నియంత్రణేది?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో రాష్ట్రంలోని డీమ్డ్ యూనివర్శిటీలు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆ యూనివర్శిటీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌లతో పాటు పీజీ కోర్సులకు ఇప్పటి వరకు ప్రభుత్వ కోటాను కేటాయించక పోవడం ఇందుకు అద్దం పడుతోంది. ప్రభుత్వం, డీమ్డ్ యూనివర్శిటీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతి కళాశాలలోని 25 శాతం సీట్లను సీఈటీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరంలో ఒక్క యూనివర్శిటీ కూడా ఆ ఒప్పందాన్ని గౌరవించ లేదని వైద్య విద్యాశాఖ చెబుతోంది.
మణిపాల్‌లోని కస్తూర్బా వైద్య కళాశాలలో మొత్తం 250 సీట్లకు గాను 63 మందికి స్థానం కల్పించాల్సి ఉండగా 28 మందికి మాత్రమే ప్రభుత్వ కోటా కింద అవకాశం కల్పించారు. బీడీఎస్‌లో ఒక్కరికీ సీటు ఇవ్వక పోవడంతో పాటు పీజీ కోర్సులో 42 మందికి గాను కేవలం 14 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. మైసూరులోని జేఎస్ఎస్ వైద్య కళాశాల సైతం 50 మందికి గాను 12 మందికి మాత్రమే అవకాశం కల్పించింది. పీజీ కోర్సుల్లో ఎవరికీ సీటు దక్కలేదు. బీజాపురలోని బీఎం.పాటిల్ వైద్య కళాశాల ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో ఒక్కరంటే ఒక్కరికీ అవకాశం కల్పించ లేదు.
ప్రైవేట్ వైద్య కళాశాలలు ఎంబీబీఎస్ సీట్లను రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షలకు, పీజీ సీట్లను రూ.3 కోట్లు చొప్పున విక్రయిస్తున్న సంగతి బహిరంగ రహస్యమే. ఈ విద్యా సంవత్సరంలో కేటాయించని సీట్లను వచ్చే ఏడాది సీట్లతో కలుపుకొని ఇవ్వాల్సిందిగా వైద్య విద్యా శాఖ అన్ని యూనివర్శిటీలను ఆదేశించింది. పీజీ కోర్సులకు మార్చిలో, ఎంబీబీఎస్ సీట్లకు మే నెలలో కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.
నియంత్రణకు చట్టాన్ని రూపొందించండి
డీమ్డ్ విశ్వ విద్యాలయాలు సొంత సామాజ్య్రాలను నిర్మించుకున్నట్లుగా వ్యవహరిస్తున్న తీరును నివారించడానికి ఓ చట్టాన్ని తీసుకు రావాల్సిందిగా స్పీకర్ కాగోడు తిమ్మప్ప ప్రభుత్వానికి సూచించిన అరుదైన సంఘటన గురువారం శాసన సభలో చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాశ్ పాటిల్ సమాధానమిస్తూ, డీమ్డ్ యూనివర్శిటీలపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని తెలిపారు.
మణిపాల్, కేఈఎల్ యూనివర్శిటీలు సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో వంద శాతం ఫలితాలను సాధిస్తున్నాయని చెప్పారు. భారతీయ వైద్య మండలి, డీమ్డ్ యూనివర్శిటీల నిర్వహణను పరిశీలిస్తుంటుందని చెబుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయజాలదని నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ దశలో స్పీకర్ జోక్యం చేసుకుని వాటిని నియంత్రించడానికి చర్యలు తీసుకోదలిస్తే, సభ అండగా నిలుస్తుందని మంత్రికి భరోసా ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం పరిశీలిస్తుందని తదుపరి మంత్రి చెప్పారు.