హోంశాఖ జాగాయే... భూంఫట్
అధికార పార్టీ కీలకనేత బంధువు బరితెగింపు
ఒంటిమామిడిలో రూ.10 కోట్ల
విలువైన స్థలం దురాక్రమణ
అందులో రెండెకరాలు పోలీస్ స్టేషన్,
క్వార్టర్లకు గతంలో కేటాయించిన ప్రభుత్వం
అయినా అణుమాత్రం ఖాతరు లేకుండా కబ్జా
కొనుగోలు చేశామంటూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం
తుని : రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రులు అసెన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసిన కుతంత్రాన్ని చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు. స్వార్థం కోసం విలువలను పాతరేసిన అధికార పార్టీ పెద్దలను చీదరించుకుంటున్నారు. ఇంతకన్నా బరితెగింపు తుని నియోజకవర్గంలో జరిగింది. ఏదైనా అన్యాయం జరిగితే పోలీసుల్ని ఆశ్రయిస్తాం. అయితే అధికార పార్టీకి చెందిన కీలక నేత బంధువు పోలీస్ శాఖకు చెందిన విలువైన స్థలం దురాక్రమణకే సిద్ధమయ్యారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఆ స్థలం విలువ రూ.పది కోట్లు పైనే ఉంటుంది. హోం మంత్రి సొంత జిల్లాలోనే పోలీసు శాఖ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది.
మండల వ్యవస్థ మొదలయ్యాక ప్రతి మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో తొండంగి మండలం పోలీస్‌స్టేషన్‌ను 1996లో ఒంటిమామిడిలో ప్రారంభించారు. కాకినాడ నుంచి అద్దరిపేట వరకు బీచ్ రోడ్లో ఒంటి మామిడి ప్రధాన జంక్షన్. పోలీస్‌స్టేషన్, సిబ్బంది క్వార్టర్స్ కోసం రెండు ఎకరాల స్థలం కావాలని పోలీసు శాఖ అధికారులు రెవెన్యూ శాఖను కోరారు.
సర్వే నంబరు 843లో 7.32 ఎకరాల స్థలం మందబయలుగా ఉంది. ఈ సర్వే నంబర్లో పోలీస్‌స్టేషన్, క్వార్టర్ల నిర్మాణానికి రెండు ఎకరాలు కేటాయిస్తూ అప్పటి కలెక్టర్ సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దాపురం ఆర్డీవో, తొండంగి రెవెన్యూ అధికారులు సర్వే చేసి స్థలాన్ని పోలీస్ శాఖకు అప్పగించారు. పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు భవనం లేక సర్వే నంబరు 843కు ఎదురుగా ఉన్న గ్రామ చావిడినే తాత్కాలికంగా వినియోగించారు.
గ్రామ చావిడి స్థలంలోనే స్టేషన్ నిర్మాణం
గ్రామ చావిడికి సర్వే నంబరు 842లో 0-11 సెంట్లు ఉండేది. ఇందులో తాత్కాలికంగా పోలీస్‌స్టేషన్ నిర్వహించిన తర్వాత 1998 నవంబర్ 26న అప్పటి కలెక్టర్ సతీష్ చంద్ర ఉత్తర్య్వుల మేరకు ఆ స్థలాన్ని రెవెన్యూ అధికారులు పోలీస్ శాఖకు బదలాయించారు. అక్కడే పోలీస్‌స్టేషన్‌కు పక్కా భవనం నిర్మించారు.
సర్వేనంబరు 843 లో కేటాయించిన రెండు ఎకరాల స్థలంలో క్వార్టర్స్ నిర్మించక పోవడంతో ఖాళీగా ఉండేది. మూడు రోడ్లు జంక్షన్లో ఉన్న ఆ స్థలంపై అధికార పార్టీకి చెందిన కీలక నేత బంధువు కన్ను పడింది. ఏం చేసినా అడగగల వారు ఉండరన్న అధికార మదంతో మందబయలు స్థలంలో పాకలు, బడ్డీకొట్లను బలవంతంగా ఖాళీ చేయించారు.
ఇవీ రెవెన్యూ రికార్డుల్లోని వివరాలు
ఒంటి మామిడిలో 1996లో పోలీస్‌స్టేషన్‌కు స్థలం కేటాయించిన సమయంలో రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసిన వివరాల ప్రకారం సర్వే నంబరు 843లో 7.32 ఎకరాల స్థలం మందబయలుగా ఉంది. ఇందులో పోలీస్‌స్టేషన్, సిబ్బంది క్వార్టర్ల కోసం రెవెన్యూ శాఖ రెండు ఎకరాల స్థలాన్ని 1996 నవంబర్ 29న పోలీస్‌శాఖకు కేటాయించింది.
సర్వే నంబరు 843 బై 2 లో 0.89 సెంట్లు పోలీస్‌స్టేషన్‌కు, 843 బై 5 లో 1.11 ఎకరాలు పోలీసు సిబ్బంది క్వార్టర్స్ కోసం అప్పటి కలెక్టర్ కేటాయించారు. ఇదే సర్వే నంబరు 843 బై 4 లో 1.73 ఎకరాలు బీచ్ రోడ్డుకు ఇచ్చారు. మిగిలిన స్థలం మంద బయలు కింద ఖాళీగా ఉండేది.
ఏడాది క్రితమే బడ్డీ కొట్ల తొలగింపు
పోలీస్‌స్టేషన్‌కు కేటారుుంచిన స్థలం, మంద బయలు స్థలం కలిపి సుమారు ఐదు ఎకరాలు ఉంటుంది. దీని విలువ ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం రూ.పది కోట్లు ఉంటుంది. దీనిపై కన్నేసిన అధికార పార్టీ కీలకనేత బంధువు ఆ స్థలాన్ని కొనుగోలు చేశామంటూ ఏడాది క్రితమే అందులో ఉన్న పలువురిని ఖాళీ చేయించారు. అందులోనే పోలీస్‌స్టేషన్‌కు కేటారుుంచిన స్థలం ఉన్న విషయాన్ని ఎంత మాత్రం ఖాతరు చేయకుండా ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు.
బలమైన రాజకీయ నేత కావడంతో పోలీసుల సైతం నోరు మెదపలేక పోతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. దీనిని బట్టే సదరు బంధువు వెనకున్న నేతది ఏ స్థాయో అర్థం చేసుకోవచ్చు.
ఆక్రమిస్తే ఉన్నతాధికారుల దృష్టిలో పెడతా
పోలీస్‌స్టేషన్‌కు, సిబ్బంది క్వార్టర్స్‌కు ప్రభుత్వం కేటాయించిన స్థలం మా ఆధీనంలో ఉంది. ఎవరూ ఆక్రమించలేదు. అలా జరిగితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతాను.
- బి. కృష్ణమాచారి, ఎస్సై, తొండంగి
ఆక్రమణకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
హోంశాఖకు సంబంధించిన ఆస్తులకే రక్షణ కరువైతే సామాన్యుల పరిస్థితి ఏమిటి? కలెక్టర్ ఇచ్చిన స్ధలాన్ని కాపాడుకోలేని స్థితి లో పోలీసులున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి .
- దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే, తుని