అంతులేని రుణ ఘోష
. రెండు వారాలుగా రిపబ్లికన్లు, డెమోక్రాట్లు కలిసి రక్తికట్టించిన అమెరికా షట్‌డౌన్, రుణ పరిమితి సంక్షోభాలు హాలీవుడ్ సినిమాలను తలదన్నే ఉత్కంఠతో బుధవారం ముగిసాయి. అమెరికన్లలో 70 శాతానికిపైగా ఈ అనవసర సంక్షోభానికి రిపబ్లికన్లే కారణమంటూ వేలెత్తి చూపిస్తున్నారు. ఈ కథలోని కాల్పనికతకు, వాస్తవికతకు మధ్య సరిహద్దు రేఖ అమెరికా ప్రభుత్వ రుణ పరిమితి పెంపుదలకు సెనేట్‌లో కుదిరిన అంగీకారమే. బరాక్ ఒబామా ప్రభుత్వం రిపబ్లికన్లు మెజారిగా ఉన్న ప్రతినిధుల సభలో వారి మద్దతుతోనే గట్టెక్కగలదని భావిస్తున్నారు. నిజానికి నేటి జంట సంక్షోభాల కథ 2009 నుంచి కొనసాగుతున్న గొలుసు కట్టుకథలోని ఒక భాగం మాత్రమే. జనవరి 15తో ప్రభుత్వ వ్యయ ఒప్పందమూ, ఫిబ్రవరి 7తో రుణపరిమితి పెంపుదల ఒప్పందమూ ముగిసిపోతాయి. అప్పుడు ప్రదర్శితం కాబోయే మరో భాగం కోసం మనం వేచి చూడక తప్పదు.
అంతులేని కథ
రిపబ్లికన్, డెమోక్రాట్ల ఈ సంకుల సమరపు ప్రహసనానికి నాంది 2010 నాటి ప్రతినిధుల సభ ఎన్నికల్లో డెమోక్రాట్ల పరాజయం. నేటిలాగే 2011 బడ్టెట్ విషయంలోనూ, రుణపరిమితి పెంపుదల బిల్లు విషయంలోనూ రిపబ్లికన్లు మోకాలడ్డారు. ఆనాడూ ప్రభుత్వం పాక్షికంగా మాతబడక తప్పదనే అంతా భావించారు. ప్రభుత్వ వ్యయానికి తగిన మేరకు నిదుల కేటాయింపుకు, సేకరణకు కాంగ్రెస్ అనుమతి లభించకపోవడం అమెరికా చరిత్రలో కొత్తకాదు. రిపబ్లికన్లేగాక డెమోక్రాట్లు కూడా షట్డౌన్కు కారణమయ్యారు. చివరికి ఒబామా నాడు దిగివచ్చి గ్రాండ్ ఓల్డ్ పార్టీ (రిపబ్లికన్లకు మరో పేరు... జీఓపీ) బడ్టెట్‌ను ఆమోదించి వారిని సంతృప్తిపరిచి గండం గట్టెక్కారు. 3,850 కోట్ల డాలర్ల మేరకు ప్రభుత్వ వ్యయంలో కోత పెట్టి ప్రజా సంక్షేమ వ్యయాలకు, ఉద్యోగావకాశాల తగ్గింపుకు అంగీకరించారు. నేటిలాగే నాడు కూడా రుణ పరిమితి సంక్షోభం తలెత్తింది. ప్రభుత్వ రుణంపై చట్టపరమైన పరిమితులున్నా వాటిని ఎప్పటికప్పుడు సవరించి ప్రభుత్వ రుణాన్ని పెంచడం కాంగ్రెస్‌కు అలవాటే. కాబట్టే 1980లో 1.3 లక్షల కోట్ల డాలర్లున్న ప్రభుత్వ వ్యయం 2012 నాటికి పదమూడు రెట్లకుపైగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అది 17.5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. ఫిబ్రవరినాటి వరకు అవసరమైన 16.8 కోట్ల డాలర్ల మేరకు పరిమితిని పెంచడానికి ఇప్పడు ఒప్పందం కుదిరింది.
పిచ్చుకలను కొట్టి...
2011 ఆగస్టులో ఒబామా రిపబ్లికన్ల డిమాండ్లకు తలొగ్గి ప్రభుత్వ వ్యయంలో తక్షణమే లక్ష కోట్ల డాలర్ల సంక్షేమ వ్యయాల కోతకు అంగీకరించారు. మరో 1.2 లక్షల కోట్ల డాలర్ల సామాజిక వ్యయాల ప్రత్యేక కోతను ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి తేవడానికి అంగీకరించారు. అంతేగాక బుష్ హయాంలో అధిక ఆదాయ, సంపన్న వర్గాలకు ఇచ్చిన తాత్కాలిక పన్ను రాయితీలు 4.6 కోట్ల డాలరలో 4 కోట్ల డాలర్లను శాశ్వతమైనవిగా మార్చారు. అమెరికా షట్‌డౌన్, దివాళాల భయోత్పాతాన్ని సృష్టించి రిపబ్లికన్లు, డెమోక్రాట్లు కలిపి ఆర్థిక సంక్షోభానికి అల్లాడుతున్న అమెరికన్ల సంక్షేమ వ్యయాలపై కత్తిని దూశారు. నాటి జీవోపీ బడ్జెట్, జీఓపీ రుణ పరిమితి ఒప్పందాల ఫలితంగా సంపన్న వర్గాలకు కలిగిన లబ్ధి 6.2 లక్షల కోట్ల డాలర్లు! 2011-12 మధ్య కుదిరిన ఒప్పందం అధ్యక్ష ఎన్నికల వరకు అమల్లో ఉంది. ఆ తర్వాత 2012 డిసెంబర్లో కథ మొదటికి వచ్చింది.
‘ఫిస్కల్ క్లిఫ్’ పేరిట ప్రాచుర్యంలోకి వచ్చిన ఆనాటి ప్రతిష్టంభనకుగానూ ఒబామా అధిక ఆదాయవర్గాలకు 4 లక్షల కోట్ల డాలర్ల శాశ్వత పన్నుల రాయితీలను సమర్పించుకున్నారు. రక్షణ వ్యయాలతో సహా 1.2 లక్షల కోట్ల డాలర్ల కోతలకు పూనుకొని రిపబ్లికన్లకు ఆగ్రహాన్ని కలిగించలేక మిన్నకుండిపోయారు. రెండేళ్లుగా డెమోక్రాట్లు, రిపబ్లికన్లు జీపీఓ బడ్టెట్ సంక్షోభం, సీక్వెస్టర్ ఒప్పందం, పిస్కల్ క్లిఫ్ పేరిట పిచ్చుకలను కొట్టి గద్దలకు వేసినట్టుగా ప్రభుత్వ వ్యయాల్లో ఉపాధి, విద్య, వైద్య, సంక్షేమ రంగాల్లో కోతలు విధించి అధిక ఆదాయ, సంపన్నవర్గాలకు మేలు చేశాయి. వాస్తవానికి ఒబామా నేటి షట్డౌన్కు 2011లోనే సిద్ధపడి ఉంటే రిపబ్లికన్లను అధ్యక్ష ఎన్నికల్లో మన్నుకరిపించగలిగే వారు. అందుకు బదులుగా బ్లాక్మెయిల్ రాజకీయాలకు లొంగి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా గెలిచారు.
ఒబామా ‘తెగింపు’
దాదాపుగా రిపబ్లికన్ల డిమాండ్లకు ఏ మాత్రం తల ఒగ్గకుండా ఒబామా రెండు వారాల ప్రభుత్వ షట్‌డౌన్‌తో ప్రభుత్వ రుణపరిమితి పెంపును సాధించారని డెమోక్రాట్లు గొప్పలు పోతున్నారు. గతంలో లేని ‘తెగింపు’ను ఒబామా నేడు ఎలా చూపగలిగారు? 2014 ఎన్నికల్లోనైనా ప్రతినిదుల సభలో డెమోక్రాట్లకు ఆధిక్యతను సాధించడం లక్ష్యంగా ఒబామా ‘బ్లాక్ మెయిళ్లకు లొంగేది లేదు’ అనే వైఖరిని చేపట్టారని అంటున్నారు. ఇక మరో వివరణ... ఒబామాకు అత్యంత ప్రీతిపాత్రమైన ‘అందరికీ అందుబాటులో వైద్య బీమా’ (ఏసీఏ) పథకానికి ప్రభుత్వ నిధుల కేటాయింపులో భారీ కత్తిరింపుల కోసం రిపబ్లికన్లు పట్టుబట్టడమే అందుకు కారణమనేది.
ఎన్నికల ఆటలో భాగంగానే ఒబామా వారానికి 100 కోట్ల డాలర్ల స్థూల జాతీయాదాయానికి గండిపడే అతి ఖరీదైన ప్రభుత్వ మూసివేతకు దిగి ఉంటే... అది మంచి ఎత్తుగడేగానీ ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాది సమయం ఉంది. అలోగా రిపబ్లికన్లపై నేడు మిన్నంటిన వ్యతిరేకత తగ్గి, ఒబామా జనాదరణలేని అధ్యక్షునిగా నిలవక తప్పదు. ఇక కాస్త సమంజసమైనదిగా కనిపిస్తున్న ‘ఒబామా కేర్’ మిగులుతుంది. నేటి షట్‌డౌన్ ఒప్పందం కోసం ఒబామా ఎలాంటి మూల్యం చెల్లించడం లేదనేది బూటకం. ఒప్పందంలో లేకపోయినా 2014 బడ్జెట్లో సామాజిక సంక్షేమ వ్యయాల్లో 65,000 కోట్ల డాలర్ల కోతలకు ఆయన సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు 2014లో గుత్తసంస్థల కోసం కార్పొరేట్ పన్నును 35 శాతం నుంచి 28 శాతానికి తగ్గించడానికి కూడా వాగ్దానం చేశారు. 2009లో మొదలైన రిపబ్లికన్లు, డెమోక్రాట్ల బూటకపు పోరు లక్ష్యం సామాన్యులను కడతేర్చే ‘పొదుపు చర్యలను’ గత్యంతరంలేని కోతలుగా చెలామణి చేయడమే.
నేటి ఒప్పందమేగాక వచ్చే ఏడాది కుదరబోయో మరో ఒప్పందం కూడా ‘99 శాతం’ అమెరికన్లను దివాళా తీయించేదే. నిరంతర యుద్ధ వ్యయాలు, పెరుగుతున్న రక్షణ వ్యయాల జోలికి పోకుండానే, సంపన్నులకు, కార్పొరేట్ కుబేరులకు ఇస్తున్న పన్నుల రాయతీలను పెంచుతుండటం కారణంగానే ప్రభుత్వ వ్యయానికి, రాబడికి మధ్య గండి పెరుగుతూ వస్తోంది. అదే కారణంగా ప్రభుత్వ రుణం ఏటికేడాది కొండెక్కి కూచుంటోంది. ఈ వాస్తవాలను విస్మరించి లోటు బడ్జెట్లకు స్వస్తిపలికి, ప్రభుత్వరుణాలను తగ్గించడానికి సంక్షేమ వ్యయాలపై కత్తులు దూస్తున్న ఒబామా ప్రభుత్వం పేదరికాన్ని పెంచుతోంది.
ఒబామా కేర్ ఎండమావుల్లో
ఒబామా ఆరోగ్య బీమా పథకానికి (ఏసీఏ చట్టం) ప్రభుత్వ నిధుల కేటాయింపులను నిలిపివేయాలనే రిపబ్లికన్ల మొండిపట్టుతోనే అమెరికా ప్రభుత్వం మూతపడి, దివాళా తీసే పరిస్థితికి చేరిందని విశ్లేషకులు చెబుతూ వచ్చారు. అది అసలు సమస్య కానే కాదని ‘తీవ్రవాద’ రిపబ్లికన్లైన ‘టీ పార్టీ’ ఆర్థిక సిద్ధాంతకర్త పాల్ రయాన్ వారం క్రితమే ప్రకటించారు! ఆయన అన్నట్టే తాజా ఒప్పందంలో నామమాత్రంగా తప్ప ఆ ఊసే రాలేదు. అందులో ఆశ్చర్యపోవాల్సింది లేదు. రిపబ్లికన్ల ఆరోగ్య బీమా పథకాన్ని వారే ఎందుకు వ్యతిరేకించాలి? అంతా అనుకుంటున్నట్టు ఒబామా కేర్ ఒబామా మానస పుత్రి కాదు. మితవాద రిపబ్లికన్ల మేథో నిధి ‘హెరిటేజ్ ఫౌండేషన్’ సృష్టి! ఏకైక అగ్రరాజ్యం అమెరికా పౌరులందరికి ఆరోగ్య భద్రతకు హామీని ఇచ్చే బీమా సదుపాయం లేని ఏకైక అభివృద్ధి చెందిన దేశం.
ఈ నెల ఒకటి నుంచి ఏసీఏ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా 31 కోట్ల జనాభాలో 4.8 కోట్ల మంది ఎలాంటి ఆరోగ్య బీమా లేకుండానే మిగులుతారు! పైగా యురోపియన్ దేశాలకు భిన్నంగా ఒబామా కేర్ ప్రజా వైద్య సదుపాయాలను సరుకుగా భావిస్తోంది. ప్రైవేటు సంస్థల నుంచి ఆరోగ్య బీమాను ‘కొనుక్కోడానికి’ సబ్సిడీని ఇస్తుంది. ప్రపంచంలోనే వైద్యం, మందులు అతి ఖరీదైన దేశంలో అధిక ఆదాయ వర్గాలకు మాత్రమే (ప్లాటినమ్ పాలసీ ఉన్నవారికి) బీమా సంస్థలు 90 శాతం వైద్య వ్యయాన్ని భరిస్తాయి. మధ్యతరగతి, పేదవర్గాలు కొనుక్కోగల బీమా పథకాలకు 40 నుంచి 50 శాతం వ్యయాన్ని మాత్రమే చెల్లిస్తారు. ఏ ప్లానైనా కార్పొరేట్ ఆసుపత్రుల, బీమా సంస్థల జాబితాలో ఉన్న సేవలకు మాత్రమే వర్తిస్తాయి.
ఒబామా కేర్‌ను నమ్ముకుంటే అప్పుల పాలై దివాళా తీయడం ఖాయం. జైళ్లకు చేరేవారికి కొదవ లేదు. సార్వత్రికమైన సమగ్రమైన ఒకే ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం కోసం ప్రగతిశీల శక్తులు చాలా కాలంగా చేస్తున్న ఆందోళనను ఒబామా కేర్ హైజాక్ చేయగలిగింది. గజేంద్రుని మొర ఆలకించిన విష్ణుమూర్తిలాగా అమెరికన్ల ఆరోగ్య భద్రతను ఒబామా కాపాడారనటం బూటకం. నేడు నిజానికి అమెరికాలో సాగుతున్నది కార్పొరేట్ సంస్థల ఏకపార్టీ పాలన. ఒక విశ్లేషకుడు అన్నట్టుగా డెమోక్రాట్లకు, రిపబ్లికన్లకు మధ్య సాగుతున్న పోరు అతి మితవాదులకు, అంత అతిగా మితవాదులు కానివారికి మధ్య సాగుతున్న పోరు.
-పిళ్లావెంకటేశ్వరరావు