hj dora
-
‘రాజకీయం అస్సలు వంటబట్టేది కాదతనికి’
సాక్షి, హైదరాబాద్ : నందమూరి హరికృష్ణకు డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో పలువురు డ్రైవర్లు ఉన్నా.. స్వయంగా వాహనం నడపడానికే ఆయన ఇష్టపడేవారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో... ఎన్నికల ప్రచారంలో భాగంగా హరికృష్ణ చైతన్యరథం నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తండ్రి ఎన్టీఆర్‌ను సినిమా షూటింగ్‌లకు తానే స్వయంగా కారు నడుపుతూ తీసుకెళ్లేవారు. డ్రైవింగ్‌లో నిష్ణాతుడనే పేరున్న హరికృష్ణ... ఇలా కారు ప్రమాదంలో మృతి చెందడంతోఅభిమానులు, సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. చైతన్య రథాన్ని వేల కిలోమీటర్లు నడిపించిన అన్నగారి రథసారథి ఈరోజు వాహన ప్రమాదంలో మరణించడం ఎంతో దురదృష్టమంటూ హరికృష్ణకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్బంగా మాజీ డీజీపీ హెచ్ జే దొర ఆటోబయోగ్రఫీ ‘ఎన్టీఆర్‌తో నేను’ పుస్తకంలో హరికృష్ణ గురించి ఆయన రాసిన మాటలను గుర్తు చేస్తూ.. ‘ఎన్టీఆర్‌తో నేను’ పుస్తకంలోని కొన్ని పంక్తులు మీకోసం... ‘తెలంగాణ వీధుల మీదుగా బయల్దేరిన ఎన్టీఆర్ చైతన్య రథం రాయలసీమ రాదారుల్లో తిరిగి తిరిగి అక్కడి నుంచి ఆంధ్రా వైపు మళ్లి చివరిగా ఉత్తరాంధ్రలో రెస్ట్ తీసుకుంది. ఇక్కడో విషయం తప్పకుండా ప్రస్తావించి తీరాలి. హనుమంతుడి గురించి చెబితే కాని రామకథ సంపూర్ణం కాదన్నట్టు ఎన్టీఆర్ వేల కిలోమీటర్ల ప్రయాణాలకి సారథ్యం వహించిన ఆయన కుమారుడు హరికృష్ణ గురించి ఇక్కడ చెప్పే తీరాలి. ఆ టూర్లలో నేనతన్ని చాలా నిశితంగా పరిశీలించేవాణ్ణి. ఎంతసేపూ అతని దృష్టి వాహనం నడపడం పైనే.. పగలల్లా తండ్రి గారు అధిరోహించిన రథాన్ని పరుగులు తీయించడం, రాత్రి ఆయన విశ్రమించాక మెకానిక్‌లతో కూర్చుని వ్యాన్‌కు అవసరమైన మరమ్మతులు చేయించడం... ఇదీ ఆయన దినచర్య. ఇందులో ఏనాడూ పెద్ద మార్పేదీ ఉండేది కాదు. నాన్నగారు ప్లస్ వ్యాన్ మినహా హరికృష్ణకి మరింకేదీ పట్టేది కాదు. ఎక్కడికి వెళ్తున్నారో, ఏ నియోజకవర్గంలో ఎవరి ప్రచారానికి వెళ్తున్నారో.. ఇవేమీ బొత్తిగా తెలియవతనికి. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడు. ఎందుకంటే తన ధ్యాసంతా తండ్రి గారిని సురక్షితంగా గమ్యానికి చేర్చడం మీదనే. రాజకీయం అస్సలు వంటబట్టేది కాదతనికి’ అంటూ హెచ్ జే దొర తన ఆటోబయోగ్రఫీలో హరికృష్ణ గురించి రాసుకొచ్చారు. -
వేసవిలో విద్యుత్ కోతలు ఉండవు
ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌జే దొర సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వచ్చే వేసవిలో కూడా కరెంట్ కోతలు లేకుండా చూసేందుకు మూడువేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను బయట నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌జె దొర తెలిపారు. జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే 24 గంటలు విద్యుత్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అయితే కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల పూర్తి స్థాయిలో విద్యుత్ ఇవ్వలేకపోతున్నామన్నారు. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ జూలైలో ప్రారంభించినా కొత్త ప్లాంట్ కావడంతో పూర్తిస్థాయిలో పనిచేయడానికి సమయం పడుతుందని చెప్పారు. ఈ మధ్య కాలంలో సింహాద్రి ప్లాంట్‌లో వెయ్యి మెగావాట్ల సామర్ధ్యం ఉన్న రెండు యూనిట్లు మరమ్మతుల నిమిత్తం ఆపామన్నారు. హిందుజా ప్లాంట్ ఈ నెలలో అందుబాటులోకి రావాల్సి ఉండగా, హుద్‌హుద్ తుఫాను కారణంగా జాప్యం జరిగిందన్నారు. మరో రెండు నెలల్లో ఇది అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. హిందుజా పూర్తయితే వచ్చే 1040 మెగావాట్లను మన రాష్ట్రానికే కేటాయించాలని ప్రతిపాదించారన్నారు. కృష్ణపట్నం రెండో దశ కూడా త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కేస్-1 బిడ్డింగ్‌లో రిలయన్స్ పవర్‌ప్లాంట్ నాలుగు వేల మెగావాట్లకి టెండర్లు ఆమోదించామని, అయితే న్యాయపరమైన కారణాల వల్ల ఇది ప్రారంభం కాలేదన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సౌర విద్యుత్ 620 మెగావాట్లకు టెండర్లు ఖరారు చేశామని చెప్పారు. మరో 1500 మెగావాట్లు ఎన్టీపీసీ, జెన్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌జె దొర తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచాలా వద్దా అన్న అంశంపై నిర్ణయం తీసుకోలేదన్నారు. కొత్తగా ఎప్పీడీసీఎల్ పరిధిలోకి అనంతపురం, కర్నూలు జిల్లాలు వచ్చి చేరడం వల్ల అసలు ఉత్పత్తి ఖర్చు ఎంత అవుతుంది, వినియోగం ఎంత, ఎంత ఆదాయం వస్తుందన్న అంచనాలు ఈ నెలాఖరుకి గానీ తయారు కావని చెప్పారు. అవి వచ్చిన తర్వాత టారిఫ్ ఎంత ఉండాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలిపారు.