నో హాలిడే..!
ఆదివారమూ క్లాసులు నిర్వహిస్తున్న కార్పొరేట్ కాలేజీలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు : కార్పొరేట్ కాలేజీల్లో సెలవు రోజు ఆదివారం కూడా మళ్లీ క్లాసులు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేయడంతో గత నెలలో బందైపోయిన ఆదివారం క్లాసులు.. మళ్లీ పునఃప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతున్న ఈ క్లాసులు.. రాత్రి ఏడున్నర వరకూ ఉంటున్నాయి.
ఒకవైపు తరగతులు నడుస్తున్నప్పటికీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అటువైపు కనీసం కన్నెత్తి చూడటం లేదు. వారంలో అన్ని రోజులూ తరగతులు నడుస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పరీక్షలు సమీపిస్తున్న ఈ సమయంలో విద్యార్థులు అదనపు ఒత్తిడికి గురవుతూ చదివిన చదువు కాస్తా మరచిపోయే దుస్థితి ఏర్పడుతోంది.
ఇష్టారాజ్యంగా నిర్వహణ
జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యాబోధనలో ప్రభుత్వం జారీచేసిన అకడమిక్ కేలండర్‌ను ప్రైవేటు కాలేజీలేవీ పాటించడం లేదు. తరగతుల నిర్వహణతో పాటు సిలబస్ బోధనలోనూ వారిదే ఇష్టారాజ్యం. జనవరి, ఫిబ్రవరిలో పూర్తికావాల్సిన సిలబస్‌ను ఆగస్టు, సెప్టెంబరులోనే పూర్తి చేస్తున్నారు. అప్పటి నుంచి పరీక్షల సమయం వరకూ రెండు, మూడుసార్లు బట్టీ పట్టిస్తున్నారు. సిలబస్ పూర్తైప్పటికీ ఇప్పుడ కూడా ఆదివారాలు తరగతుల నిర్వహణ మాత్రం యథావిధిగా కొనసాగుతోంది.
కొద్దిరోజుల క్రితం విద్యార్థి సంఘాల ఆందోళనతో వెనక్కి తగ్గిన కార్పొరేట్ కాలేజీలు.. కుక్క తోక వంకర అన్నట్టుగా మళ్లీ తమ విధానాన్నే అనుసరించడం మొదలు పెట్టాయి. మరోవైపు ఈ ఒత్తిడికి తట్టుకోలేక అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘కార్పొరేట్ కాలేజీల తీరు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విద్యార్థులు ఒత్తిడికి తట్టుకోలేక రోగాల బారిన పడుతున్నారు. ప్రధానంగా వెన్ను నొప్పి, చేతులు, కాళ్లు లాగడం వంటి నరాల వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
‘నా వద్దకు ప్రతీ రోజూ ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు చూయించుకునేందుకు వస్తున్నారు. వీరంతా కార్పొరేట్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులే’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక న్యూరో ఫిజీషియన్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ తరహా విద్యాబోధన విద్యార్థులకు ఏ మాత్రమూ మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
కార్పొరేట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా.. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు సాహసించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే, అధికారులు మాత్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, ఆదివారం తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
ఇప్పటికే ఆదేశాలు జారీచేశాం
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అనుమతి పొందిన కాలేజీలకు క్యాలెండర్ విడుదల చేస్తాం. దీని ప్రకారం ఆదివారాలు తరగతులు నిర్వహించకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీచేశాం. కాలేజీలను తనిఖీలు కూడా చేస్తున్నాం. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా నడిస్తే చర్యలు తీసుకుంటాం.
- సుబ్రమణ్యేశ్వరరావు, ఆర్ఐవో, కర్నూలు