Home Guard suicide
-
హైదరాబాద్: హోంగార్డ్ రవీందర్ కన్నుమూత
సాక్షి,హైదరాబాద్: టైంకి జీతం పడలేదని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హోంగార్డు రవీందర్ మృతి చెందారు. చికిత్స పొందుతూ ఇవాళ(శుక్రవారం) ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్లు కంచన్‌బాగ్ డీఆర్డీవో అపోలో వైద్యులు ప్రకటించారు. నాలుగు రోజుల కిందట.. జీతాలు పడలేదనే ఆవేదనతో ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించారు. తీవ్ర గాయాలైన ఆయన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించడంతో డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తూ వచ్చారు. హోంగార్డ్ రవీందర్ మృతిపై హోంగార్డ్ జేఏసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఏం జరిగిందంటే.. పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం (సెప్టెంబర్ 5వ తేదీన) సాయంత్రం గోషామహల్‌లోని ఓ ఏటీఎంకు వెళ్లి తన బ్యాంకు ఖాతాను చూసుకోగా ఇంకా జీతం పడలేదు. వెంటనే గోషామహల్లోనే ఉన్న హోంగార్డు కమాండెంట్ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందితో తన జీతం గురించి వాకబు చేశాడు. చెక్కులు సిద్ధంగా ఉన్నాయని, ఒకట్రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జీతం డబ్బులు జమ అవుతాయని వారు బదులిచ్చారు. అయినప్పటికీ ఆవేదనకు గురైన రవీందర్ సీసాలో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. సకాలంలో జీతాలు అందక.. బ్యాంక్ ఈఎంఐ చెల్లింపు ఆలస్యం అవుతోందన్న మనస్థానంతో రవీందర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. మంగళవారం (సెప్టెంబర్ 5వ తేదీన) షాయినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 55 శాతం పైగా కాలిన గాయాలతో ఆయన తొలుత ఉస్మానియా ఆస్పత్రిలో చేరారు. ఆపై పరిస్థితి విషమించడంతో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. వేధింపులు కూడా.. అయితే ఆయన భార్య సంధ్య మాత్రం.. సకాలంలో జీతం అందకపోవడం మాత్రమే కాదని.. అధికారుల వేధింపులు కూడా తన భర్త ఆత్మహత్యకు ప్రయత్నించడానికి కారణమని చెబుతున్నారు. జీతాలు అందకపోవడం మాత్రమే కాదు.. ఇప్పుడు తన భర్తకి మంచి చికిత్స అందించలేని స్థితిలో ఉన్నానని, హోంగార్డుల దుస్థితికి ఇది నిదర్శనమని ఆమె పేర్కొంటూ.. సీఎం కేసీఆర్ స్పందించాలంటూ కోరారామె. మరోవైపు రవీందర్ ఆత్మహత్యాయత్నం ఘటన హోంగార్డుల్లో ఆవేశాగ్రహాలకు దారి తీసింది. విధుల బహిష్కరణతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యాచరణకు పిలుపు ఇచ్చింది హోంగార్డ్ జేఏసీ. హోంగార్డులను వెంటనే పర్మినెంట్ చేయాలంటూ హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. సకాలంలో హోంగార్డులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రవీందర్‌కు మద్దతుగా హోంగార్డులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని సంఘీభావం కూడా ప్రకటించారు. ఇంతలోనే ఆయన కన్నుమూశారు. రాజకీయ విమర్శలు ఇంకోవైపు రవీందర్ ఆత్మహత్యాయత్నం రాజకీయ దుమారం రేపింది. ఎమ్మెల్యే రాజాసింగ్.. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వమే రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, కేంద్ర మంత్రి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి రవీందర్‌ను, ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు. కనీస హక్కులను కూడా పరిరక్షించకుండా.. హోంగార్డ్ వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం అవమానిస్తోందని, హామీ ఇచ్చి ఐదేళ్లైనా హోంగార్డుల ఉద్యోగ భద్రత విషయంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. -
కుటుంబ కలహాలతో హోంగార్డ్ ఆత్మహత్య
సాక్షి, మధురవాడ(విశాఖపట్టణం) : కుటుంబ కలహాలతో ఓ హోంగార్డ్ బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం సూర్యాభాగ్లోని నగర పోలీస్ కమిషనరేట్ సమీపంలో ఉన్న వైశాఖి జల ఉద్యానవనం వద్ద చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 2012లో హోంగార్డ్‌గా ఉద్యోగాన్ని ప్రారంభించిన గంటా ప్రకాశరావు(40) గుంటూరు ప్రాంతవాసి. పీఎం పాలెం పోలీసు స్టేషన్లో కొనేళ్లుగా పోలీసు రక్షక్ వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ప్రకాశ్‌కు పదేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన ప్రియాంక(30)తో వివాహమైంది. ఉద్యోగం, ఇతర కారణాలు రీత్యా ఎండాడ వరాహగిరి నగరంలో స్థిర పడ్డారు. ఇక్కడి జీ ప్లస్2 భవనంలోని పైఫ్లోర్‌లో ప్రకాశ్ భార్య, పిల్లలు ఆశ్రిత్(6), అఖిల్(4)తో నివాసం ఉంటున్నాడు. అదే భవనం కింది ఫ్లోర్లో ఆయన తండ్రి మరియదాసు, తల్లి విజయకుమారి నివాసం ఉంటున్నారు. తండ్రి సీబీసీఐడీలో ఎస్ఐగా పనిచేసి రిటైరయ్యారు. ఏడాది పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు వచ్చాయి. తరచూ గొడవలు పడుతుండేవారు. కొన్నాళ్ల కిత్రం భార్య ప్రకాష్‌పై గృహ హింస వేధింపుల(498) కేసు పెట్టింది. తర్వాత లోక్ అదాలత్‌లో కేసు రాజీ అయ్యారు. కలహాలు పెంచిన ఫేస్బుక్ పోస్టు గొడవలు జరుగుతుండగానే గత నెల 14న తనను వేధింపులకు గురిచేసి కొడుతున్నట్టు భార్య ప్రియాంక ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టినట్టు సమాచారం. తర్వాత పీఎం పాలెం పోలీసు స్టేషన్లో కూడా ఆమె మౌఖిక ఫిర్యాదు ఇవ్వగా.. లిఖిత పూర్వకంగా ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే అప్పటికి ఆమె ఫిర్యాదు ఇవ్వలేదు. ఇదిలా ఉండగా గత నెల 16న ప్రియాంక, ఆమె తల్లిదండ్రులు, మరో వ్యక్తి కలిసి తనను తీవ్రంగా కొట్టారని, ఎంఎల్సీ చేయించుకుని పీఎంపాలెం పోలీసు స్టేషన్లో ప్రకాశ్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ప్రియాంక సూర్యభాగ్లోని డీసీపీ–1కి ప్రకాష్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రకాష్‌ను పిలిపించారు. ‘నీ భార్య ఫిర్యాదు ఇచ్చింది. పోలీసు కార్యాలయంలోనే కూర్చోవాలని’ చెప్పారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం రాత్రి 9.25 గంటలకు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వైద్యం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 4.30 గంటల సమయంలో మృతి చెందాడు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు స్పందిస్తే ఓ నిండు ప్రాణం దక్కేది! ప్రకాశ్ చనిపోవడానికి ముందే వాట్సప్‌లలో మరణ వాగ్మూలాన్ని పోస్ట్ చేశాడు. దీన్ని అందరితో పాటు పోలీసులు కూడా తేలిగ్గా తీసుకున్నారు. సకాలంలో స్పందించి ఉంటే ఓ నిండు ప్రాణం నిలబడేదని పలువురు అంటున్నారు. నమ్మండి.. నమ్మకపోండి.. ఇక బై ప్రకాశ్ పీఎంపాలెం పోలీసు స్టేషన్లో రక్షక్ వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి పోలీసు రిటైర్డ్ ఎస్ఐ, సోదరి పోలీసు కానిస్టేబుల్. మొత్తంగా వీరిది పోలీసు కుటుంబం. చీటికి మాటికీ భార్య గొడవ పడుతూ పోలీసు స్టేషన్‌కి, కోర్టుకి లాగుతుండంతో భరించలేకపోయాడు. దీంతో సెల్‌ఫోన్ వీడియో చిత్రీకరించి వాట్సప్‌లలో పోస్ట్ చేశాడు. ఆయన మాటల్లోనే.. ‘నమస్కారం సార్.. నా పేరు గంటా ప్రకాశరావు, హెచ్‌జీ 457, పీఎంపాలెం రక్షక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. మా ఆవిడతో కొంత కాలంగా నాకు గొడవలు అవుతున్నాయి. సర్దుకుపోతున్నా ఆమె వినడం లేదు. తరచూ పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేస్తోంది. ఇటీవల 498ఏ కేసు కూడా పెట్టింది. మళ్లీ లోక్ అదాలత్‌లో ఆమె రాజీకొచ్చింది. మనశ్శాంతిగా ఉద్యోగం చేయనివ్వడం లేదు. ఇటీవల తాను వేధించి, కొట్టేశానని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. ఆమె కుటుంబ సభ్యులతో కూడా నన్ను కొట్టించింది. దీనిపై ఫిర్యాదు చేస్తే కనీసం గంట కూడా స్టేషన్లో ఉంచకుండా వారిని పంపించేశారు. అదే మా ఆవిడ డీసీపీ–1కు ఫిర్యాదు చేస్తే నన్ను స్టేషన్‌కు పిలిచి, విచారించారు. నేను ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేదు. దీంతో మనస్తాపంతో చనిపోవాలని నిర్ణయించుకున్నాను. సర్ ఇదే నా చివరి మరణ వాంగ్మూలం. మీరు నమ్మండి నమ్మకపోండి. ఇక బై’. అంటూ ప్రకాశ్ పెట్టిన సెల్ఫీవీడియో వైరల్ అవుతోంది.. -
‘రేణుకా.. భోజనానికి వస్తున్నా..సిద్ధం చెయ్’
ఖమ్మంక్రైం : ‘రేణుకా.. భోజనానికి వస్తున్నా.. తయారు చేసి ఉంచు’ అని భార్యకు ఫోన్ చేసిన ఓ హోంగార్డు.. ఇంటికి వెళ్లకుండానే అనంతలోకాలకు పోయిన ఘటన ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ఫోన్ చేసి గంటలు గడస్తున్నా భర్త రాకపోవడంతో ఆ ఇల్లాలు అతడి సెల్‌కు ఫోన్ చేస్తే స్పందన లేదు. తర్వాత కాసేపటికే ‘నీ భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటూ’ వచ్చిన ఫోన్‌తో కుప్పకూలిపోయింది. తన ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని ఆ హాంగార్డు లేఖ రాసి పెట్టాడు. వివరాలిలా ఉన్నాయి.. కొణిజర్ల మండలం పెద్దగోపతికి చెందిన రుద్రగాని సైదారావు (40) సీపీ కార్యాలయంలోని సీసీఆర్బీలో హాంగార్డుగా పని చేస్తున్నాడు. రోజూ ఊరి నుంచి వచ్చి వెళ్తుంటాడు. మంగళవారం కూడా విధులకు హాజరైన సైదారావు సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌లోని గోడపక్కనున్న చెట్టు కింద అపస్మారకస్థితిలో ఉండగా.. క్రికెట్ ఆడుతున్న విద్యార్థులు చూసి ఏఆర్ సిబ్బందికి తెలిపారు. వారు వచ్చి చూసేసరికే సైదారావు మృతిచెందాడు. పక్కన గుళికల ప్యాకెట్ ఉంది. సమాచారం తెలియగానే హెడ్ క్వార్టర్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సీపీ తఫ్సీర్ ఇక్బాల్ మృతదేహన్ని సందర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. హాంగార్డు కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. అడిషనల్ డీసీపీ సురేస్‌కుమార్, ఏసీపీలు రామానుజం, వెంకటేశ్వర్లు, విజయబాబు, ఆర్ఐ శ్రీనివాస్ మృతదేహాన్ని సందర్శించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే.. తాను ఆర్థిక ఇబ్బందులు తాళలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నాని, ఎవరూ కారణం కాదని సైదారావు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. కాగా, మంగళవారం ఉదయం డ్యూటీ కి బయలుదేరే ముందు తన స్నేహితుడిని కలిసిన సైదారావు.. తనకు ఎల్ఐసీపాలసీ ఉందని, తాను మృతిచెందితే కుటుంబానికి హాంగార్డులు అంతా కలిసి ఒకరోజు వేతనాన్ని అందిస్తారని చెప్పాడు. అయితే సైదారావు సరదాగా మాట్లాడుతున్నాడని భావించానని మిత్రుడు విలపిస్తూ చెప్పాడు. సైదారావు చిన్నపాటి ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడని, డబ్బులు ఇవ్వాల్సిన వారు ఇబ్బంది పెట్టడం వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని బంధువులు అంటున్నా రు. మృతదేహన్ని పోలీస్ వాహనం వజ్రలో పెద్దగోపతికి తరలించారు. వనటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హోంగార్డు ఆత్మహత్య
బదిలీయే కారణమంటున్న కుటుంబ సభ్యులు కుటుంబ కలహాలే కారణం అంటున్న అధికారులు పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని భూమ్‌నగర్‌లో హోంగార్డు సీహెచ్.సతీశ్(32) శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన సతీశ్ ధర్మారం ఠాణా నుంచి పెద్దపల్లికి రెండేళ్ల క్రితం వచ్చాడు. కొత్త జిల్లాల ఏర్పాటుతో హోంగార్డులను వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ క్రమంలో సతీశ్‌ను జగిత్యాల ఠాణాకు బదిలీ చేశారు. పెద్దపల్లి నుంచి రాకపోకలు సాగిస్తున్న సతీశ్ శుక్రవారం అక్కడ విధులు ముగించుకుని పెద్దపల్లికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారులు బదిలీ చేయడంతోనే ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, మిత్రులు చెబుతున్నారు. పోలీస్ అధికారులు మాత్రం కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. సతీశ్‌కు భార్య మీన, కూతురు ఉంది. భార్యాభర్తల మధ్య తగాదాలు ముదిరి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. సీఐ మహేశ్ మృతదేహాన్ని సందర్శించారు.