విద్యార్హతలేని వారికీ ఆటో డ్రైవింగ్ లైసెన్స్‌లు
- ప్రత్యేక డ్రైవ్‌కు విశేష స్పందన
- దళారులను ఆశ్రయించవద్దు.. డీటీసీ సుందరవద్దీ
- ఆటో కార్మికుల హర్షం
అనంతపురం సెంట్రల్ : విద్యార్హతలేకపోవడంతో డ్రైవింగ్ లైసెన్స్‌నలు పొందలేక ఆటోలు నడుపుతూ అటు పోలీసులు, ఇటు రవాణా అధికారులతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న డ్రైవర్లకు జిల్లా ఆర్టీఏ అధికారులు స్పందించి వారి సమస్యను పరిష్కరించారు. విద్యార్హతలేకపోయిన వారికి వివిధ పరీక్షల నిర్వహించి లైసెన్స్‌లు మంజూరు చేసేందుకు శని, ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దీనిపై ఆటో కార్మికుల నుంచి విశేష స్పందన లభించింది. అధికారులే దగ్గర ఉండి దరఖాస్తులు పూరించడంతోపాటు, వారికి వైద్య పరీక్షలు కూడా చేయించారు. అర్హులకు లైసెన్సులను మంజూరు చేశారు. ఈ క్రమంలో రెండు రోజుల్లో దాదాపు జిల్లా వ్యాప్తంగా 436 మంది ఆటో డ్రైవర్లు ఎల్‌ఎల్‌ఆర్‌లు (లర్నర్స్ లైసెన్స్ రూల్) పొందారు. ఇందులో ఆరుగురు మహిళా డ్రైవర్లు కూడా ఉండడం విశేషం.
ఈ సందర్బంగా డీటీసీ సుందర్‌వద్దీ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రాన్స్‌పోర్టు డ్రైవింగ్ లెసెన్స్ పొందేందుకు ముఖ్య అడ్డంకిగా మారిన విద్యార్హత, ఫిట్నెస్ సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించి ఎల్ఎల్ఆర్ మంజూరు చేస్తున్నట్లు వివరించారు.
జిల్లాలో ప్రతి ఆటో డ్రైవర్ లెసెన్స్ కలిగి ఉండడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే శని, ఆదివారాల్లో కూడా కొనసాగిస్తామన్నారు. భవిష్యత్‌లో డివిజన్‌స్థాయి ఆర్టీఓ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. ఎల్‌ఎల్‌ఆర్‌లు పొందినవారు నెలరోజుల తర్వాత నేరుగా వచ్చి పూర్తిస్థాయి డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందవచ్చునని, దళారీలను ఆశ్రయించాల్సిన అవసరం లేదన్నారు. ఆర్టీఏ శ్రీధర్, ఎంవీఐలు రమేష్, మధుసూదన్, కరుణాసాగర్, ఏఎంవీఐలు తిమ్మరసునాయుడు, రవిశంకర్, దీపిక, రాణి తదితరులు పాల్గొన్నారు.