సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లలో ‘నాడు–నేడు’ అమలు చేసి వాటి పరిస్థితిని మార్చాలన్నది ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అన్ని హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం, మంచి పరిశుభ్రత (శానిటేషన్), చక్కటి వాతావరణంతో పాటు, విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు ఉండాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో నాడు–నేడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. హాస్టళ్లలో పూర్తి వసతులను నాడు–నేడులో కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ పిల్లలకు కూడా బెల్టులు, దుప్పట్లు, అల్మారాలు, మంచాలు, ఇతర కనీస వసతులు ఉండాలన్నారు. అదే విధంగా తప్పనిసరిగా ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండాలని పేర్కొన్నారు. చదవండి : చప్పట్లు కొట్టి అభినందించండి: మంత్రి పెద్దిరెడ్డి
ఇంకా మాట్లాడుతూ..‘‘జగనన్న గోరుముద్ద’ మాదిరిగా మెనూ ఉండాలి. మన కొడుకు లేక కూతురు ఆ హాస్టల్‌లో ఉండి చదివితే, అక్కడ ఎలా ఉండాలని కోరుకుంటామో, ఆ విధంగా మన హాస్టళ్లను మార్చాలి. జగనన్న విద్యా కానుకను హాస్టల్ విద్యార్థులకు కూడా ఇస్తాం కాబట్టి, హాస్టళ్లలో కూడా స్థితిగతులు పూర్తిగా మారాలి. ముఖ్యంగా పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. దీనిపై మనం ఏది చెప్పినా, దాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. పిల్లలకు ఏం కావాలి? ఏం ఇస్తే బాగుంటుంది? వారికి ఏ విధంగా మంచి పౌష్టికాహారం ఇవ్వాలి? వీటన్నింటిపై పక్కాగా ప్లాన్ చేయాలి. వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలి’ అని అధికారులను ఆదేశించారు. చదవండి : సచివాలయ వ్యవస్థతో గడప వద్దకే సేవలు
ఇక రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖలకు సంబంధించి బాలురు, బాలికల కోసం మొత్తం 4772 హాస్టళ్లు ఉండగా, వాటిలో 4,84,862 మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారని సమావేశంలో అధికారులు వెల్లడించారు. మొత్తం హాస్టళ్లలో దాదాపు 4 వేలు సొంత భవనాల్లో ఉన్నాయని వారు తెలిపారు. నాడు–నేడు రెండో దశ కార్యక్రమంలో ఆ హాస్టళ్లలో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్‌తో పాటు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment