గత స్మృతులకు సజీవ సాక్ష్యం ఫొటోగ్రఫీ
ముకరంపుర: గత స్మృతులకు సజీవ సాక్ష్యంగా ఫొటోగ్రఫీ నిలుస్తుందని జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్ నాగేంద్ర అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా జిల్లా ప్రెస్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో శనివారం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఫొటోగ్రఫీకి కాలాన్ని స్తంభింపజేసే శక్తి ఉందని, ఈ కళను బతికించుకోవాలని అన్నారు. విశిష్ట అతిథి నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ... ప్రెస్ ఫొటోగ్రఫీకి సమాజాన్ని మార్చే శక్తి ఉందన్నారు. ఒక వార్త చెప్పే సందేశం కంటే ఒక ఫొటో ఎన్నో రెట్ల భావాన్ని చెపుతుందన్నారు. ఫొటోగ్రఫీని చేతివృత్తిగా గుర్తించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పత్రికల ఫొటోగ్రఫర్లు తీసిన ఫొటోలు సమాజాన్ని కదిలించాయన్నారు. అనంతరం ఫొటోగ్రఫీ డే సందర్భంగా జిల్లాస్థాయి ఉత్తమ అవార్డులను ప్రదానం చేశారు. ప్రకృతి విభాగంలో ప్రథమ బహుమతి వూరడి మల్లికార్జున్ (సిరిసిల్ల సాక్షి రిపోర్టర్), తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాల విభాగంలో ప్రథమ బహుమతి బొమ్మెన కుమార్ (గొల్లపల్లి సాక్షి రిపోర్టర్), వార్తా కథనం విభాగంలో తృతీయ బహుమతి జవ్వాజి చంద్రశేఖర్ (మల్యాల సాక్షి రిపోర్టర్) బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో ఫ్రెస్ఫొటోగ్రఫీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఏలేటి శైలేందర్‌రెడ్డి, డీపీఆర్వో ప్రసాద్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు తాడూరి కరుణాకర్, కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు జనార్దన్, సతీష్, నరేష్ పాల్గొన్నారు.