Hostels Students
-
హాస్టళ్లలో స్థితిగతులు పూర్తిగా మారాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లలో ‘నాడు–నేడు’ అమలు చేసి వాటి పరిస్థితిని మార్చాలన్నది ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అన్ని హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం, మంచి పరిశుభ్రత (శానిటేషన్), చక్కటి వాతావరణంతో పాటు, విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు ఉండాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో నాడు–నేడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. హాస్టళ్లలో పూర్తి వసతులను నాడు–నేడులో కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ పిల్లలకు కూడా బెల్టులు, దుప్పట్లు, అల్మారాలు, మంచాలు, ఇతర కనీస వసతులు ఉండాలన్నారు. అదే విధంగా తప్పనిసరిగా ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండాలని పేర్కొన్నారు. చదవండి : చప్పట్లు కొట్టి అభినందించండి: మంత్రి పెద్దిరెడ్డి ఇంకా మాట్లాడుతూ..‘‘జగనన్న గోరుముద్ద’ మాదిరిగా మెనూ ఉండాలి. మన కొడుకు లేక కూతురు ఆ హాస్టల్లో ఉండి చదివితే, అక్కడ ఎలా ఉండాలని కోరుకుంటామో, ఆ విధంగా మన హాస్టళ్లను మార్చాలి. జగనన్న విద్యా కానుకను హాస్టల్ విద్యార్థులకు కూడా ఇస్తాం కాబట్టి, హాస్టళ్లలో కూడా స్థితిగతులు పూర్తిగా మారాలి. ముఖ్యంగా పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. దీనిపై మనం ఏది చెప్పినా, దాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. పిల్లలకు ఏం కావాలి? ఏం ఇస్తే బాగుంటుంది? వారికి ఏ విధంగా మంచి పౌష్టికాహారం ఇవ్వాలి? వీటన్నింటిపై పక్కాగా ప్లాన్ చేయాలి. వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలి’ అని అధికారులను ఆదేశించారు. చదవండి : సచివాలయ వ్యవస్థతో గడప వద్దకే సేవలు ఇక రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖలకు సంబంధించి బాలురు, బాలికల కోసం మొత్తం 4772 హాస్టళ్లు ఉండగా, వాటిలో 4,84,862 మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారని సమావేశంలో అధికారులు వెల్లడించారు. మొత్తం హాస్టళ్లలో దాదాపు 4 వేలు సొంత భవనాల్లో ఉన్నాయని వారు తెలిపారు. నాడు–నేడు రెండో దశ కార్యక్రమంలో ఆ హాస్టళ్లలో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్‌తో పాటు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
చలించే వారేరి!
దుప్పట్లు లేక చలికి వణుకుతున్న వసతి గృహాల విద్యార్థులు సాక్షి, నెట్వర్క్: ఎప్పట్లాగే చలికాలం వచ్చేసింది. అంతే సహజంగా విద్యార్థులనూ కష్టాలు చుట్టుముట్టాయి. వివిధ హాస్టళ్లలోని పిల్లలు చలికి గజగజ వణిపోతున్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో దుప్పట్లు పంపిణీ చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలోని విద్యార్థులు రాత్రిపూట చలికి విలవిల్లాడుతున్నారు. దుప్పట్ల లేమికి తోడు హాస్టళ్లకు తలుపులు, కిటికీలు లేకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. కొందరు విద్యార్థులు ఇంటి నుంచి దుప్పట్లు తెచ్చుకుంటే.. వాటినే ఇద్దరు ముగ్గురు కలిపి కప్పుకుంటున్నారు. చాలా వసతి గృహాల్లో మంచాలు లేకపోవడంతో నాప బండలపైనే పడుకోవాల్సిన దుస్థితి. దీనికి తోడు మౌలిక వసతుల లేమి విద్యార్థులను మరింత ఇబ్బంది పెడుతోంది. హాస్టళ్ల పరిసరాల్లో పెరిగిన పిచ్చిమొక్కలు, మురుగుతో దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో తరచూ విద్యార్థులు జ్వరాల బారిన పడుతున్నారు. అద్దె భవనాలే దిక్కు.. చాలా ప్రాంతాల్లో హాస్టళ్లు అద్దె భవనాల్లోనే. దీంతో ఇరుకు గదుల్లో విద్యార్థులను కుక్కేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కూలే స్థితిలో ఉన్న భవనాల్లో విద్యార్థులున్నారు. పలుచోట్ల భవన నిర్మాణాలు అరకొరగా నిర్మించి విద్యార్థులను ఉంచుతున్నారు. మంచినీరు, మరుగుదొడ్డి వంటి కనీస అవసరాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థుల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఒకట్రెండు టాయిలెట్లే... హాస్టల్ విద్యార్థులు అధికంగా ఇబ్బంది పడుతోంది టాయిలెట్ల సమస్యే. వందల మంది విద్యార్థులున్న హాస్టళ్లలోనూ ఒకట్రెండు టాయిలెట్లే ఉన్నాయి. సరైన నీటి వసతి లేక కొన్నిచోట్ల నిరుపయోగంగా మారాయి. బహిర్భూమికి బాలురు నీళ్లు తీసుకుని వెళ్తున్నారు. ఒకే గదిలో 25 మంది... నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ–ఏ హాస్టల్లో 170 విద్యార్థులున్నారు. అంతమందికి ఉన్న గదులు.. కేవలం ఏడు! వాటిలో ఒకటి రేకుల షెడ్డు. మిగిలిన ఆరింటిలోనే విద్యార్థులు సర్దుకుపోతున్నారు. ఒక్కో గదిలో ఇరుకిరుకుగా 25 మంది ఉంటున్నారు. ఉన్న గదుల్లో రెండింటికి తలుపులు పగిలిపోయాయి. ఐదు కిటికీలకూ డోర్లు లేవు. రాత్రిపూట చలికి తాళలేక కిటికీలకు దుప్పట్లు అడ్డంపెట్టుకొని నిద్రపోతున్నారు. ఆ 170 మందికి మరుగుదొడ్లు మూడు. స్నానపు గదులు నాలుగు. దీంతో పిల్లలు ఆరుబయటే అవసరాలు తీర్చుకుంటున్నారు. 248 మందిలో 60 మందికే బెడ్షీట్లు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని ఎస్టీ బాలుర వసతి గృహంలో 248 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది హాస్టల్‌కు 60 బెడ్ షీట్లు, దుప్పట్లను పంపిణీ చేశారు. దుప్పట్లు మందం లేకపోవడంతో విద్యార్థులు చలికి వణుకుతున్నారు. కొందరు విద్యార్థులు ఇంటి నుంచి రగ్గులు, దుప్పట్లు తెచ్చుకున్నారు. జహీరాబాద్‌లోనే బాగారెడ్డిపల్లి బీసీ(ఏ) బాలుర వసతి గృహంలో 215 మంది పాఠశాల, కళాశాల విద్యార్థులు ఉంటున్నారు. ఈ హాస్టల్ ఆవరణలో మురుగు పేరుకుపోవడంతో పారిశుద్ధ్య సమ స్య నెలకొంది. సమీపంలోనే ఉన్న ఎస్సీ(ఏ) హాస్టల్లో మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. మెదక్‌లోని ఎస్టీ హాస్టల్లో 114మంది విద్యార్థులుంటున్నారు. అందులో 74 మందికి దుప్పట్లు ఇవ్వగా.. మరో 70మందికి ఇవ్వలేదు. రేగోడు బీసీ బాలుర వసతి గృహంలో 45 మంది విద్యార్థులుండగా.. 20 మందికి మాత్రమే దుప్పట్లు ఇచ్చారు. మరో 25 మంది విద్యార్థులకు నేటికీ అందించలేదు. రాత్రి ఇంటికి.. ఉదయం హాస్టల్‌కు.. 45 మంది ఉన్న సూర్యాపేట జిల్లా నాగారంలోని ఎస్సీ బాలుర వసతి గృహం దుస్థితి ఇది. అద్దె భవనంలో కొనసాగుతున్న ఈ హాస్టల్ శిథిలావస్థకు చేరింది. భవనం పైకప్పు పెచ్చులూడి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంతవరకూ ఇక్కడ రెగ్యులర్ వార్డెన్‌ను నియమించలేదు. హాస్టల్లో మరుగుదొడ్లు, మౌలిక వసతులు లేవు. దీంతో విద్యార్థులు రాత్రి సమయంలో ఇళ్లకు వెళ్లి, ఉదయం తిరిగి వసతిగృహానికి వస్తున్నారు. ► భువనగిరిలోని బంజారాహిల్స్ రైల్వేట్రాక్ వద్ద ఉన్న ఎస్టీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు చలికి గజగజ వణుకుతున్నారు. ఈ హాస్టల్లో మొత్తం 108 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి జూన్‌లో ఒక బెడ్ షీట్, కప్పుకునేందుకు ఒక దుప్పటి ఇచ్చారు. ఇవి పలచగా ఉండడంతో చలిని ఆపలేకపోతున్నాయి. దీంతో ఇంటి వద్ద నుంచి దుప్పట్లు తెచ్చుకుని కప్పుకుంటున్నారు. ఒక్క దుప్పటి ఇద్దరు విద్యార్థులు కప్పుకుంటున్నారు. అలాగే రెండు నెలల నుంచి సబ్బులు, కాస్మొటిక్ చార్జీలు ఇవ్వలేదు. పాలిథిన్ కవర్లే దిక్కు వికారాబాద్ జిల్లా ధారూరు మండలం బీసీ బాలుర వసతి గృహంలో 140 మంది బాలురు ఉంటున్నారు. వసతి గృహంలో కొత్తగా చేరిన విద్యార్థుల్లో 15 మందికి దుప్పట్లు, బెడ్షీట్లు ఇవ్వలేదు. దీంతో వారు ఇళ్ల నుంచి తెచ్చుకున్న దుప్పట్లను ఇద్దరు కలిసి కప్పుకొంటున్నారు. కింద పరుచుకునేందుకు ఎలాంటి బెడ్షీట్లు లేకపోవడంతో పాలిథిన్ కవర్లు వేసుకుంటున్నారు. స్నానపు గదులకు తలుపులు లేవు. ఎనిమిది మరుగుదొడ్లు ఉన్నా.. వాటిలో మూడు మాత్రమే వాడుకలో ఉన్నాయి. మిగిలిన ఐదింటిలో నీటి సరఫరా లేక విద్యార్థులు బహిర్భూమికి ఆరుబయటకు వెళుతున్నారు. వసతిగృహంలో నిత్యం పందుల సంచారం కొనసాగుతోంది. చినిగిన చాపలు.. ఇంటికాడి చెద్దర్లు! రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి మంజూ రైన సాంఘిక సం క్షేమ గురుకుల వి ద్యాలయం మం డలంలోని విలాసాగర్లో ఉన్న పాత ఎస్సీ హాస్టల్లో కొనసాగుతోంది. ఈ హాస్ట ల్ భవనం పురాతనమైనది కావడంతో విద్యార్థులు ఇబ్బం దులు పడుతున్నారు. ఇందులో 160 మంది విద్యార్థులున్నారు. వీరికి నేలపై వేసుకోవడానికి బెడ్షీట్లు లేకపోవడంతో ఇంటి వద్దనుంచి తెచ్చుకున్న చినిగిన చాపల్లో పడుకుంటున్నారు. ఇప్పటికీ స్కూల్ యూనిఫాం, షూస్ తదితర వస్తువులు రాలేదని విద్యార్థులు చెబుతున్నారు. ► పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని బీసీ బాలుర హాస్టల్లో 70 మంది ఉన్నారు. ఇందులో 32 మందికి దుప్పట్లు లేవు. తోటి విద్యార్థుల దుప్పట్లతో కాలం వెళ్లదీస్తున్నారు. మిగతా 38 మంది విద్యార్థులకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో దుప్పట్లు అందించారు. ప్రభుత్వం నుంచి ఇంత వరకు పంపిణీ చేయలేదు. కొన్ని గదులకు కిటికీలు, తలుపులు లేకపోవడంతో చలికి తట్టుకోలేకపోతున్నారు. తలుపులు లేని గదులు.. కిటికీలు ఖమ్మం జిల్లా పెనుబల్లిలోని బీసీ బాలుర వసతిగృహం ఇది. 84మంది విద్యార్థులు 5 చిన్న గదుల్లో ఉంటున్నారు. గదులకు తలుపులు, కిటికీలకు రెక్కలు లేవు. విద్యార్థులు చలికి వణకుతున్నారు. ఎర్రుపాలెంలోని ఎస్సీ హాస్టల్లో ఇంతవరకు రగ్గులు పంపిణీ చేయలేదు. యూనిఫాం కూ డా పంపిణీ చేయలేదు. చలిలో చన్నీటి స్నానం వనపర్తి జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్లో బాత్రూంలు లేక విద్యార్థులు.. ఆరుబయటే వణికించే చలిలో చన్నీళ్ల స్నానం చేస్తున్నారు. హాస్టల్లో వసతులు లేకపోవడంతో తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి, రోడ్డు పక్కన ఉన్న బోరు వద్దకు వెళ్లి స్నానాలు చేస్తున్నారు.ఇందులో 120 మంది విద్యార్థులున్నారు. నీటి వసతి లేదు. ఒక్క నల్లా కనెక్షన్ ఉన్నా వారంలో ఒ క్కరోజే నీరు వస్తుంది. అవి తాగడానికి కూడా సరిపోవు. విద్యార్థులు స్నానాలు చేయాలంటే తెల్లవారుజామునే నిద్రలేచి సమీపంలో రోడ్డు పక్కనున్న చేతిపంపు వద్దకు వెళ్లాలి. ఒకటికి, రెంటికి వెళ్లాలంటే చెట్ల పొదలను వెతుక్కోవాల్సిందే. కొన్నేళ్లుగా ఈ సమస్య పట్టించుకొనే వారే లేరు.