హాకీ ఇండియా లీగ్లో
పాక్ ఆటగాళ్లూ ఆడాలి
భారత మాజీ కెప్టెన్ ధన్రాజ్ పిళ్లై
బెంగళూరు: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో పాకిస్తాన్ ఆటగాళ్లను కూడా అనుమతించాలని భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ధన్రాజ్ పిళ్లై అభిప్రాయపడ్డారు. ఈమేరకు నిర్వాహకులు రాజకీయ నాయకుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో వారి నుంచి సానుకూలత వస్తుందనే ఆశిస్తున్నట్టు చెప్పారు. ‘గతేడాది చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో పాక్ ఆటగాళ్ల అనుచిత ప్రవర్తనకు క్షమాపణలు చెప్పేందుకు వారు నిరాకరిస్తున్నారు. అందుకే ఈ సమస్యంతా వచ్చింది. అయితే హాకీ ఇండియా (హెచ్ఐ) రాజకీయ నాయకులను కలిస్తే సమస్య పరిష్కారమవుతుంది. అలాగే హెచ్ఐఎల్ నిర్వాహకులు కొంత మొత్తాన్ని దేశంలో హాకీని అభివృద్ధి చేసేలా అకాడమీల ఏర్పాటు కోసం కేటాయించాలి’ అని పిళ్లై సూచించారు.