గర్భధారణకు ఆటంకం కావచ్చు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు దానికి ఎండోమెట్రియల్ అబ్లేషన్, జీన్ఆర్హెచ్ యాంటగనిస్ట్ అనే గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్‌ను తగ్గించే లేదా దాన్ని ప్రభావాన్ని తగ్గించే మందులు, డెనెజాల్, టామోక్సిఫెన్ వంటి మందులతో ఉపశమనం సాధించవచ్చు. అయితే ఎండోమెట్రియాసిస్ తీవ్రత ఎక్కువగా ఉంటే గర్భసంచిని తొలగించకుండానే ఆపరేషన్ ద్వారా తగ్గించవచ్చు.
►ప్రొలాప్స్: కొందరు మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ పొత్తికడుపు కండరాలు బలహీనపడతాయి. దాంతో వారిలో గర్భసంచి, దానికి తగ్గరగా ఉన్న బ్లాడర్, రెక్టమ్ వంటివి కిందికి జారడం జరగవచ్చు. దీనికి చికిత్సగా కెగెల్స్ ఎక్సర్సైజెస్ (పొత్తికడుపు కండరాలను బలపరచడం కోసం డాక్టర్ ఆర్నాల్డ్ కెగెల్స్ పేరిట రూపొందించిన ఎక్సర్సైజ్లు చేస్తారు. అయితే గర్భసంచి పూర్తిగా బయటకు వచ్చిన సందర్భాల్లో మాత్రం వెజినల్ హిస్టరెక్టమీ తప్పదు.
►డీయూబీ (డిస్ఫంక్షనల్ యుటిరైన్ బ్లీడింగ్): ఏ కారణం లేకుండా జరిగే అధిక రక్తస్రావాన్ని ‘డీయూబీ’గా అభివర్ణిస్తుంటారు. ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, డెనజాల్ మందులు వాడటం వల్ల ఈ కండిషన్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో చిన్న ఆపరేషన్‌గా అభివర్ణించే డీఅండ్‌సీ కూడా ఈ కండిషన్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇక గర్భసంచిలోనే అమర్చే లెవోనోజెస్టెరాల్ అనే హార్మోన్‌ను స్రవింపజేసే ఓ సాధనాన్ని గర్భసంచిలోకి ప్రవేశపెట్టడం వల్ల కూడా డీయూబీ సమస్యను 80 శాతం కేసుల్లో సమర్థంగా తగ్గించవచ్చు. ఎండోమెట్రియల్ అబ్లేషన్ వల్ల కూడా ఈ సమస్యకు ఫలితం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలన్నీ విఫలం అయితేనే గర్భసంచిని తొలగించడం అవసరం.
► వైట్ డిశ్చార్జీ: మనదేశంలో ఫైబ్రాయిడ్ సమస్య తర్వాత వైట్ డిశ్చార్జీ కేసుల్లో ఎక్కువగా హిస్టరెక్టమీ చేయించుకుంటున్నారు. మహిళల్లో వైట్ డిశ్చార్జీ అవుతుందంటే అది తప్పనిసరిగా ఇన్ఫెక్షన్ వల్లనే కాదు. సాధారణంగా రుతుస్రావానికి ముందు రెండుమూడు రోజులు వైట్ డిశ్చార్జీ అవుతుంది. ఆ తర్వాత రక్తస్రావం తగ్గిన తర్వాత మరో రెండుమూడు రోజులు వైట్ డిశ్చార్జీ అవుతుంది. ఇది చాలా సర్వసాధారణం. దీనికి ఎలాంటి చికిత్స అవసరం లేదు. కాని మంట, దురద ఎక్కువగా ఉండి వైట్ డిశ్చార్జీ అవుతుంటే దాన్ని ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన సమస్యగా గుర్తించవచ్చు. ఎన్నో రకాల బాక్టీరియా, వైరస్లు దీనికి కారణం కావచ్చు. సరైన సమయంలో తగిన చికిత్స దీన్ని తగ్గించుకోవచ్చు. అయితే... హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ (హెచ్‌సీవీ), హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) అనే వైరస్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల గర్భాశయకంఠం (సెర్విక్స్)లో కొన్ని మార్పులు జరిగి అవి దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది.వైట్డిశ్చార్జ్తో అందువల్ల మంట, దురద, వాసన ఉన్న సందర్భాల్లో ఆకుపచ్చ, పసుపచ్చ రంగుల్లో స్రావాలు కనిపిస్తే చికిత్స తీసుకోవాలి.
భయంలేదు...: ఇలా ఈ వైరస్ల వల్ల సెర్విక్స్‌లో దీర్ఘకాలంలో మార్పులు వచ్చి క్యాన్సర్‌కు దారితీస్తాయన్న విషయం ఆందోళన కలిగించినా... పాజిటివ్ అంశం ఏమిటంటే... సెర్విక్స్ క్యాన్సర్ ముందుగా వచ్చే ప్రీ–క్యాన్సర్ దశ చాలా కాలం (దాదాపు ఎనిమిది నుంచి పదేళ్లు) కొనసాగుతుంది. అంటే అది పూర్తి క్యాన్సర్‌గా రూపొందడానికి సాగే ముందస్తు దశ ఇంత సుదీర్ఘకాలం కొనసాగుతుంది కాబట్టి అక్కడ వచ్చే మార్పులను ముందుగానే పసిగడితే అది క్యాన్సర్ కాకముందే చికిత్స చేయడం సాధ్యపడుతుంది.
అపోహలు... వాస్తవాలు!
అపోహ: చివరి కాన్పు తర్వాత గర్భసంచి అక్కర్లేదు.
వాస్తవం: అది తప్పు. యుటెరస్ తొలగిస్తే మెనోపాజ్‌లో వచ్చే కాంప్లికేషన్స్ మరింత త్వరితంగా, తీవ్రంగా రావచ్చు.
అపోహ: మెనోపాజ్‌కు ముందూ, తర్వాత బ్లీడింగ్ ఒకింత ఎక్కువగా కావడం మామూలే.
వాస్తవం: ఇది సరికాదు. మెనోపాజ్‌కు ముందూ, తర్వాత బ్లీడింగ్ కనిపిస్తే డాక్టర్ చేత పరీక్షలు చేయించుకోవడం అవసరం.
అపోహ: మెనోపాజ్ దశకు చేరిన ప్రతి మహిళకూ హార్మోన్ రీ–ప్లేస్మెంట్ చికిత్స అవసరం.
వాస్తవం: అలాంటిదేమీ లేదు. మెనోపాజ్ తర్వాత కనిపించే లక్షణాలను బట్టి మాత్రమే అవసరమైతే హార్మోన్ రీప్లేస్మెంట్ చికిత్స చేస్తారు.
అపోహ: వైట్ డిశ్చార్జీ క్యాన్సర్‌కు దారితీస్తుంది.
వాస్తవం: ఇది నిజం కాదు. ఇన్ఫెక్షన్ ఉండి అది హెచ్‌పీవీ వంటి వాటిల్లో అయితేనే అది క్యాన్సర్‌కు దారితీయవచ్చు. గర్భాశయం అనేది మాతృత్వం, స్త్రీత్వానికి ప్రతీక. గర్భాశయం తీసివేయడం అనేది... తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన నిర్ణయం. అంతేతప్ప... మన చిన్న చిన్న సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని గర్బసంచిని తొలగించుకోవడం సమంజసం కాదు. దేహ నిర్మాణంలో, ఇతర కార్యకలాపాలు సక్రమంగా జరగడంలో గర్ఛసంచి పాత్ర కీలకం.
గర్భసంచి క్యాన్సర్ కనుక్కోవడం ఎలా...
1) పాప్ స్మియర్... ఎంతో సులువుగా, ఎంతో తక్కువ ఖర్చుతో చిన్న టెక్నిక్లలోనే చేయగల పరీక్ష ఇది. దీంతో సెర్విక్స్ క్యాన్సర్‌ను ప్రీ క్యాన్సర్ దశలోనే గమనించి సమర్థంగా చికిత్స చేయడం సాధ్యమవుతుంది 2) కాల్పోస్కోపీ... మాగ్నిఫికేషన్ ప్రక్రియ ద్వారా సెర్విక్స్లోని పుండు, వాపు, ఒరుపు, క్యాన్సర్ ముందు దశను కనుగొనడం జరుగుతుంది 3) సెర్వికల్ బయాప్సీ... క్యాన్సర్ అని అనుమానం వచ్చినప్పుడు సర్విక్స్‌లోని కొంత భాగాన్ని పరీక్ష చేయడం ద్వారా కనుగొనవచ్చు.
పాప్‌స్మియర్ ఎప్పుడు చేయించుకోవాలి...
ఇరవై నుంచి నలభై ఏళ్ల వయసులో ఉన్న మహిళలంతా తప్పనిసరిగా కనీసం ఏడాదికి ఒకసారి మూడేళ్లపాటు చేయించుకోవడం అవసరం. ఈ మూడేళ్ల రిపోర్ట్స్ మామూలుగా ఉన్నట్లయితే తర్వాత మూడేళ్లకు ఒకసారి, మెనోపాజ్ దశ చేరేవరకు, మెనోపాజ్ దశ తర్వాత ఐదేళ్లకు ఒకసారి 60 ఏళ్లు వరకు పాప్‌స్మియర్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
గర్భసంచి ఉపయోగాలు
ఓవరీ నుంచి (అండాశయంలో) విడుదలైన అండం, పురుషుడి వీర్యకణంతో కలిసి, ఫెలోపియన్ ట్యూబ్స్‌లో పిండంగా ఏర్పడి గర్భసంచిలోకి ప్రవేశిస్తుంది. గర్భధారణ జరిగాక గర్భసంచిలోని ఎండోమెట్రియమ్ పొర మందంగా మారుతుంది. ఆ పొరలోకి పిండం ఒదిగిపోతుంది. పిండానికి అవసరమైన పోషకాలు అందించడం, తొమ్మిది నెలలు పిండం ఎదిగేలా తోడ్పడటం గర్భసంచిలోనే జరుగుతాయి.
పిండం పూర్తిగా ఎదిగాక ప్రసవానికి కూడా తోడ్పడుతుంది. అలాగే మహిళల్లో ప్రతి నెలా వచ్చే రుతుక్రమానికి కూడా యుటెరస్ కారణమవుతుంది. ఓవరీస్ నుంచి విడుదలయ్యే అండం హార్మోన్లు, రుతుక్రమాన్ని, గర్భాన్ని నియంత్రిస్తుంది. ఇలా ఎన్నెన్నో జీవక్రియలకు కీలకం గర్భసంచి.
డాక్టర్ కోటేశ్వరి గంటా
కన్సల్టెంట్ గైనకాలజిస్ట్
అపోలో డీఆర్డీఓ హాస్పిటల్స్
హైదరాబాద్