పతుల పెత్తనం
దిష్టిబొమ్మల్లా మారుతున్న మహిళా ప్రజాప్రతినిధులు
మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ల రగడ
కమీషన్లు అందలేదని రెండు అభివృద్ధి పనుల తీర్మానాల వాయిదా
కళ్యాణదుర్గం : మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించినా పెత్తనం మాత్రం వారి భర్తలే చెలాయిస్తున్నారు. మహిళా ప్రజాప్రతినిధులు మాత్రం దిష్టిబొమ్మల్లా మిగిలిపోతున్నారు. కళ్యాణదుర్గం మునిసిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం చైర్పర్సన్ బి.కె.రామలక్ష్మి అధ్యక్షతన జరిగింది. అధికార తెలుగుదేశం పార్టీ మహిళా ప్రజాప్రతినిధులతో పాటు వారి పతులు కూడా హాజరై దర్జాగా సీట్లల్లో ఆశీనులయ్యారు. అజెండా చదివి వినిపించిన తర్వాత కౌన్సిలర్ తిమ్మరాజు లేచి పాలన గాడి తప్పిందని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇందుకు చైర్పర్సన్ భర్త బి.కె.గోవిందప్ప జరిగిన అభివృద్ధి పనులు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో రెండు అంశాలకు సంబంధించిన అభివృద్ధి పనుల తీర్మానాలను వాయిదా వేయాలని సభ్యులు కోరారు. ఇంతలో జోక్యం చేసుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ అభివృద్ధి పనుల తీర్మానాలు ఎందుకు వాయిదా వేయాలో కారణాలు చెప్పడంటూ ప్రశ్నించారు.
టీడీపీ మహిళా కౌన్సిలర్లు స్పందిస్తూ కాంట్రాక్టర్లు కమీషన్లు ఇవ్వనందున వాయిదా వేయాలంటూ వివరణ ఇచ్చారు. ఈ విషయంలో చైర్ పర్సన్ భర్త గోవిందప్ప, మాజీ చైర్మన్ వైపీ రమేష్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రొటోకాల్ ప్రకారం కౌన్సిల్లో మహిళా ప్రజాప్రతినిధులు ఉండాలని, కుటుంబ సభ్యులు, వారి భర్తలు ఎలా హాజరవుతారని వైపీ రమేష్ ప్రశ్నించారు. పరిపాలన, అభివృద్ధి విషయాల్లో భర్త సహకారం తీసుకుంటే తప్పేముందంటూ చైర్పర్సన్ అన్నారు. మరో కౌన్సిలర్ హిమబిందు తమకు సూచనలు తీసుకోవడానికి భర్తల సహకారం తీసుకుంటామంటూ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతి కూడా అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకుంటున్నాడు కదా అంటూ చమత్కరించారు. ఈ సందర్భంలో మహిళా ప్రజాప్రతినిధుల భర్తలు, మిగిలిన కౌన్సిలర్ల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. రెండు అంశాలపై జరిగిన రగడతో రెండు తీర్మానాలు వాయిదా పడగా.. అజెండా పక్కదారి పట్టింది. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశులు, వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు సువర్ణ, కొల్లాపురప్ప తదితరులు పాల్గొన్నారు.