ఉద్యోగులకు కేంద్రం హోలీ గిఫ్ట్!
న్యూ ఢిల్లీ: హోలీ సందర్భంగా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి వార్త అందించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని(డీఏ) 6 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది జనవరి నెల నుంచి అమలులోకి వస్తుందని టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాపై 14,700 కోట్ల భారం పడనుంది. డీఏ పెంపు నిర్ణయంతో 50 లక్షల మంది ఉద్యోగులు, 58 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
తాజా పెంపుతో మూల వేతనంలో డీఏ అలవెన్స్ 119 శాతం నుంచి 125 శాతానికి పెరిగింది. గతంలో ఏడవ వేతన సంఘం 24 శాతం డీఏ పెంచాలని సిఫారసు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా పెంచాలంటే ప్రభుత్వంపై లక్ష కోట్ల అదనపు భారం పడనుంది.