స్వాతంత్య్ర సమరయోధుడు రఘువీర్‌రావు కన్నుమూత
హైదరాబాద్: తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు సంతపురి రఘువీర్‌రావు (84) గురువారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతూ కోమా స్థితిలో డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య రమాదేవి, కుమారుడు వంశీకృష్ణ ఉన్నారు. మెదక్ జిల్లా ములుగు మండలం బండనర్సంపల్లి గ్రామానికి చెందిన రఘువీర్‌రావు హైదరాబాద్‌లోనే ఎస్‌ఎస్‌సీ చదివారు.
విద్యార్థి దశలోనే అప్పటి స్వాతంత్య్ర సమరయోధుడు జయప్రకాశ్‌తో ఉద్యమంలో పాల్గొన్నారు. వినోబాభావే భూదానోద్యమంలో, 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. మర్రి చెన్నారెడ్డి, రంగారెడ్డిలతో కలసి పనిచేశారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అరెస్ట్ అయి జైలు జీవితం కూడా అనుభవించారు. స్వాతంత్య్ర సమరయోధుల కోటా కింద ప్రభుత్వం ఇచ్చిన భూమిని కూడా ఉద్యమానికి ధారాదత్తం చేశారు.
ఉద్యమకారుడిగానే కాకుండా నవశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఈనాడు తదితర పత్రికలకు రఘువీర్‌రావు సంపాదక సభ్యునిగా పనిచేశారు. కొంతకాలం 'వేదమాత' పత్రికను కూడా నడిపారు. రఘువీర్ మృతి పట్ల సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావ సమయంలో తనకు అండదండగా ఉన్నారని.. అనారోగ్యంతో ఉన్నప్పటికీ స్వయంగా సెక్రటేరియట్‌కు వచ్చి తనను ఆశీర్వదించారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. జర్నలిస్టుల ఫోరం ఏర్పాటుకు రఘువీర్‌రావే ప్రేరణ అని, ఆయన మృతిపట్ల తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, టీయూడబ్ల్యూజే, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేశాయి.