కామన్ సివిల్ కోడ్‌ను అంగీకరించేది లేదు
విజయవాడ (గాంధీనగర్) : కామన్ సివిల్ కోడ్‌తో దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మునీర్ అహ్మద్, జమాతే ఇస్లాం హింద్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రఫీఖ్ పేర్కొన్నారు. ఐలాపురం హోటల్‌లో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ దేశంలోని ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు అందరూ సమానమేనన్నారు. రాజ్యాంగం ఈ విషయాన్నే స్పష్టం చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్న చట్టాలను వదిలివేసి ఎవరూ కోరని ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలనుకోవడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. కామన్ సివిల్ కోడ్‌ను అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ మతస్వేచ్ఛ ఉందని, దాన్ని హరించే నిర్ణయాలు చేయొద్దని హితవు పలికారు. ముస్లింలు షరియత్ చట్టంపై సంతృప్తిగా ఉన్నారని, దీనిపై ఎటువంటి అపోహలు అక్కర్లేదన్నారు. గడచిన రెండున్నరేళ్ల కాలంగా మతతత్వశక్తుల దాడులు పెరిగిపోయాయన్నారు. సమావేశంలో జమాతే ఇస్లాం హింద్ ప్రెసిడెంట్ అక్బర్, అహెలె హదీస్ అధ్యక్షుడు సయీద్, అతికుర్ రహ్మాన్, వివిధ ముస్లిం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.