Holy month Ramzan
-
రంజాన్ దీక్షలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ముస్లిం సోదరులు శుక్రవారం తెల్లవారు జామున సహర్‌తో ఉపవాస దీక్షలు చేపట్టారు. మసీదులు కిటకిటలాడాయి. తొలిరోజు శుక్రవారం కావడంతో హైదరాబాద్ పాతబస్తీలోని చారిత్రాత్మక మక్కా మసీదులో పెద్ద ఎత్తున సామూహిక ప్రార్థనలు జరిగాయి. అనంతరం మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన యౌముల్ ఖురాన్ జల్సాలో చార్మినార్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ తదితరులు పాల్గొని ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. సాయంత్రం ఇఫ్తార్ విందులతో దీక్షలను విరమణ చేశారు. అనంతరం దీక్షాపరులు పెద్ద ఎత్తున హలీంలను ఆరగించారు. రాత్రి తొమ్మిది గంటల అనంతరం ప్రత్యేక తరావీ నమాజ్‌లతో మసీదులు కిటకటలాడాయి. నగరంలోని పాతబస్తీలో ఎక్కడ చూసినా రంజాన్ సందడి కనిపించింది. వ్యాపార సంస్థలన్నీ రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా మారాయి. కన్నులు మిరుమిట్లు గొలిపే విధంగా దీపకాంతులు వెదజల్లాయి. -
పవిత్ర మాసం ప్రారంభం
సకల శుభాల పవిత్ర మాసం రంజాన్ ప్రారంభమైంది. గురువారం నెలవంక దర్శనంతో ముస్లింలు ఉపవాసాలకు సమాయత్తమయ్యారు. మసీదుల్లో ఇమామ్‌లు రంజాన్ మాసాన్ని ప్రకటించారు.ముస్లింలు పరస్పరం ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రంజాన్ మాసాన్ని ఆహ్వానించారు. నగరంలోని మసీదులన్నీ ఇప్పటికే ముస్తాబయ్యాయి. పవిత్ర ప్రార్థనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రంజాన్ పవిత్రత..ఉపవాసాల ప్రత్యేకతలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... - చార్మినార్ సహర్.. ఉపవాసం(రోజా) ఉండదలచని వారు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో భోజనం చేస్తారు. దీనినే ‘సహర్’ అంటారు. సాయంత్రం వరకు మంచినీటితో సహా ఏ పదార్థాన్ని తినరు కాబట్టి భోజనంలో పోషకాలు ఉండేలా చూసుకుంటారు. ఏదైనా కారణం వల్ల సహర్ తీసుకోకపోయినా వ్రతాన్ని మాత్రం ఆపరు. ఇఫ్తార్.. సూర్యాస్తమయం తరువాత ఏదైనా ఆహారం తీసుకుని ఆ రోజు దీక్షను విరమించడమే ‘ఇఫ్తార్’. ఖర్జూరాలతో ఇఫ్తార్ చేయడం ప్రవక్త సంప్రదాయం. అందుకే ముస్లింలంతా ఖర్జూరాలతోనే ఇఫ్తార్ చేస్తారు. ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిష్టతో ఉంటారు కనుక దీక్షను విరమించేటప్పుడు ఉపవాసి దేనిని అర్థించినా అల్లాహ్ స్వీకరిస్తాడని నమ్మకం. రంజాన్ సందర్భంగా దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ లైటింగ్‌ను పాతబస్తీలోని శాలిబండలో ఏర్పాటు చేశారు. దీన్ని గురువారం ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రారంభించారు. చిత్రంలో పిస్తాహౌస్ ఎండీ ఎంఏ మజీద్ తదితరులున్నారు. నాలుగు వాక్యాలే ప్రధానం ఈ పవిత్ర మాసంలో మహ్మద్ ప్రవక్త నాలుగు విషయాలను అధికంగా స్మరించమని ఉపదేశించారు. అవేమంటే.. 1. లాయిలాహ ఇల్లల్లాహ్: దేవుని ఏకత్వాన్ని స్తుతించడం 2. అస్తగ్ఫిరుల్లా: అపరాధాల మన్నింపునకు దైవాన్ని వేడుకోవడం 3. అస్అలుకజన్నత్: స్వర్గాన్ని అనుగ్రహించమని అర్థించడం 4. అవుజుబికమిన్నార్: నరకం నుంచి విముక్తి ప్రసాదించమని కోరడం రంజాన్ మాసంలో... ♦ రంజాన్ మాసంలోని తొలి పది రోజులు కారుణ్యదినాలు ♦ 10 నుంచి 20 వరకు క్షమాపణ రోజులు ♦ 20 నుంచి 30 వరకు నరకాగ్ని నుంచి విముక్తి దినాలు ♦ ఉపవాస వ్రతం ప్రారంభించేందుకు ముస్లింలు సంకల్పం చేసుకుంటారు. ప్రారంభమైన తరావీ నమాజ్‌లు.. రంజాన్ ప్రారంభం కావడంతో గురువారం రాత్రి నుంచి నగరంలో మసీదులు, వివిధ ఫంక్షన్ హాళ్లలో తరావీ నమాజ్‌లు ప్రారంభమయ్యాయి. పవిత్ర మాసం ముగిసే (మళ్లీ నెలవంక దర్శనం) వరకు ప్రతిరోజూ తరావీ నమాజులు కొనసాగనున్నాయి. ఈ నమాజుల్లో రోజుకు ఖురాన్‌లోని కొన్ని అధ్యాయాలను చదివి వినిపిస్తారు. రంజాన్ మాసం పూర్తయ్యేలోగా ఖురాన్ పఠనం పూర్తి చేస్తారు.