పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికుడి హత్య
తలపై కిరాతకంగా మోది చంపిన ఉన్మాది
కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో కలకలం
కొవ్వూరు రూరల్: ఎక్కడి నుంచి వచ్చాడో.. ఎందుకు వచ్చాడో తెలియదు కాని ఓ వృద్ధుడిని అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ ఉన్మాది. చూడటానికి మతిస్థిమితం లేని వ్యక్తిగా కన్పిస్తున్నా దారుణంగా పంచాయతీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న వ్యక్తిని హతమార్చిన ఘటన కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో మంగళవారం వేకువజామున 5.20 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో కలకలం రేగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఐ.పంగిడి శివాలయం వద్ద ఉన్న చెరువుకు పంచాయతీ ఆధ్వర్యంలో వాకింగ్ ట్రాక్ నిర్మించి మొక్కలు నాటారు. సంపూర్ణ పారిశుద్ధ్యంలో భాగంగా అక్కడ ఎవరూ బహిరంగ మలవిసర్జన చేయకుండా పంచాయతీ కాంట్రాక్టు కార్మికుడైన ముప్పిడి చిన నాగయ్య (59)కు పరిశీలనా బాధ్యతలు అప్పగించారు. రోజూలానే మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో నాగయ్య విధులు నిర్వహించేందుకు అక్కడకు వెళ్లాడు. అదే సమయంలో పలువురు వాకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాడని వాకింగ్ చేస్తున్న మహిళలు చిన నాగయ్య దృష్టికి తీసుకువచ్చారు. చిన నాగయ్య అతని వద్దకు వెళ్లి ఇక్కడ ఉండకూడదు వెళ్లిపోవాలని సూచించాడు. దీనిపై ఆగ్రహించిన ఆ వ్యక్తి నాగయ్యపై దాడికి ఉపక్రమించి అతడిని కిందకు తోచి చేతిలో ఉన్న కర్రతో విచక్షణారహితంగా తలపై మోదాడు. దీంతో నాగయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అదే సమయంలో వాకింగు చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు, స్థానిక సర్పంచ్ భర్త పీకే రంగారావు, మరికొందరు ఇక్కడకు చేరుకుని ఉన్మాదిని పట్టుకున్నారు. కొవ్వూరు రూరల్ పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై ఎం.శ్యాంసుందరరావు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. నాగయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే హత్య చేసిన వ్యక్తి ఉన్మాదా.. లేక మతిస్థిమితం కోల్పోయినా వ్యక్తా అనేది తేలాల్సి ఉంది.
15 ఏళ్లుగా ఇదే వృత్తిలో..
ఉన్మాది దాడిలో మృతిచెందిన ముప్పిడి చిన నాగయ్య 15 ఏళ్లుగా ఐ.పంగిడి పంచాయతీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సౌమ్యుడిగా పేరున్న అతను వాకింగు ట్రాక్ వద్ద పరిశుభ్రంగా ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేవాడని స్థానికులు చెబుతున్నారు. చిన నాగయ్యకు భార్య వెంకాయమ్మ, వివాహమైన కుమార్తె మరియమ్మ ఉన్నారు.