రోడ్డుపై గుంత @ అమీర్పేట్
హైదరాబాద్: విశ్వనగరిలో రోడ్డు ప్రయాణం రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. మొన్న ట్యాంక్ బండ్ పై ఏర్పడిన తరహాలోనే రద్దీ ప్రాంతమైన అమీర్ పేట్ (మైత్రివనం సమీపం) లోనూ రోడ్డుపై గుంత ఏర్పడింది. శనివారం సాయంత్రం ఆ ప్రాంతంలో వర్షం కురిసి వెలిసిన కొద్దిసేపటికే రోడ్డు కుంగిపోయి, గుంత ఏర్పడింది. దీనిని గుర్తించిన ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసులకు చెప్పారు.
దీంతో గుంత పడిన ప్రాంతం చుట్టూ ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. కాగా, పాత మురుగు నీటి పైప్ లైన్ పగిలిపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి గుంత పరిమాణం చిన్నదిగా కనిపిస్తున్నప్పటికీ, రోడ్డును తొలిచివేస్తేగానీ అసలు విషయం బయటపడదు. కొద్ది రోజుల కిందట ట్యాంక్ బండ్ పై(ఎన్టీఆర్ గార్డెన్స్ ఎదురుగా) రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది. గుంత ఏర్పడిన ప్రాంతంలో రోడ్డును తొలిచివేసిన అనంతరం భారీ గుంత బయటపడిన విషయం తెలిసిందే. పాతకాలం నాటి మురుగునీటి పైప్ లైన్లు పగిలిపోవడం వల్లే ట్యాంక్ బండ్ పై భారీ గుంత ఏర్పడినట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు.