గీత దాటితే..ఇంటికే ఈ చలానా
ట్రాఫిక్ ఉల్లంఘనులపై పోలీసుల ప్రత్యేక దృష్టి
అమలులోకి ఈ చలానా విధానం
రెండున్నర నెలల వ్యవధిలో 10,077 కేసులు
నెల్లూరు(క్రైమ్): ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారు భారీ జరిమానాలు చెల్లించకతప్పని పరిస్థితి నెలకొంది. నెల్లూరుతో పాటు ప్రధాన పట్టణాల్లో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎస్పీ విశాల్‌గున్నీ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మెట్రో సిటీలకే పరిమితమైన ఈ చలానా విధానాన్ని తొలిసారిగా మే 6వ తేదీన నెల్లూరులో, జూన్ ఒకటిన కావలి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట అమలులోకి తెచ్చారు. నగర, పట్టణాల్లోని ప్రధాన కూడళల్లో శాంతిభద్రతల అధికారులు, ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది, ప్రత్యేక బృందం సభ్యులు పర్యటిస్తూ ఉల్లంఘనను ట్యాబ్(మల్టీపర్పస్ డివైజ్)లు, డిజిటల్ కెమెరాల్లో చిత్రీకరించి రెండు విభాగాల్లో ఈ–చలానా ద్వారా వాహనచోదకులకు జరిమానాలు విధిస్తున్నారు.
భారీగా జరిమానాలు
ఈచలానాతో వాహనదారుడు భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తోంది. గతంలో నోపార్కింగ్, పొల్యూషన్, సెల్‌ఫోను డ్రె వింగ్, రిజిస్ట్రేషన్ లేని, ఇన్సూరెన్స్లేని వారికి రూ. 100 నుంచి రూ. 500లోపు ఫైన్ విధించేవారు. ఇప్పుడు ఆపరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం నిర్దేశించిన జరిమానాలు విధిగా మీసేవ కేంద్రాల్లో చెల్లిస్తున్నారు. నోపార్కింగ్కు రూ.100, ఇన్సూరెన్స్‌కు రూ. 1,000, రిజిస్ట్రేషన్ లేకపోతే రూ. 2వేల నుంచి రూ.5వేల వరకు, సెల్‌ఫోను డ్రైవింగ్‌కు రూ. వెయ్యి జరిమానా చెల్లించాల్సి వస్తోంది. జరిమానాలతో పాటూ యూజర్ ఛార్జీలను సైతం వాహనదారుడే చెల్లించాలి. కొందరు వాహనదారులకు తనిఖీల సమయంలోనే ఈచలానా బిల్లు చేతికి ఇస్తుండగా, డిజిటల్ కెమెరాల్లో పట్టుబడిన వారికి ఇళ్లకు ఈ చలానా పంపుతున్నారు.
భారీగా కేసుల నమోదు
ఈ చలానా విధానం అమలులోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 10,077కేసులు నమోదయ్యాయి. అందులో ట్యాబ్(మల్టీపర్పస్ డివైజ్)ల ద్వారా 6,887, కెమెరాల ద్వారా 3,189 కేసులను నమోదు చేసి రూ 42,75,200 జరిమానా విధించారు.
చల్లానా ఉల్లంఘునులపైనా చర్యలు
జిల్లాలో ఇప్పటి వరకు 10,077కేసులు నమోదు కాగా అందులో 3,9098 కేసుల్లో వాహనదారులు మీసేవ కేంద్రాల్లో జరిమానా చెల్లించారు. 6,618 కేసుల్లో చలానాలు చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. చలానాలు కట్టకపోతే ఏమి కాదన్న భ్రమలో వాహనదారులు ఉన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకొనేందుకు పోలీసు అధికారులు సిద్ధమయ్యారు. వాహన తనిఖీల సమయంలో రిజిస్ట్రేషన్ నంబర్‌ను ట్యాబ్‌లో కొట్టిచూస్తే ఎన్ని చలానాలు చెల్లించాల్సి ఉందో తెలుస్తోందనీ, మూడు చలానాలు చెల్లించకపోతే వాహనదారునిపై కేసు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పించుకు తిరగడం మాని చలానాలు చెల్లిస్తేనే మంచిదని అధికారులు పేర్కొంటున్నారు.
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన......
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై ఈచలానా విధించడంతోనే అధికారులు సరిపెట్టుకోవడం లేదు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, ఈచలానాపై అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. నిబంధనలు పక్కాగా పాటించాలని హెచ్చరిస్తున్నారు.