Hyderabad Metro Water Works
-
ఈ బురదనీళ్లు తాగలేం..
- గోదావరి జలాలపై పలు కాలనీల ప్రజల గగ్గోలు - నగరంలోని పలు కాలనీలకు గోదావరి జలాలు సరఫరా - నల్లాల్లో వస్తున్న బురద, మట్టితో కూడిన నీరు - కలుషిత నీటిని తాగి అనారోగ్యం పాలవుతున్న జనం - కాంట్రాక్టరు నిర్లక్ష్యం.. అసంపూర్తిగా మల్లారం ఫిల్టర్‌బెడ్స్? - ప్లాంట్ల నుంచి ఫిల్టర్ నీళ్ల కొనుగోలుతో జనం జేబులకు చిల్లు - నీటి నాణ్యత సరిగాలేక సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో నిలిచిన ఆపరేషన్లు.. రోగుల ఆందోళన సాక్షి, హైదరాబాద్ నల్లా నీరు బురదమయంగా ఉంటోంది. విధిలేక ఫిల్టర్ ప్లాంట్లు విక్రయిస్తున్న నీటిని కొనుగోలు చేస్తున్నాం. డిమాండ్ అధికంగా ఉండడంతో ప్లాంట్ల నిర్వాహకులు 20 లీటర్ల నీటి క్యాన్ ధరను రూ.30 నుంచి రూ.40కి పెంచేశారు. తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నాం. - శారద, కూకట్పల్లి గోదావరి జలాలు బురదతో వస్తున్నాయి. ఈ నీటిని కాచి చల్లార్చి తాగాలని అధికారులు చెపుతున్నా.. ఎటువంటి ఉపయోగం ఉండటం లేదు. ఈ నీటిని తాగడం వల్ల చిన్నా, పెద్దా అంతా గొంతు నొప్పి, జలుబుతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాం. - లక్ష్మి, కుత్బుల్లాపూర్ గోదావరి బురద జలాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు నిదర్శనం వీరి మాటలు. నల్లాల్లో నిత్యం బురద, మట్టి కలసిన నీళ్లు సరఫరా అవుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఫిల్టర్ ప్లాంట్లు విక్రయిస్తున్న నీటిని కొనుగోలు చేయాలంటే జనం జేబులు గుల్లవుతున్నాయి. సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నీటిసరఫరా నిలిచిపోవడంతో నగర శివార్లలోని ఘన్పూర్ రిజర్వాయర్‌కు 56 మిలియన్ గ్యాలన్ల గోదావరి జలాలను తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఈ నీటిని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, సనత్‌నగర్, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని పలు కాలనీలు, బస్తీలకు అరకొర నీటి సరఫరాతోపాటు బురద, మట్టి రే ణువులు కలసిన జలాలు సరఫరా అవుతుండటంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. బురద నీటి కారణంగా ఫిల్టర్‌నీటిని కొనుగోలు చేయాలన్నా.. నలుగురు సభ్యులున్న ఒక్కో కుటుంబం రోజుకు రూ.100 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అటు కుత్బుల్లాపూర్‌లో గోదావరి జలాలు సరఫరా అయి పక్షం రోజులు గడిచినా బురద నీళ్లే దిక్కయ్యాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో పేదలు ఈ నీటిని తాగి అనారోగ్యాల బారినపడుతున్నారు. గోదావరి రింగ్ మెయిన్-1 పైపులైన్లను శుద్ధి చేసి మూడు రోజుల్లో స్వచ్ఛమైన నీటిని అందిస్తామని జలమండలి అధికారులు ప్రకటించినా.. ఆచరణలో విఫలమయ్యారు. కాంట్రాక్టరు నిర్లక్ష్యమే కారణం.. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివార్లలోని ఘన్పూర్ వరకు మొత్తం 186 కి.మీ మార్గంలో గోదావరి పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయి. గోదావరి జలాలను శుద్ధి చేసేందుకు మల్లారం(కరీంనగర్ జిల్లా)లో ఉన్న నీటిశుద్ధి కేంద్రంలో 52 ఫిల్టర్‌బెడ్స్ ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం ఇందులో 17 మాత్రమే పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. వీటిపైనే రోజువారీగా నగరానికి తరలిస్తున్న 56 ఎంజీడీల గోదావరి రావాటర్‌ను అరకొరగా శుద్ధి చేస్తున్నారు. దీంతో గోదావరి జలాల్లోని బురద, మట్టి రేణువులు, చెత్తాచెదారం పూర్తిస్థాయిలో తొలగడం లేదని తెలిసింది. 52 ఫిల్టర్‌బెడ్స్‌ను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసే విషయంలో సదరు కాంట్రాక్టరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇవి పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే వరకు బురదనీళ్లతో జనానికి అవస్థలు తప్పే పరిస్థితి కనిపించడంలేదు. మరోవైపు బురద, మట్టి ఎక్కువ శాతం ఉండడంతో ఇళ్లల్లోని వాటర్ ఫిల్టర్లు చెడిపోతున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం నగరానికి నీటి సరఫరా ఇలా.. నగరానికి రోజువారీగా ఉస్మాన్‌సాగర్(గండిపేట్) నుంచి 3.50 ఎంజీడీలు, హిమాయత్‌సాగర్ నుంచి 5.50 ఎంజీడీలు, కృష్ణా మూడు దశల నుంచి 259.35 ఎంజీడీలు, గోదావరి నుంచి 56 ఎంజీడీలు.. మొత్తంగా 324.35 ఎంజీడీల నీటిని నగరంలోని 8.64 లక్షల నల్లాలకు జలమండలి సరఫరా చేస్తోంది. సరోజినిదేవి ఆస్పత్రిలో నిలిచిన ఆపరేషన్లు హైదరాబాద్: సరోజిదేవి కంటి ఆస్పత్రికి నీటి సరఫరా బంద్ కావడంతో మూడు రోజులుగా శస్త్రచికిత్సలను నిలిపేశారు. దీంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కొందరు రోగులు శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో ప్రతి రోజూ 50 నుండి 60 మంది రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తుంటారు. మూడు రోజుల నుంచి శస్త్రచికిత్సలు ఆగిపోవడంతో ఆపరేషన్లు చేయాల్సిన రోగుల సంఖ్య మూడు వందలకు చేరుకుంది. ఆస్పత్రిలో చేరిన రోగులకు శస్త్రచికిత్సలు చేయకపోవడంతో ఆపరేషన్లు చేసేటప్పుడు వేసే దుస్తులతోనే కొందరు రోగులు ఇంటిదారి పట్టారు. కాగా, ఆస్పత్రికి మూడు రోజులుగా నాణ్యత సరిగా లేని నీరు సరఫరా అవడంతో కాటరాక్ట్ ఆపరేషన్ల కోసం నగరంలోని నలు మూలల నుంచి వచ్చిన వారిని వెనక్కి పంపిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ వినోద్ ‘సాక్షి’కి తెలిపారు. అత్యవసర ఆపరేషన్ల నిమిత్తం దూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులకు మాత్రం ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. నాలుగు కనెక్షన్ల ద్వారా ఆస్పత్రికి సరఫరా అవుతున్న నీటి నాణ్యతను తెలుసుకునేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు నీటి నమూనాలు పంపించామని తెలిపారు. వారం తర్వాత రమ్మన్నారు.. ‘కనులు మసకబారడంతో గత నెలలో సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో చూపించుకున్నాను. ఈ నెల 9న శస్త్రచికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాను. దవాఖానాలో నీటి సమస్య ఏర్పడటంతో వారం తర్వాత రమ్మని డాక్టర్లు చెప్పడంతో ఇంటికి వెళ్తున్నా.’ - ఆషాం అలీ, అంబర్‌పేట -
వాటర్‌వర్క్స్ అసిస్టెంట్ పరీక్షకు 64.2 శాతం హాజరు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో వాటర్‌వర్క్స్‌లో ఫైనాన్స్ అండ్ అకౌం ట్స్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు 64.2 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్‌లలో ఏర్పాటు చేసిన 84 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించామన్నారు. హైదరాబాద్‌లోని 22 పరీక్ష కేంద్రాల్లో 76.74 శాతం, రంగారెడ్డి జిల్లాలోని 21 కేంద్రాల్లో 71 శాతం, కరీంనగర్‌లోని 17 కేంద్రాల్లో 51.2 శాతం, వరంగల్‌లోని 24 కేంద్రాల్లో 57.8 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజైరె నట్లు తెలిపారు. షేక్ బందగి స్వగ్రామం ఏది? టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న ప్రతి పోటీ పరీక్ష మాదిరిగానే ఈసారీ తెలంగాణ అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. మొత్తంగా చరిత్రకు సంబంధించి దాదాపు 30 ప్రశ్నలు అడగగా అందులో తెలంగాణకు సంబంధించినవి 22 వరకు ఉన్నాయి. భారత చరిత్రపై దాదాపు 8 ప్రశ్నలు వచ్చాయి. తెలంగాణ ఆధునిక చరిత్ర మీద ప్రశ్నలు వచ్చాయి. విస్నూర్ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా పోరాడిన షేక్‌బందగి స్వగ్రామం ఏది? హైదరాబాద్‌లో సాలార్జంగ్ మ్యూజియాన్ని స్థాపించింది ఎవరు? కొమరవెల్లి వీరభద్రస్వామికి ప్రాచుర్యంలో ఉన్న మరో పేరు? మిలియన్ మార్చ్ దేనికి సంబంధించింది? తదితర ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నల క్లిష్టత స్థాయి కఠినంగా ఏమీ లేదనీ, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సులువుగానే గుర్తించే విధంగా ఉన్నాయనీ నిపుణులు చెబుతున్నారు. * పాలిటీ నుంచి సుమారు 20 ప్రశ్నలు వచ్చాయి. ఇవి అభ్యర్థుల కనీస పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ఏ సవరణ ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్’ ఏర్పాటుకు అవకాశం కల్పించింది? ప్రస్తుత తెలంగాణ శాసనమండలి అధ్యక్షుడు ఎవరు? లాంటి ప్రశ్నలు అడిగారు. * భౌగోళిక శాస్త్రానికి సంబంధించి తెలంగాణ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదే శాలను వెలికితీసే విధంగా ప్రశ్నల రూపకల్పన ఉందని నిపుణులు అన్నారు. ముఖ్యంగా వంద స్తంభాల గుడి ఎక్కడ ఉందనే ప్రశ్నతో ఈ విషయం అర్థమవుతుందన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్న జిల్లా? మున్నేరు నది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది? అమ్రాబాద్ పులుల రిజర్వు ఏ జిల్లాలో ఉంది? తదితర ప్రశ్నలు వచ్చాయి. 2013 ఉత్తరాఖండ్ వరదల సందర్భంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ చైర్మన్ ఎవరు? అనే ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లు సరైనవి కావు, ఎన్డీఎంఏకు ప్రధాని చైర్మన్‌గా ఉంటారు. కానీ ప్రధాని పేరు ఆప్షన్లో లేదు కానీ అప్పటి వైస్ చైర్మన్ ఎం.శశిధర్‌రెడ్డి పేరు ఇచ్చారు. అదే విధంగా పిల్లలమర్రి ఎక్కడ ఉందనే ప్రశ్నను తెలుగులో ఇవ్వలేదు. * ఇంగ్లిష్ మీద అడిగిన ప్రశ్నలు చాలా సులువుగా హైస్కూల్ స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. జాగ్రత్తగా గుర్తిస్తే అడిగిన 15 ప్రశ్నలకూ సమాధానాలు రాయవచ్చంటున్నారు. అదేవిధంగా వర్తమాన అంశాలకూ ప్రాధాన్యం ఇచ్చారు. దినపత్రికలను క్రమం తప్పకుండా చదివేవారు సమాధానాలు గుర్తించే విధంగా ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. మ్యాథ్స్ విభాగం నుంచి వచ్చిన ప్రశ్నలు సులువుగానే ఉన్నాయని తెలిపారు. -
కృష్ణ.. కృష్ణా!
జిల్లా ప్రజలను తాగునీటి సమస్య వెంటాడుతోంది. రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటుతుండడంతో పరిస్థితి జటిలంగా మారుతోంది. గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. నీటి ఎద్దడి నివారణకు సర్కారు తలపెట్టిన కృష్ణా జలాల పంపిణీలో సమస్యలు తలెత్తాయి. హైదరాబాద్‌కు నీటిని సరఫరాచేసే క్రమంలో జిల్లా వాసులకు సైతం తాగునీరు అందించేందుకు ఎనిమిది పథకాలు ప్రవేశపెట్టింది. మొదట్లో ఈ పథకాలతో ప్రజలకు సాంత్వన లభించినా.. ప్రస్తుతం తాగునీటి కష్టాలు పునరావృతమయ్యాయి. జనాభా ప్రాతిపదికన నీరు కేటాయించాల్సి ఉన్నప్పటికీ.. జలమండలి అధికారులు సరఫరాలో భారీగా కోతలు పెడుతున్నారు. దీంతో జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా * తాగునీటి సరఫరాలో జలమండలి కోతలు * జనాభా ప్రాతిపదికన కొనసాగించని వైనం * రోజురోజుకూ తీవ్రమవుతున్న నీటి ఎద్దడి సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నీటి సరఫరాను హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్(హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) నిర్వహిస్తోంది. ఇవికాకుండా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి నిర్వహణ, బిల్లుల చెల్లింపుల ప్రక్రియ గ్రామీణ నీటిసరఫరా విభాగం చూస్తోంది. జిల్లాలో అమలవుతున్న ఎనిమిది రక్షిత మంచినీటి పథకాల (సీపీడబ్ల్యూఎస్) ద్వారా దాదాపు 320గ్రామాలకుపైగా కృష్ణా నీరు సరఫరా అవుతోంది. అయితే జనాభా ప్రాతిపదికన నీరు కేటాయించి సరఫరాచేస్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు. కానీ జనాభా సంఖ్యతో సంబంధం లేకుండా నీరు సరఫరా చేస్తుండడంతో సమస్యలు జటిలమవుతున్నాయి. వాస్తవానికి ఎనిమిది ప్రాజెక్టుల్లో రాజేంద్రనగర్ మినహాయిస్తే మిగతా ఏడు ప్రాజెక్టుల ద్వారా ప్రతి రోజు 36,742 కిలోలీటర్ల తాగునీరు సరఫరా చేయాలి. కానీ రోజువారీ అవసరాల్లో కేవలం సగం మాత్రమే సరఫరా చేస్తున్నారు. శంషాబాద్ ప్రాజెక్టు ద్వారా నీటిసరఫరా నిలిచిపోగా.. మిగతా ఏడు ప్రాజెక్టుల ద్వారా ప్రతి రోజు 17,890 కిలోలీటర్ల నీరు సరఫరా చేస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ గణాంకాలు చెబుతున్నాయి. ఈలెక్కన ప్రతిరోజు సరఫరా చేయాల్సిన దాంట్లో 19,952 కిలోలీటర్ల నీటికి జలమండలి గండి పెడుతోంది. ఫలితంగా జిల్లా ప్రజల తాగునీటి సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. 2001 జనగణనతోనే.. జిల్లాలోని ఎనిమిది సీపీడబ్ల్యూ పథకాలద్వారా 320 గ్రామాలకు రక్షిత మంచినీరు సరఫరా చేస్తున్నారు. ఇటీవల 2011 జనాభా గణాంకాల ఆధారంగా ఈ గ్రామాలకు నీటి సరఫరా చేయాల్సి ఉంది. వాస్తవానికి ఈ పథకాలకు సంబంధించి జలమండలితో 2011కు పూర్వమే ఒప్పందం కుదిరింది. ఈక్రమంలో 2001 జనాభా లెక్కల ఆధారంగా నీటి సరఫరాకు జలమండలి విడుదల చేస్తోంది. తాజాగా 2011 జనాభా లెక్కలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నీటి సరఫరా తాజా గణాంకాల ఆధారంగా చేయాల్సి ఉండగా.. ఇప్పటికీ పాత గణాంకాల ఆధారంగా సరఫరా చేస్తుండడంతో తాగునీటి సమస్య పరిష్కరం కావడం లేదు. -
మా నీళ్లు మాకే కావాలి
మంజీర ముంపు గ్రామ వాసుల పోరాటం సాక్షి, సంగారెడ్డి: మా నీళ్లు.. మా నిధులు.. మా ఉద్యోగాలు మాకే కావాలని ఆరు దశాబ్దాలుగా పోరాడిన నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల కల సాకారమవుతున్న తరుణమిది. మరికొన్ని రోజుల్లోనే తెలంగాణ ఏర్పాటు కాబోతున్న సమయంలో.. మా నీళ్లు మాకే కావాలని పల్లెలు నినదిస్తున్నాయి. దశాబ్దాలుగా సరఫరా అవుతున్న తాగునీటిని ‘హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్(హెచ్ఎండబ్ల్యూఎస్)’ యంత్రాంగం నియంత్రించి ఆ పల్లె ప్రజల గొంతులను నొక్కేసింది. దీంతో మా నీళ్లు మాకే కావాలని అక్కడి ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు. మంజీర డ్యాం కింద కలబ్‌గూరు, అంగడిపేట గ్రామాలు సర్వం కోల్పోయాయి. ఈ డ్యాం నిర్మాణం కోసం సుమారు వెయ్యి ఎకరాల పంట పొలాలను ఇక్కడి రైతులు ధారాదత్తం చేశారు. మూడు దశాబ్దాల కింద రైతుల నుంచి అత్యంత చౌకగా భూములు కొట్టేసిన నాటి ప్రభుత్వం ఇక్కడ డ్యాం నిర్మించింది. ఏ డ్యాం కోసమైతే నాడు భూములను ధారాదత్తం చేశారో అదే డ్యాం నీళ్ల కోసం ఉద్యమిస్తున్నారు ఆ గ్రామస్థులు. మంజీర డ్యాం నుంచి జంట నగరాలకు హెచ్ఎండబ్ల్యూఎస్ తాగు నీటిని తరలిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేసే పైప్లైన్ల ద్వారానే జిల్లా పరిధిలోని కలబ్‌గూరు, కంది, పోతిరెడ్డిపల్లి, చిట్కూల్, ఇస్నాపూర్, ముత్తంగి, రుద్రారం, లక్డారం, పోచారం గ్రామాలకు హెచ్ఎండబ్ల్యూఎస్ తాగునీటిని సరఫరా చేస్తోంది. ఆయా గ్రామ పంచాయతీలు, హెచ్ఎండబ్ల్యూఎస్ మధ్య ఏళ్ల కింద ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల మేరకు దశాబ్దాలుగా సరఫరా అవుతున్న నీళ్లను హెచ్ఎండబ్ల్యూఎస్ యాజమాన్యం మూడు రోజుల కింద కుదించింది. ప్రధాన పైప్లైన్ల నుంచి ఈ గ్రామాలకు నీళ్లను తరలించే పైప్‌లైన్‌కు మీటర్లు బిగించి..ఆ మీటర్ల ఆధారంగా నీటి సరఫరాను సగానికి తగ్గించేసింది. దీంతో ఈ గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ప్రధానంగా కలబ్‌గూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కలబ్‌గూరు, అంగడిపేట, గంజిగూడెం గ్రామాల్లో నీరు రాక జనం అల్లాడుతున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఈ గ్రామాలకు నీటి సరఫరాను కుదించాలని జిల్లా పరిషత్ సీఈఓ ఆశీర్వాదం ఇచ్చిన లేఖ ఆధారంగానే నీటి సరఫరాలో కోత విధించినట్లు హెచ్ఎండబ్ల్యూఎస్ జనరల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. గతంలో కలబ్‌గూరు పంచాయతీకి రోజూ 500 కిలో లీటర్ల నీటిని సరఫరా చేయగా.. ప్రస్తుతం 207 కిలో లీటర్లకు కుదించడంతో ఈ సమస్య తలెత్తింది. వ్యక్తికి 135 లీటర్ల నీటి చొప్పున లెక్కేసి 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ గ్రామాలకు నీటి కోటాను నిర్ణయించినట్లు హెచ్ఎండబ్ల్యూఎస్ పేర్కొంటోంది. నీటి సరఫరా చేసినా పంచాయతీలు ఏళ్ల తరబడి తమకు చార్జీలు చెల్లించడం లేదని వాదిస్తోంది. అయితే, హెచ్ఎండబ్ల్యూఎస్ సైతం తమ పంచాయతీకి ఎన్నడూ వాణిజ్య పన్ను చెల్లించలేదని కలబ్‌గూరు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మంగళవారం ఆ గ్రామ పెద్దలు జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రవికుమార్‌లను జెడ్పీ కార్యాలయంలో కలుసుకుని చర్చలు జరిపారు. ఆశీర్వాదం హెచ్ఎండబ్ల్యూఎస్ జీఎం ప్రవీణ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడి కలబ్గూరుకు నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. అయినా.. సమస్య పరిష్కారం కాకపోవడంతో తమ గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉన్న హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులతో తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమవుతున్నారు. బీరు కంపెనీలకు నీరు.. మంజీర నీటికి ఉన్న క్రేజ్‌ని సొమ్ము చేసుకునేందుకు మండల పరిధిలోని బీర్లు, శీతల పానీయాల ఉత్పత్తి పరిశ్రమలు వెలిశాయి. దీనికి హెచ్ఎండబ్ల్యూఎస్ విచ్చలవిడిగా నీటిని సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఒక వేళ ఇంటెక్ వెల్ వద్ద సమస్యలు ఉత్పన్నమైతే అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా ఈ పరిశ్రమలకు నీళ్లను అమ్ముకుంటున్న హెచ్ఎండబ్ల్యూఎస్.. సర్వం ధారపోసిన కలబ్‌గూరు గ్రామ పంచాయతీకి మాత్రం నీటి సరఫరాలో కోతలు విధించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హెచ్ఎండబ్ల్యూఎస్ యంత్రాంగం ఫక్తు వ్యాపార ధోరణితో వ్యవహరిస్తూ మండు వేసవిలో తమకు నీళ్లు ఇవ్వక ఇబ్బంది పెడుతున్నారని పల్లె ప్రజలు ఆరోపిస్తున్నారు.