పల్లెకు చేరిన హైటెక్ జూదం
మహబూబ్‌నగర్: పేకాట వల్ల కుటుంబాలు చిత్తవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పేకాట క్లబ్బులకు స్థానం లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వైపు చెప్తుంటే... మరోవైపు పాలమూరు జిల్లాలో పేకాట క్లబ్ స్థాయి దాటి క్యాష్నో స్థాయిలో స్థావరాలు వెలిశాయి. ఈ దందాను అరికట్టడంలో పోలీసు యంత్రాంగం మిడిల్‌డ్రాప్ అవుతోంటే రమ్మీలు, మూడుముక్కలు, పరేళ్ల షోలతో లక్షల నుంచి కోట్ల రూపాయల స్థాయిలో పేకాట సామ్రాజ్యం వర్థిల్లుతోంది.
కాసినో స్థాయిలో
జిల్లాలో పేకాట కొత్తపుంతలు తొక్కుతోంది. రోజుకు లక్షల రూపాయల సొమ్ము చేతులు మారుతోంది. ఈ మొత్తాన్ని చేతుల్తో మోయడం కష్టంగా మారిందేమో గానీ, ఏకంగా నోట్ల కట్టల స్థానంలో కాయిన్స్‌ను ప్రవేశపెట్టి మరీ పేకాట క్లబ్‌లను కాసినోల స్థాయికి తీసుకెళ్లారు. అమెరికా, సింగపూర్, మకావ్, లాస్‌వేగాస్, హాంకాంగ్ తరహాలో క్యాష్‌లెస్ గేమ్‌గా తీర్చిదిద్దారు. డబ్బుల స్థానంలో ఎరుపు, గులాబీ, ఆకుపచ్చ రంగుల్లో కాయిన్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో కాయిన్‌కు ఒక్కొ రేటు నిర్ణయించారు. ఈ పేకాట స్థావరాల్లోకి జూదగాళ్లు అడుగుపెట్టగానే తమ దగ్గరున్న డబ్బులతో కాయిన్లు కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత కౌబాయ్, జేమ్స్‌బాండ్ సినిమాల తరహాలో కాయిన్స్‌తో పేకాటను ఆడేస్తారు. బయటకు వెళ్లేప్పుడు కాయిన్స్‌ను మళ్లీ క్యాష్‌గా మార్చుకుంటారు.
ఒక్కొ కాయిన్‌కు ఒక్కోరేటు
పాలమూరు జూదం మాఫియా కాయిన్స్‌కు రేటు నిర్ణయించే క్రమంలో రంగులపై కంటే నంబర్లపై ఎక్కువ ఆధారపడింది. కాయిన్స్‌పై ఒకటి నుంచి వంద వరకు నెంబర్లు కేటాయించారు. ఈ నంబర్ల ఆధారంగా ఆ కాయిన్‌కు విలువ నిర్ణయించారు. కాయిన్‌పై ఒకటి నెంబర్ ఉంటే దాని విలువ వేయి రూపాయలు, రెండు ఉంటే రెండు వేల రూపాయలుగా నిర్ణయించారు. అదేవిధంగా కాయిన్స్రంగు, దాని మీద ఉండే నంబరు బట్టి ఆ కాయిన్స్ విలువ, ఆ కాయిన్స్‌ను ఏ ఆటలో ఆడాలనే అంశాల్లో తేడాలు ఉంటాయి. దీనివల్ల పేకాట ఆడే సమయంలో చిల్లర మార్చడం.. నోట్లు నలిగిపోవడం.. లెక్కపెట్టడం కష్టం అవడం వంటి సమస్యలు ఎదురుకావు. దాడి జరిగినా సులువుగా తప్పించుకోవచ్చనేది మాఫియా ఎత్తుగడగా తెలుస్తోంది.
భూత్పూరు ఘటనతో వెలుగులోకి
భూత్పూరు మండలం వాల్యానాయక్ తండాలో యాదమ్మ ఇంట్లో అక్రమంగా పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం తెల్లవారుజామున జడ్చర్ల రూరల్ సీఐ గిరిబాబు, మహబూబ్‌నగర్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాడుతున్న 12మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో 36వేల రూపాయలు, 53 ప్లాస్టిక్ కాయిన్స్ పట్టుబడ్డాయి. ఈ ప్లాస్టిక్ కాయిన్స్ వ్యవహారంపై మరింత విచారణ జరపగా... క్యాష్‌లెస్ పేకాటను నిర్వహిస్తున్న సిరిగిరి శ్రీనివాస్‌ను భగీరథకాలనీలోని అతని ఇంట్లోనే పట్టుకున్నారు. అతని నుంచి రూ. 20.15 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
సరిగ్గా మూడేళ్ల క్రితం డీఎస్పీ గీతాదేవి ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లోని లక్ష్మీనగర్ కాలనీలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. అప్పుడు కాయిన్స్‌పై కూపీ లాగితే రూ.ఏడు లక్షలు పట్టుబడ్డాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో కలకలం రేగింది.
రూ.కోట్లలో వ్యవహారం
జిల్లాలో చాపకింద నీరులా జూదం మాఫియా విస్తరించింది. తాజా ఘటనలో ఒకే వ్యక్తి దగ్గరి నుంచి 20లక్షల రూపాయలు లభించాయి. జిల్లాలో ఒక్క భూత్పూరు మండలంలోనే కాకుండా జడ్చర్ల, షాద్‌నగర్ తదితర ప్రాంతాల్లో కూడా పేకాట సామ్రాజ్యం వేళ్లూనుకుపోయింది. చాలాచోట్ల క్యాష్‌లెస్ పేకాట స్థావరాలు వెలిశాయి.
జిల్లాకు చెందిన వారితో పాటు హైదరాబాద్‌కు చెందిన జూదగాళ్లు తమ సరదా తీర్చుకునేందుకు జిల్లాకే వస్తున్నారు. దానితో ఈ వ్యవహారంలో రోజుకు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లుగా తెలుస్తోంది. కొన్నిచోట్ల రాజకీయనాయకులు, పోలీసుల అండదండలు సైతం ఉన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మాఫియా కారణంగా అనేక కుటుంబాలు ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడుతున్నాయి. నష్టపోయిన కొందరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం వల్లే ఇటీవల ఘటన వెలుగులోకి వచ్చింది.