‘రాజకీయం అస్సలు వంటబట్టేది కాదతనికి’ | Nandamuri Harikrishna As Chaitanya Ratha Sarathi To His Father | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 29 2018 2:51 PM | Last Updated on Wed, Aug 29 2018 4:30 PM

Nandamuri Harikrishna As Chaitanya Ratha Sarathi To His Father - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నందమూరి హరికృష్ణకు డ్రైవింగ్‌ అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో పలువురు డ్రైవర్లు ఉన్నా.. స్వయంగా వాహనం నడపడానికే ఆయన ఇష్టపడేవారు.  ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో... ఎన్నికల ప్రచారంలో భాగంగా హరికృష్ణ చైతన్యరథం నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తండ్రి ఎన్టీఆర్‌ను సినిమా షూటింగ్‌లకు తానే స్వయంగా కారు నడుపుతూ తీసుకెళ్లేవారు. డ్రైవింగ్‌లో నిష్ణాతుడనే పేరున్న హరికృష్ణ... ఇలా కారు ప్రమాదంలో మృతి చెందడంతోఅభిమానులు, సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. చైతన్య రథాన్ని వేల కిలోమీటర్లు నడిపించిన అన్నగారి రథసారథి ఈరోజు వాహన ప్రమాదంలో మరణించడం ఎంతో దురదృష్టమంటూ హరికృష్ణకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్బంగా మాజీ డీజీపీ హెచ్‌ జే దొర ఆటోబయోగ్రఫీ ‘ఎన్టీఆర్‌తో నేను’ పుస్తకంలో హరికృష్ణ గురించి ఆయన రాసిన మాటలను గుర్తు చేస్తూ..

‘ఎన్టీఆర్‌తో నేను’ పుస్తకంలోని కొన్ని పంక్తులు మీకోసం...
తెలంగాణ వీధుల మీదుగా బయల్దేరిన ఎన్టీఆర్‌ చైతన్య రథం రాయలసీమ రాదారుల్లో తిరిగి తిరిగి అక్కడి నుంచి ఆంధ్రా వైపు మళ్లి చివరిగా ఉత్తరాంధ్రలో రెస్ట్‌ తీసుకుంది. ఇక్కడో విషయం తప్పకుండా ప్రస్తావించి తీరాలి. హనుమంతుడి గురించి చెబితే కాని రామకథ సంపూర్ణం కాదన్నట్టు ఎన్టీఆర్‌ వేల కిలోమీటర్ల ప్రయాణాలకి సారథ్యం వహించిన ఆయన కుమారుడు హరికృష్ణ గురించి ఇక్కడ చెప్పే తీరాలి. ఆ టూర్లలో నేనతన్ని చాలా నిశితంగా పరిశీలించేవాణ్ణి. ఎంతసేపూ అతని దృష్టి వాహనం నడపడం పైనే.. పగలల్లా తండ్రి గారు అధిరోహించిన రథాన్ని పరుగులు తీయించడం, రాత్రి ఆయన విశ్రమించాక మెకానిక్‌లతో కూర్చుని వ్యాన్‌కు అవసరమైన మరమ్మతులు చేయించడం... ఇదీ ఆయన దినచర్య. ఇందులో ఏనాడూ పెద్ద మార్పేదీ ఉండేది కాదు. నాన్నగారు ప్లస్‌ వ్యాన్‌ మినహా హరికృష్ణకి మరింకేదీ పట్టేది కాదు. ఎక్కడికి వెళ్తున్నారో, ఏ నియోజకవర్గంలో ఎవరి ప్రచారానికి వెళ్తున్నారో.. ఇవేమీ బొత్తిగా తెలియవతనికి. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడు. ఎందుకంటే తన ధ్యాసంతా తండ్రి గారిని సురక్షితంగా గమ్యానికి చేర్చడం మీదనే. రాజకీయం అస్సలు వంటబట్టేది కాదతనికి’ అంటూ హెచ్‌ జే దొర తన ఆటోబయోగ్రఫీలో హరికృష్ణ గురించి రాసుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement