drdo apollo hospital
-
నా భర్త మృతికి కారణం వాళ్లిద్దరే: రవీందర్ భార్య
సాక్షి, హైదరాబాద్: హోంగార్డ్ రవీందర్ సూసైడ్ కేసు ఊహించని మలుపు తిరిగింది. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే అధికారుల వేధింపులూ కూడా తన భర్త మరణానికి కారణమంటూ చెబుతూ వచ్చిన రవీందర్ భార్య సంధ్య.. తాజాగా సంచలన ఆరోపణలకు దిగారు. ‘‘నా భర్తను తగలబెట్టారు. కానిస్టేబుల్‌చందు, ఏఎస్ఐ నర్సింగరావులు కలిసి నా భర్తపై పెట్రోల్ పోశారు. కానీ, ఈ ఇద్దరూ ఇప్పటివరకు అరెస్ట్ కాలేదు. హోంగార్డ్ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజీ అందుబాటులో లేదు. అది దొరికితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి’’ అని పేర్కొన్నారామె. తన భర్తను తీవ్రంగా వేధించారన్న ఆమె.. ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. "నా భర్త ఫోన్ అన్‌లాక్ చేసి మొత్తం డేటా డిలీట్ చేశారు. హమీద్ అనే అధికారి నా దగ్గరకు వచ్చి పెట్రోల్ బంక్‌లో ప్రమాదం జరిగిందని చెప్పాలన్నారు. అలా అయితేనే బెనిఫిట్స్ వస్తాయని చెప్పి.. నన్ను పక్కదారి పట్టించే యత్నం చేశారు" అని సంధ్య ఆరోపించారు. తన భర్తను చంపిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని కన్నీళ్లతో డిమాండ్ చేస్తున్నారామె. జీతం పడకపోవడంతో.. మనస్తాపానికి గురైన రవీందర్.. మంగళవారం సాయంత్రం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. తీవ్ర గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవీందర్ మృతి చెందారు. రవీందర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు పోలీసులు. ఈ క్రమంలో రవీందర్ భార్య కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె సంతకం చేస్తేనే మృతదేహానికి పోస్ట్‌మార్టం చేస్తారు వైద్యులు. దీంతో ఉస్మానియా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఆమె ఆరోపణలపై పోలీస్ శాఖ స్పందించాల్సి ఉంది. -
హోంగార్డ్ రవీందర్ మృతి
-
హైదరాబాద్: హోంగార్డ్ రవీందర్ కన్నుమూత
సాక్షి,హైదరాబాద్: టైంకి జీతం పడలేదని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హోంగార్డు రవీందర్ మృతి చెందారు. చికిత్స పొందుతూ ఇవాళ(శుక్రవారం) ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్లు కంచన్‌బాగ్ డీఆర్డీవో అపోలో వైద్యులు ప్రకటించారు. నాలుగు రోజుల కిందట.. జీతాలు పడలేదనే ఆవేదనతో ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించారు. తీవ్ర గాయాలైన ఆయన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించడంతో డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తూ వచ్చారు. హోంగార్డ్ రవీందర్ మృతిపై హోంగార్డ్ జేఏసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఏం జరిగిందంటే.. పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం (సెప్టెంబర్ 5వ తేదీన) సాయంత్రం గోషామహల్‌లోని ఓ ఏటీఎంకు వెళ్లి తన బ్యాంకు ఖాతాను చూసుకోగా ఇంకా జీతం పడలేదు. వెంటనే గోషామహల్లోనే ఉన్న హోంగార్డు కమాండెంట్ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందితో తన జీతం గురించి వాకబు చేశాడు. చెక్కులు సిద్ధంగా ఉన్నాయని, ఒకట్రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జీతం డబ్బులు జమ అవుతాయని వారు బదులిచ్చారు. అయినప్పటికీ ఆవేదనకు గురైన రవీందర్ సీసాలో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. సకాలంలో జీతాలు అందక.. బ్యాంక్ ఈఎంఐ చెల్లింపు ఆలస్యం అవుతోందన్న మనస్థానంతో రవీందర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. మంగళవారం (సెప్టెంబర్ 5వ తేదీన) షాయినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 55 శాతం పైగా కాలిన గాయాలతో ఆయన తొలుత ఉస్మానియా ఆస్పత్రిలో చేరారు. ఆపై పరిస్థితి విషమించడంతో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. వేధింపులు కూడా.. అయితే ఆయన భార్య సంధ్య మాత్రం.. సకాలంలో జీతం అందకపోవడం మాత్రమే కాదని.. అధికారుల వేధింపులు కూడా తన భర్త ఆత్మహత్యకు ప్రయత్నించడానికి కారణమని చెబుతున్నారు. జీతాలు అందకపోవడం మాత్రమే కాదు.. ఇప్పుడు తన భర్తకి మంచి చికిత్స అందించలేని స్థితిలో ఉన్నానని, హోంగార్డుల దుస్థితికి ఇది నిదర్శనమని ఆమె పేర్కొంటూ.. సీఎం కేసీఆర్ స్పందించాలంటూ కోరారామె. మరోవైపు రవీందర్ ఆత్మహత్యాయత్నం ఘటన హోంగార్డుల్లో ఆవేశాగ్రహాలకు దారి తీసింది. విధుల బహిష్కరణతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యాచరణకు పిలుపు ఇచ్చింది హోంగార్డ్ జేఏసీ. హోంగార్డులను వెంటనే పర్మినెంట్ చేయాలంటూ హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. సకాలంలో హోంగార్డులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రవీందర్‌కు మద్దతుగా హోంగార్డులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని సంఘీభావం కూడా ప్రకటించారు. ఇంతలోనే ఆయన కన్నుమూశారు. రాజకీయ విమర్శలు ఇంకోవైపు రవీందర్ ఆత్మహత్యాయత్నం రాజకీయ దుమారం రేపింది. ఎమ్మెల్యే రాజాసింగ్.. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వమే రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, కేంద్ర మంత్రి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి రవీందర్‌ను, ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు. కనీస హక్కులను కూడా పరిరక్షించకుండా.. హోంగార్డ్ వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం అవమానిస్తోందని, హామీ ఇచ్చి ఐదేళ్లైనా హోంగార్డుల ఉద్యోగ భద్రత విషయంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. -
స్వాతంత్య్ర సమరయోధుడు రఘువీర్‌రావు కన్నుమూత
హైదరాబాద్: తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు సంతపురి రఘువీర్‌రావు (84) గురువారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతూ కోమా స్థితిలో డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య రమాదేవి, కుమారుడు వంశీకృష్ణ ఉన్నారు. మెదక్ జిల్లా ములుగు మండలం బండనర్సంపల్లి గ్రామానికి చెందిన రఘువీర్‌రావు హైదరాబాద్‌లోనే ఎస్ఎస్సీ చదివారు. విద్యార్థి దశలోనే అప్పటి స్వాతంత్య్ర సమరయోధుడు జయప్రకాశ్‌తో ఉద్యమంలో పాల్గొన్నారు. వినోబాభావే భూదానోద్యమంలో, 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. మర్రి చెన్నారెడ్డి, రంగారెడ్డిలతో కలసి పనిచేశారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అరెస్ట్ అయి జైలు జీవితం కూడా అనుభవించారు. స్వాతంత్య్ర సమరయోధుల కోటా కింద ప్రభుత్వం ఇచ్చిన భూమిని కూడా ఉద్యమానికి ధారాదత్తం చేశారు. ఉద్యమకారుడిగానే కాకుండా నవశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఈనాడు తదితర పత్రికలకు రఘువీర్‌రావు సంపాదక సభ్యునిగా పనిచేశారు. కొంతకాలం 'వేదమాత' పత్రికను కూడా నడిపారు. రఘువీర్ మృతి పట్ల సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో తనకు అండదండగా ఉన్నారని.. అనారోగ్యంతో ఉన్నప్పటికీ స్వయంగా సెక్రటేరియట్‌కు వచ్చి తనను ఆశీర్వదించారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. జర్నలిస్టుల ఫోరం ఏర్పాటుకు రఘువీర్రావే ప్రేరణ అని, ఆయన మృతిపట్ల తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, టీయూడబ్ల్యూజే, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేశాయి.