బంగారు తెలంగాణలో పసిడి చోరీలా?
- రాష్ట్రంలో నేరాలు బాగా పెరిగాయి: ఎమ్మెల్సీ ప్రభాకర్
- ప్లేబాయ్ క్లబ్‌లకు అనుమతులా?:పొంగులేటి సుధాకర్‌రెడ్డి
- శాంతి భద్రతలు బాలేదని ప్రజలంటే రాజీనామా చేస్తా: నాయిని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై గురువారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష, అధికార సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. బంగారు తెలంగాణలో దొంగలు బంగారాన్నంతా దోచుకుంటున్నారని.. పోలీసులు మాత్రం సెల్ఫోన్లలో పేకాట ఆడుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నేరాలు బాగా పెరిగాయని జాతీయ క్రైమ్ రికార్డులు చెబుతున్నాయన్నారు. పొత్తి కడుపులో మాదక ద్రవ్యాలతో ఓ ఆఫ్రికన్ యువతి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడటం, సోషల్ మీడియా ఆధారంగా నగరంలో ఓ మహిళ ఐఎస్ఐఎస్ వైపు యువతను మళ్లిస్తుండటం వంటి సంఘటనలు చూస్తుంటే శాంతి భద్రతలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదనిపిస్తోందన్నారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేయాలంటున్న సర్కారు... భద్రతపై దృష్టిసారించకపోతే పెట్టుబడిదారులు హైదరాబాద్‌కు రారన్నారు. శాంతిభద్రతల సమస్య దృష్ట్యా పేకాట క్లబ్‌లను మూసేయించామని చెబుతున్న సర్కారు... మాదాపూర్‌లో ప్లేబాయ్ క్లబ్‌లకు ఎందుకు అనుమతి ఇచ్చిందో చెప్పాలని మరో సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. విపక్ష సభ్యుల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన హోంత్రి నాయిని నర్సింహారెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలు సజావుగా లేవని ప్రజలతో అనిపిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని, బాగున్నాయని ప్రజలు చెబితే రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు. దేశంలోని ముఖ్య నగరాల కంటే హైదరాబాద్‌లోనే క్రైమ్‌రేట్ తక్కువగా ఉందని నాయిని స్పష్టం చేశారు. 2013లో 513 గొలుసు దొంగతనాలు జరగ్గా 2014లో కేసులు 388కు తగ్గాయని...2015 ఆగస్టు నాటికి 206 కేసులే నమోదయ్యాయన్నారు.
కరుడు కట్టిన నేరస్తులపై పీడీ యాక్ట్ మోపుతున్నామని, నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి పోలీస్ నిఘా పెంచామన్నారు. లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు టెండరు ప్రక్రియ ప్రారంభమైందని, కమాండ్ అండ్ కంట్రోల్స్టేషన్ నిర్మాణాన్ని కూడా వేగవంతం చేస్తున్నామన్నారు. ప్రభాకర్ ‘పేకాట’ వాఖ్యలను తప్పుబట్టిన మంత్రి హరీశ్‌రావు.. నిద్రాహారాలు మాని ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని, వెంటనే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్నారు. అయితే తాను పోలీస్ కమిషనర్ చేసిన కామెంట్‌నే ప్రస్తావించానని ప్రభాకర్ సమర్థించుకున్నారు. మరోవైపు గతంలో పేకాట క్లబ్బులను నడిపిన చరిత్ర కాంగ్రెస్ ఎమ్మెల్సీలదేనన్న మంత్రి హరీశ్ వాఖ్యలపై విపక్షనేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. పేకాట క్లబ్బులను న డిపిన ఎమ్మెల్సీలు సభలో ఉంటే వారి పేర్లు చెప్పాలని, మాజీ ఎమ్మెల్సీలైనట్లయితే వారిక్కడ లేనందున ఆరోపణలు చేయడం సంస్కారం కాదని...హరీశ్‌రావు తక్షణం ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.