టాటా గ్రూప్‌లో మరో సంచలనం!
మిస్త్రీ ఉద్వాసనతో కార్పొరేట్ రంగాన్ని ఓ కుదుపు కుదిపిన టాటా గ్రూప్‌లో మరో సంచలనం చోటుచేసుకుంది. టాటా గ్రూప్స్ చీఫ్ ఆఫ్ హ్యుమన్ రిసోర్సస్(సీఓహెచ్ఆర్) ఎన్ఎస్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం రాజీనామా పేపర్లను గ్రూప్‌కు సమర్పించారు. గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీ తొలగించిన నాలుగు రోజుల్లోనే రాజన్ ఈ గ్రూప్ నుంచి వైదొలిగారు. అదేవిధంగా రాజన్ కలిగి ఉన్న గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా రద్దైంది. కొత్త సీహెచ్ఆర్ఓను త్వరలోనే గ్రూప్ నియమించనుంది. రాజన్‌ను హెచ్ఆర్ అధినేతగా మిస్త్రీనే నియమించారు. మిస్త్రీని అర్థంతరంగా చైర్మన్ పదవిని నుంచి గెంటేయడంతో, రాజన్ ఎగ్జిట్ ఆలోచనలు ప్రారంభమయ్యాయని రిపోర్టులు తెలిపాయి.
రాజన్ పోస్టును కంపెనీ త్వరలోనే భర్తీచేస్తుందని, గ్రూప్ కంపెనీల హెచ్ఆర్ ప్రక్రియలపై అతను రాజీనామా ప్రభావం ఉండదని రిపోర్టు తెలుపుతున్నాయి.. సొంత హ్యుమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్స్, హెడ్స్‌ను గ్రూప్ కలిగి ఉందని పేర్కొంటున్నాయి. జీఈసీ ఉపసంహరణతోనే రాజన్ గ్రూప్ నుంచి వైదొలిగినట్టు తెలుస్తోంది. 2013లో టాటా గ్రూప్ సీహెచ్ఆర్ఓగా రాజన్ జాయిన్ అయ్యారు. రాంబాక్సీ, ఏషియన్ పేయింట్స్, బ్లౌప్లాస్ట్, ఏబీసీ కన్సల్టెంట్స్, ఏషియా ఆన్లైన్ వంటి కంపెనీల్లో మూడు దశాబ్దాలుగా పైగా పనిచేసిన అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నారు. చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని తొలగిస్తూ బోర్డు సోమవారం తీసుకున్న అనూహ్య పరిణామాలతో టాటా గ్రూప్ పరువు ఓ వైపు వీధికెక్కగా.. గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 55 కోట్లకు పైగా హరించుకుపోయింది.