అంతరించిపోతున్న విలువలు
జస్టిస్ చంద్రకుమార్
నాంపల్లి: నేటి సమాజంలో మానవీయ విలువలు అంతరించి పోతున్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రచయిత డాక్టర్ ప్రసాదమూర్తి రచించిన నాల్గవ కవితా సంపుటి ‘‘పూలండోయ్ పూలు’’ పుస్తకావిష్కరణ సభ శుక్రవారం రాత్రి నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరంలో జరిగింది.
కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి అధ్యక్షతన జరిగిన సభకు జస్టిస్ బి.చంద్రకుమార్ ముఖ్యఅతిథి గా హాజరయ్యారు. విలువలు పతనమైపోతున్న తరుణంలో స్పందించే మనుషులు అవసరమన్నారు. క్రాసింగ్‌ల వద్ద చిన్న రైల్వేగేటును ఏర్పాటు చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఆందోళన వ్యక్తంచేశారు. స్వాతంత్య్రం వచ్చి 62 ఏళ్లు గడిచినా ఇలాంటి చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకోలేకపోవడం సిగ్గుచేటన్నారు.
భోలక్‌పూర్ ప్రాంతంలోని పలు పరిశ్రమల్లో పెద్ద ఎత్తున బాలకార్మికులు పనిచేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళ వ్యక్తం చేశారు. నేటి యువతరంలో స్ఫూర్తిని నింపే కవిత్వాలను రాయాలని ఆయన సూచించారు. తొలి ప్రతిని భారత్ వికాస్ ఫౌండేషన్ చైర్మన్ సామంతపూడి బాలకృష్ట్టంరాజు స్వీకరించారు. ప్రముఖ కవి సీతారం పుస్తక సమీక్షా చేశారు. ప్రజా కవి గోరటి వెంకన్న, ప్రముఖసినీ నటుడు ఎం.ఎస్.నారాయణ, కవి ఆచార్య సిఖామణి,నేటి నిజం ఎడిటర్ బి.దేవదాసు, 10టీవీ సీఈవో అరుణ్‌సాగర్, కవి ఖాదర్మోయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.