సాక్షి,హైదరాబాద్: టైంకి జీతం పడలేదని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హోంగార్డు రవీందర్ మృతి చెందారు. చికిత్స పొందుతూ ఇవాళ(శుక్రవారం) ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్లు కంచన్‌బాగ్ డీఆర్‌డీవో అపోలో వైద్యులు ప్రకటించారు.
నాలుగు రోజుల కిందట.. జీతాలు పడలేదనే ఆవేదనతో ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించారు. తీవ్ర గాయాలైన ఆయన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించడంతో డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తూ వచ్చారు. హోంగార్డ్ రవీందర్ మృతిపై హోంగార్డ్ జేఏసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఏం జరిగిందంటే..
పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం (సెప్టెంబర్ 5వ తేదీన) సాయంత్రం గోషామహల్‌లోని ఓ ఏటీఎంకు వెళ్లి తన బ్యాంకు ఖాతాను చూసుకోగా ఇంకా జీతం పడలేదు. వెంటనే గోషామహల్‌లోనే ఉన్న హోంగార్డు కమాండెంట్ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందితో తన జీతం గురించి వాకబు చేశాడు. చెక్కులు సిద్ధంగా ఉన్నాయని, ఒకట్రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జీతం డబ్బులు జమ అవుతాయని వారు బదులిచ్చారు. అయినప్పటికీ ఆవేదనకు గురైన రవీందర్ సీసాలో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు.
సకాలంలో జీతాలు అందక.. బ్యాంక్ ఈఎంఐ చెల్లింపు ఆలస్యం అవుతోందన్న మనస్థానంతో రవీందర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. మంగళవారం (సెప్టెంబర్ 5వ తేదీన) షాయినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 55 శాతం పైగా కాలిన గాయాలతో ఆయన తొలుత ఉస్మానియా ఆస్పత్రిలో చేరారు. ఆపై పరిస్థితి విషమించడంతో డీఆర్‌డీవో ఆస్పత్రికి తరలించారు.
వేధింపులు కూడా..
అయితే ఆయన భార్య సంధ్య మాత్రం.. సకాలంలో జీతం అందకపోవడం మాత్రమే కాదని.. అధికారుల వేధింపులు కూడా తన భర్త ఆత్మహత్యకు ప్రయత్నించడానికి కారణమని చెబుతున్నారు. జీతాలు అందకపోవడం మాత్రమే కాదు.. ఇప్పుడు తన భర్తకి మంచి చికిత్స అందించలేని స్థితిలో ఉన్నానని, హోంగార్డుల దుస్థితికి ఇది నిదర్శనమని ఆమె పేర్కొంటూ.. సీఎం కేసీఆర్ స్పందించాలంటూ కోరారామె.
మరోవైపు రవీందర్ ఆత్మహత్యాయత్నం ఘటన హోంగార్డుల్లో ఆవేశాగ్రహాలకు దారి తీసింది. విధుల బహిష్కరణతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యాచరణకు పిలుపు ఇచ్చింది హోంగార్డ్ జేఏసీ. హోంగార్డులను వెంటనే పర్మినెంట్ చేయాలంటూ హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. సకాలంలో హోంగార్డులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రవీందర్‌కు మద్దతుగా హోంగార్డులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని సంఘీభావం కూడా ప్రకటించారు. ఇంతలోనే ఆయన కన్నుమూశారు.
రాజకీయ విమర్శలు
ఇంకోవైపు రవీందర్ ఆత్మహత్యాయత్నం రాజకీయ దుమారం రేపింది. ఎమ్మెల్యే రాజాసింగ్.. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్ ప్రభుత్వమే రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, కేంద్ర మంత్రి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి రవీందర్‌ను, ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు. కనీస హక్కులను కూడా పరిరక్షించకుండా.. హోంగార్డ్ వ్యవస్థను బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవమానిస్తోందని, హామీ ఇచ్చి ఐదేళ్లైనా హోంగార్డుల ఉద్యోగ భద్రత విషయంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment