hotel ilapuram
-
కామన్ సివిల్ కోడ్‌ను అంగీకరించేది లేదు
విజయవాడ (గాంధీనగర్) : కామన్ సివిల్ కోడ్‌తో దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మునీర్ అహ్మద్, జమాతే ఇస్లాం హింద్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రఫీఖ్ పేర్కొన్నారు. ఐలాపురం హోటల్లో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ దేశంలోని ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు అందరూ సమానమేనన్నారు. రాజ్యాంగం ఈ విషయాన్నే స్పష్టం చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్న చట్టాలను వదిలివేసి ఎవరూ కోరని ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలనుకోవడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. కామన్ సివిల్ కోడ్‌ను అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ మతస్వేచ్ఛ ఉందని, దాన్ని హరించే నిర్ణయాలు చేయొద్దని హితవు పలికారు. ముస్లింలు షరియత్ చట్టంపై సంతృప్తిగా ఉన్నారని, దీనిపై ఎటువంటి అపోహలు అక్కర్లేదన్నారు. గడచిన రెండున్నరేళ్ల కాలంగా మతతత్వశక్తుల దాడులు పెరిగిపోయాయన్నారు. సమావేశంలో జమాతే ఇస్లాం హింద్ ప్రెసిడెంట్ అక్బర్, అహెలె హదీస్ అధ్యక్షుడు సయీద్, అతికుర్ రహ్మాన్, వివిధ ముస్లిం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘సావిత్రి ఒక దీపం’ షూటింగ్ ప్రారంభం
విజయవాడ (గాంధీనగర్) : సావిత్రి కళాపీఠం వ్యవస్థాపకురాలు పరుచూరి విజయలక్ష్మి, గౌరవాధ్యక్షుడు ప్రభల శ్రీనివాస్ నిర్మాతలుగా ‘సావిత్రి ఒక దీపం’ పేరుతో నిర్మిస్తున్న లఘుచిత్రం షూటింగ్ ఆదివారం ప్రారంభమైంది. హోటల్ ఐలాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీనటి వాణిశ్రీ పూజ చేసి అనంతరం క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథానాయికగా సావిత్ర ఎంతో ఎత్తుకు ఎదిగారని కొనియాడారు. సావిత్రిలోని సేవాభావాన్ని లఘుచిత్రం ద్వారా నేటితరం నటీనటులకు తెలియజెప్పేందుకు కళాపీఠం చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. సావిత్రి తన జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, అందుకు తానే ప్రత్యక్ష సాక్షినని వాణిశ్రీ తెలిపారు. నిర్మాతలు పరుచూరి విజయలక్ష్మి, ప్రభల శ్రీనివాస్ మాట్లాడుతూ సావిత్రి కీర్తిప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసేందుకు ఈ లఘుచిత్రం నిర్మిస్తున్నట్లు చెప్పారు. మాస్టర్ శ్రీనాగ్‌హితేన్ సమర్పణలో కె.మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక, శ్రీవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని తెలిపారు. సావిత్రి కళాపీఠం కార్యదర్శి తోట కృష్ణకిషోర్, కొత్తా జ్యోతి, ఐలాపురం శ్రీదేవి, దారా కరుణశ్రీ, పైడిపాటి వెంకన్న, కోట ఆంజనేయశాస్త్రి, సురేష్, చందన పాల్గొన్నారు.