
త్వరలో ఖైదీలకు క్షమాభిక్ష
సాక్షి, హైదరాబాద్: యావజ్జీవశిక్ష పడిన ఖైదీల క్షమాభిక్షను త్వరలో అమలు చేస్తామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి జైళ్లశాఖ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఇటీవలే ముసాయిదా విధి విధానాలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిపారు. ప్రభుత్వ స్థాయిలో ఖైదీల విడుదలకు రివ్యూ కమిటీని ఏర్పాటు చేసి త్వరలో తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. నూతనంగా నిర్మించిన జైళ్లశాఖ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం హోంమంత్రి నాయిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణ జైళ్లశాఖను తీర్చిదిద్దామని వివరించారు. మహాపరివర్తన కార్యక్రమం ద్వారా ఖైదీలలో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. జైళ్లశాఖ కేవలం ఖైదీల భద్రతా విధులు మాత్రమే కాకుండా.. వారిని ప్రధాన మానవ వనరుగా పరిగణించి పలు సామాజిక సేవా అభివృద్ధి పథకాలు రూపొందించడం అభినందనీయమన్నారు.చంచల్‌గూడ జైలు తరలింపునకు కనీసం నాలుగేళ్ల సమయం పట్టవచ్చని పేర్కొన్నారు.
జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా: డీజీ వీకే సింగ్
జైళ్లశాఖ ఆధ్వర్యంలో శిక్ష పడిన ఖైదీలకు వివిధ రంగాలలో శిక్షణ ఇస్తున్నట్టు డెరైక్టర్ జనరల్ (డీజీ) వీకే సింగ్ తెలిపారు. శిక్ష పూర్తి చేసుకుని జైలు నుంచి బయటకు వెళ్లినవారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒకట్రెండ్ నెలల వ్యవధిలో ఉద్యోగమేళా నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం వివిధ కంపెనీలను ఆహ్వానిస్తామని తెలిపారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో ప్రభుత్వం కేటాయించిన వెయ్యి ఎకరాల్లో ఓపెన్ జైలు ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. ఖైదీలను గౌరవప్రదమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నామని, భవిష్యత్తులో జైళ్లశాఖ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. కార్యక్రమంలో జైళ్లశాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ నర్సింహ, వరంగల్ రేంజ్ డీఐజీ కె.కేశవనాయుడు, చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ సైదయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు.