రంజాన్ దీక్షలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ముస్లిం సోదరులు శుక్రవారం తెల్లవారు జామున సహర్‌తో ఉపవాస దీక్షలు చేపట్టారు. మసీదులు కిటకిటలాడాయి. తొలిరోజు శుక్రవారం కావడంతో హైదరాబాద్ పాతబస్తీలోని చారిత్రాత్మక మక్కా మసీదులో పెద్ద ఎత్తున సామూహిక ప్రార్థనలు జరిగాయి. అనంతరం మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన యౌముల్ ఖురాన్ జల్సాలో చార్మినార్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ తదితరులు పాల్గొని ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు.
సాయంత్రం ఇఫ్తార్ విందులతో దీక్షలను విరమణ చేశారు. అనంతరం దీక్షాపరులు పెద్ద ఎత్తున హలీంలను ఆరగించారు. రాత్రి తొమ్మిది గంటల అనంతరం ప్రత్యేక తరావీ నమాజ్‌లతో మసీదులు కిటకటలాడాయి. నగరంలోని పాతబస్తీలో ఎక్కడ చూసినా రంజాన్ సందడి కనిపించింది. వ్యాపార సంస్థలన్నీ రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా మారాయి. కన్నులు మిరుమిట్లు గొలిపే విధంగా దీపకాంతులు వెదజల్లాయి.